మాజీ జర్నలిస్టుకు ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చాలామంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి గొండు శంకర్, పాతపట్నం నుంచి గోవిందరావు టిక్కెట్లు పొందారు. తాజాగా విజయనగరం పార్లమెంట్ సీటును కలిశెట్టి అప్పలనాయుడు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు కొత్త వారే కావడం విశేషం.

తెలుగుదేశం పార్టీలో కలిశెట్టి అప్పలనాయుడు సీనియర్. 25 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. రణస్థలం మండలం వియన్ పురం ఆయన స్వగ్రామం. ఎల్.ఎల్.బి చదువుకున్న ఆయన 1995లో ఈనాడులో జర్నలిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారు. రణస్థలం మండల రిపోర్టర్ గా బాధ్యతలు చేపట్టేవారు. 2000 ఏడాది వరకు జర్నలిస్టుగా ఉండి తరువాత టిడిపిలో చేరారు. ప్రతిభా భారతి శిష్యుడుగా ఉండేవారు. తమ్మినేని సీతారాం ప్రోత్సాహంతో పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ను అప్పలనాయుడు ఆశించారు. గత కొద్దిరోజులుగా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా టిడిపి కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చారు. కళా వెంకట్రావు వ్యతిరేకవర్గంగా ముద్రపడ్డారు. కింజరాపు కుటుంబ విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ దక్కలేదు. 2019లో ఎచ్చెర్ల సీటు కావాలని కోరారు. అయినా దక్కలేదు.

ఎచ్చెర్ల టికెట్ కావాలని కోరారు. కానీ ఎచ్చెర్ల సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో పార్టీ సర్వేల్లో విజయనగరం పార్లమెంట్ స్థానానికి అప్పలనాయుడు అయితే సరిపోతారని భావించి చంద్రబాబు ఆయన్ను ఖరారు చేశారు. మొత్తానికి అయితే ఈనాడు జర్నలిస్టుగా ఉండి టిడిపిలో చేరిన అప్పలనాయుడుకు 25 సంవత్సరాలు తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఛాన్స్ వచ్చింది. మరి ఆయన ప్రజాదరణ పొందగలరో? లేదో? చూడాలి.

Leave a Reply