ప్రాంతీయ పార్టీలతోనే మన ఆత్మగౌరవం

విలీనం, విమోచనం కన్నా సమైక్యత అన్న పదం సుహృద్భావభరితంగా ఉన్నది కదూ! కేసీఆర్ కు మాత్రమే అలాంటి ఆలోచనలు వస్తాయి. విడదీసి పాలించే చెత్త పదాల కన్నా అందరం కలిసిమెలిసి ఉందామనే సందేశం ఇస్తున్న కేసీఆర్ నిర్ణయం ఆచరణయోగ్యం.

జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం పోరాడుతున్నాయి. అందులో తప్పు లేదు. తమిళనాడులో అరవై ఏళ్ళక్రితమే జాతీయపార్టీలను తరిమేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలభై ఏళ్ళక్రితం జాతీయపార్టీ పాలనను అంతమొందించారు ఎన్టీఆర్. ఆ తరువాత మళ్ళీ కాంగ్రెస్ మూడు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రం చీలిపోయాక తెలంగాణాలో టీఆరెస్ అనే బలమైన రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఆ పార్టీకి సహజ కవచకుండలం లాంటిది. కేసీఆర్ సమర్ధవంతమైన పాలనతో రెండోసారి కూడా అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. కేసీఆర్ మీద ఎలాంటి మచ్చా లేకపోవడం, అంతులేని సహనం, పాలనాదక్షత, ఆయనకున్న జ్ఞానసంపద ఆయనకు పెట్టని ఆభరణాలు. ఆ మెరుపే ఆయనకు మూడోసారి అధికారం తీసుకునిరాబోతుంది. ఏవిధంగా చూసుకొన్నా రాబోయే ఎన్నికల్లో టీఆరెస్ 75 స్థానాలను సాధించే అవకాశం ఉన్నది. బీజేపీకి ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో అంత సన్నివేశం లేదు. ఉత్తర తెలంగాణాలో వారికి అయిదారు సీట్లు రావచ్చు. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబడుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ అనే రెండు బలమైన ప్రాంతీయపార్టీలు ఉన్నాయి. సీట్ల సంఖ్యను పక్కనపెడితే తెలుగుదేశం పార్టీకి ముప్ఫయి అయిదు శాతం, వైఎస్సార్సీపీకి యాభై శాతం ఓటుబ్యాంక్ పటిష్టంగా ఉన్నది. మధ్యలో దూరాలని ఇటీవల బీజేపీ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నది. జనసేన సత్తా ఏమిటో ఇంతవరకు తెలియదు. ఏమైనప్పటికీ మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు లెక్క.

ప్రస్తుతం జనం చాల తెలివిమీరారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయపార్టీల మీద వారికి స్థిరాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో జాతీయపార్టీలను మళ్ళీ ఆహ్వానించడం సబబేనా అనే ఆలోచనలు సాగుతున్నాయి బుద్ధిజీవుల్లో. జాతీయపార్టీల పాలన అంటే కేవలం బానిసత్వమే. కాలు పెట్టుకోవడానికి చోటు ఇమ్మని బతిమాలిన ఒంటె, చివరకు గుడారం మొత్తాన్ని ఆక్రమించి, యజమానిని బయటకు తరిమిన అరేబియన్ నైట్స్ కథ అందరికీ తెలుసు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీ వెళ్ళాలి. అధిదేవతల అనుగ్రహం కోసం ఎదురుచూడాలి. ప్రతినెలా సూట్కేసులు తీసుకెళ్లి అధిష్టానం పెద్దల పాదాలకు సమర్పించుకోవాలి. బలమైన కేంద్ర మంత్రులను ప్రసన్నం చేసుకోవాంటే “కానుకలు” సమర్పించుకోవాలి. ఆ దోపిడీ సొమ్మంతా రాష్ట్రాల సంపదను దోచుకుంటేనే సాధ్యం అవుతుంది. వారు రాష్ట్రాలకు వచ్చినపుడు విమానాశ్రయాలు వెళ్లి వంగివంగి నమస్కారాలు చెయ్యాలి. అవసరం అయితే వారి చెప్పులను సైతం మొయ్యాలి. ఆ విషయం ఈ మధ్య కూడా రుజువైంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరుగురు వృద్ధ కాంగ్రెస్ నేతలు సోనియాను కలవాలని ఢిల్లీ వెళ్లి మకాం వేస్తె ఏడురోజుల తరువాత కూడా ఆమె అపాయింట్మెంట్ దొరక్క వెనక్కు వచ్చేశారు.

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్, చంద్రబాబులు స్థానికులు. వీరు అధికారంలో ఉంటే మనవాళ్ళు ఉన్నట్లే లెక్క. వారానికోసారి ఢిల్లీ వెళ్లి అక్కడ చదివింపులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు. కావాలంటే జాతీయస్థాయిలో జాతీయపార్టీలను ఎన్నుకోవచ్చు. రాష్ట్రాల్లో ఎంతో కష్టించి నిర్మించుకున్న సొంత ఇళ్లను కూలగొట్టుకోవద్దు. ప్రాంతీయపార్టీలతోనే ఆత్మగౌరవం ధ్వజస్తంభంలా నిలబడుతుంది.

-ఐ.మురళీ మొహన్‌రావు

Leave a Reply