వైఎస్ విమానం ‘కుట్ర’తోనే కూలిందా?

0
27

-కుట్ర చేసి తండ్రిని చంపారని షర్మిల సంచలన వ్యాఖ్య
-కొత్తగా షర్మిల రేపిన ‘పాత సందేహం’
-మళ్లీ తెరపైకి ‘హెలికాప్టర్ మృతి’ సందేహాలు
-రిలయన్స్ హస్తం ఉందని గతంలో ఆరోపించిన జగన్, విజయమ్మ, షర్మిల
-అప్పట్లో రిలయన్స్ షాపులపై వైసీపీ శ్రేణుల దాడులు
-అంబానీ మిత్రుడు నత్వానీకి రాజ్యసభ ఎంపీ ఇచ్చిన జగన్
-ఇప్పుడు మళ్లీ వైఎస్ మృతి వెనుక కుట్ర ఉందంటూ షర్మిల ఆరోపణ
-నత్వానీకి రాజ్యసభ ఇచ్చినప్పుడు స్పందించని షర్మిల, విజయమ్మ
-ఇప్పుడే బయటపెట్టడంలో ఆంతర్యమేమిటి?
-ఎమ్మెల్యేలతో జగన్ భేటీకి ముందురోజు షర్మిల బాంబు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పావురాలగుట్టలో నేలకొరిగిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘హెలికాప్టర్ మృతి’ వెనుక కుట్ర దాగుందా? అది వాతావరణంలో హటాత్తుగా వచ్చిన మార్పుల వల్ల జరిగింది కాదా? కావాలనే వైఎస్‌ను అంతమొందించేందుకు జరిగిన కుట్రనా?.. వైఎస్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల చేసిన తాజా

ఆరోపణలు ఇలాంటి అనుమానాలనే తెరపైకి తెస్తున్నాయి. ‘మా నాన్నను కుట్ర చేసి చంపేశారం’టూ షర్మిల చేసిన ఆరోపణ ఎవరిని ఉద్దేశించి చేసింది? అది ఎవరిపై సంధించిన అస్త్రం?.. ఇదీ షర్మిల కొత్తగా తెరపైకి తెచ్చిన, ‘వైఎస్ అనుమానాస్పద మృతి’ ‘పాత కథ’ చర్చ.

కథ పాతదే. అప్పట్లో అందరిలోనూ గూడుకట్టుకున్న అనుమానమే. బాధిత కుటుంబం యావత్తూ చూపుడు వేలుతో చూపిన వారిపైనే అందరి అనుమానాలూ. కాలగమనంలో దానిని అంతా మర్చిపోయారు. గాయం మానడమే కాదు. గాయపరిచారని ఆరోపించిన కుటుంబమే, ‘గాయపరిచిన’ వారిని పిలిచిఎంపీ పదవి ఇచ్చింది. కాకపోతే చాలా ఏళ్ల తర్వాత.. స్వయంగా మహానేత ముద్దుల కుమార్తెనే, తన తండ్రి మృతి వెనుక కుట్ర ఉందంటూ పేల్చిన బాంబు, ఇప్పుడు వైసీపీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ ఆయన కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల చేసిన సంచలన ఆరోపణ, రాజకీయ వర్గాల్లో తుపాను రేపుతోంది. దీనితో సహజంగానే వైఎస్ హెలికాప్టర్ మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి వైఎస్ హెలికాప్టర్ కూలిపోవడం వెనుక రిలయన్స్ అధినేత అంబానీ హస్తం ఉందని జగన్, విజయమ్మ, షర్మిల అప్పట్లోనే ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో రిలయన్స్ విస్తరణకు వైఎస్ అడ్డుపడుతున్నారన్న ఆగ్రహంతోనే, ఆయనను అడ్డుతప్పించారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

వైఎస్ మృతి వార్తతో కుమిలిపోయి ఉన్న ఆయన అభిమానులకు, ఆయన కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలు తోడయిన ఫలితంగా.. ఉమ్మడి రాష్ట్రంలోని రిలయన్స్ షోరూములు ధ్వంసమయ్యాయి. వైఎస్ అభిమానుల ఆగ్రహానికి అనేక రిలయన్స్ షోరూములు దగ్ధమయిపోయాయి. వారిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు కూడా నమోదయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత జగన్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ హెలికాప్టర్ అంశం మరుగునపడిపోవడం జరిగిపోయింది. అయితే హటాత్తుగా రిలయన్స్ కంపెనీకి చెందిన పరిమళ్ నత్వానీ విజయవాడ రావడం, ఆయనకు వైసీపీ నుంచి రాజ్యసభ టికెట్ ఇవ్వడం, రిలయన్స్ షాపులపై దాడుల కేసులను ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి. అయితే..వైఎస్ మృతికి రిలయన్స్ అధినేత కారణమంటూ ఆరోపించిన విజయమ్మ గానీ, ఆయన కుమార్తె షర్మిల గానీ.. నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించలేదు. ఆ మేరకు వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కూడా మీడియాలో ఎక్కడా కనిపించలేదు.

కానీ ఇప్పుడు హటాత్తుగా షర్మిల తన తండ్రి వైఎస్ మృతిలో కుట్ర ఉందని, తనని కూడా చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. షర్మిల ఏ లక్ష్యంతో, ఎవరిని ఇబ్బందిsharmilaపెట్టేందుకు తండ్రి హత్య కోణాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. దానితోపాటు.. ఇన్నాళ్లూ తండ్రి మృతిపై మౌనంగా ఉండి, రిలయన్స్ కంపెనీకి చెందిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా జగనన్నను ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న షర్మిల, ఇప్పుడెందుకు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న సందేహం కూడా చర్చకు వస్తోంది.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని.. ప్రశాంత్‌కిశోర్ బృందం నివేదిక ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో వైఎస్ మృతికి సంబంధించి షర్మిల కుట్ర కోణాన్ని ఆవిష్కరించడం వైసీపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

అయితే షర్మిల వైఎస్ మృతి అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడంపై అటు రాజకీయ వర్గాల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది. ‘వైఎస్ మృతిపై అనుమానం ఉన్నప్పుడు ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, రాష్ట్రపతికి లేఖలు రాసి విచారణ కోరి ఉండాల్సింది. అవేమీ చేయలేదు. పోనీ పరిమళ నత్వానీకి ఎంపీ సీటు ఇచ్చినప్పుడు జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించాల్సింది. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు రోడ్డెక్కితే, షర్మిల ఇప్పటిదాకా వివేకా హత్యపై మాట్లాడలేదు. నిజంగా జగన్‌తో ఆమెకు విబేధాలున్నట్లయితే వీటిపై, షర్మిల బహిరంగంగా మాట్లాడాల్సి ఉంద’ని తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు- మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యానించారు.

అయితే, తాము ముందు నుంచీ వైఎస్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నామని వైఎస్సార్‌టీపీ అగ్రనేత గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. ‘‘వైఎస్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురాకుండా, పోస్టుమార్టం చేయకుండా, సంఘటనా స్థలంలో ఎగిరపోయిన శరీర భాగాలు సేకరించకుండా, విమాన శక లాలు పూర్తిగా సేకరించకుండా చేసిన హడావిడి, అనేక అనుమానాలకు తావిచ్చింది. కాబట్టి వైఎస్ మృతి గురించి షర్మిల ఇప్పుడు చెప్పడం కాదు. మేము కూడా అప్పటినుంచే చెబుతూనే ఉన్నాం’ అని గట్టు వివరించారు.