సీతయ్య.. ఎవరి మాటా వినడు..!

సినిమా సంగతేమో గాని
నిజజీవితంలో అంతే..
అనుకున్నది అనెయ్యడమే..
అవతల ఉన్నది
అయ్య రామయ్య కాని..
బావ చంద్రబాబే అవనీ..
బద్దలుకొట్టడమే కుండ..
తొణకని నిండు కుండ..
నందమూరి హరికృష్ణ..!

ఎన్టీఆర్ పెద్ద హీరో అయిపోయి
మకాం మద్రాసుకు మార్చినా
నిమ్మకూరును వదలని హరి
అక్కడ తాతల
చేతి ముద్దలు తిన్నాడు
కొసరి కొసరి..
పల్లెటూరి వాటం..
పట్టిందే హటం..
మంచి దగ్గర మొహమాటం..
నచ్చకపోతే..నప్పకపోతే
లొంగని మొండిఘటం..!

శ్రీకృష్ణావతారంలో
బుల్లి క్రిష్ణయ్య..
అచ్చంగా అయ్యే..
తమ్ముడు బాలయ్యతో జతకట్టి
రామ్ రహీమ్..
దానవీరశూరకర్ణలో గాంఢీవి..
తండ్రికి తగ్గని ఠీవి..!

నందమూరి చైతన్య రథసారథి..
అలుపెరుగని చోదన..
నాన్నలాగే
విరామం లేని సాధన..
జనకుడిపై అంతులేని భక్తి..
ఏం నమ్మాడో..ఏం చూసాడో
ఆగస్టు సంక్షోభంలో
తానే ఘింకరించే గజమై..
బావ బాబుకి కుడి భుజమై..!

రాజకీయాలు నప్పని
ముక్కుసూటి హరి..
లాహిరి లాహిరి లాహిరి..
పైకప్పు లెగరేసే మనిషి
స్టెప్పులేసి టాపులేపాడు..
కలెక్షన్ల వర్షమూ కురిపించాడు..!

గజఈతగాడి చావు
ఈతలోనే అన్నట్టు..
నాన్నతోనూ..నాన్న లేకుండా
ఎన్నివేల కిలోమీటర్లు
కారు నడిపాడో..
అదే కారు ప్రమాదంలో
హరి..హరీ..!

సురేష్ కుమార్ ఇ
9948546286

Leave a Reply