Suryaa.co.in

Entertainment

సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీరంగానికి తీరని లోటు : మండలి బుద్ధప్రసాద్

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. సాహసానికి ప్రతీకగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుకి కృష్ణ అత్యంత సన్నిహితులు.

1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిధులు సేకరించడంలో కృష్ణ ప్రముఖపాత్ర వహించారు. 1977 మే లో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నటకోత్సవాలకు తన సతీమణి విజయనిర్మలతో2 కలిసి వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు. 1977 నవంబర్ 19 న దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 10 వేల రూపాయలు విరాళం ప్రకటించడమే కాకుండా, లక్ష రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక సంవత్సరం పాటు తనకు వచ్చే ఆదాయంలో 10 % తుఫాను బాధితులకు అందచేసిన దయార్దహృదయులు.

కృష్ణ చేత మంగళగిరిలో స్టూడియో నిర్మాణం చేయించాలని మా నాన్న స్వయంగా వెళ్లి స్థలాన్ని ఎంపిక చేసారు. దురదృష్టవశాత్తు అది ఏ కారణం వల్లనో కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత హైదరాబాద్ లో పద్మాలయా స్టూడియో నిర్మించారు.

“హీరో” అనేది ఆయనకు ఇంటి పేరయింది. సినిమా రంగంలోనే కాక, నిజ జీవితంలో కూడా “హీరో” అని అనిపించుకున్న కృష్ణ మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.

LEAVE A RESPONSE