తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐదున్నర దశాబ్దాలపాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.
తెలుగు సినిమాతెరపై ‘జేమ్స్ బాండ్’ జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ చరిత్రలో సాంకేతికకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి.. తెలుగు చిత్రపరిశ్రమ ‘సింహాసనం’ను అధిష్టించారు.
కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమన్న సందేశాన్నిస్తూ.. 24 గంటలు పనిచేయడం, ఏడాదికి 10 సినిమాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని పూర్తి చేసేలా శ్రమించేవారు. రికార్డు స్థాయిలో 2500పైగా అభిమాన సంఘాలుండటం కృష్ణ గారి నటనపై ప్రజల్లో ఉన్న అభిమానానికి, గౌరవానికి నిదర్శనం.
దేశభక్తి చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, సమాజాన్ని జాగృతం చేసే సినిమాలు, యువత, కార్మికులు, కర్షకులు, ఇలా ప్రతి రంగాన్ని ప్రోత్సహించేలా, స్ఫూర్తినింపేలా వారు తీసిన చిత్రాలకు లభించిన ఆదరణ మనందరికీ తెలిసిందే. ఇటీవల రంపా ఉద్యమ శతాబ్ది సందర్భంగా అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల్లో పర్యటించిన సమయంలోనూ కృష్ణని గుర్తుచేసుకున్నాము. తెలుగు ప్రజల గుండెల్లో అల్లూరిని ఆరాధ్య దైవంగా నిలిపిన ఘనత కృష్ణకే చెందుతుంది.
టాలీవుడ్ స్థాయిని పెంచిన సూపర్ స్టార్ గారు మన మధ్యన లేకపోవడం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అశేష అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.