Home » కిల్లా[THE FORT] మరాఠి సినిమా

కిల్లా[THE FORT] మరాఠి సినిమా

జైగడ్ కోట 16శతాబ్దంలో బిజాపూర్ సుల్తానులచే నిర్మింపబడి,ఆ తర్వాత పిష్వాల చేతుల్లోకి,తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది.మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఈ కోట వుంది.అలాగే 1832లో నిర్మింపబడిన లైట్ హౌస్ గూడా ఈ అరేబియా సముద్రతీరంలో ఈ కోటకు దగ్గరలోనే వుంది.ఈ రెండు ప్రతీకలుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు.అందుకే ఈ సినిమాకి కిల్లా [కోట]అనే పేరు పెట్టారు.
26 జూన్ 2015 లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ మరాఠిసినిమా అవార్డు,అంతర్జాతీయ బెర్లిన్ చిత్రోత్శవంలో క్రిస్టల్ బేర్ ని సొంతం చేసుకుంది.
కతలో కొస్తే, చిన్మయి[ఆర్కిడ్ ధియోడర్] 11ఏళ్ల, ఏడవ తరగతి చదువుతున్న పిల్లవాడు.ఏడాది కిందటే అతని తండ్రి చనిపోయాడు.తల్లి అరుణ[అమృత సుభాస్]పూనా సిటీ లోని రెవిన్యూ డిపార్టుమెంటు నుండి కొంకణ్ తీరంలోని ఒక గ్రామానికి ప్రమోషన్ మీద పంపబడుతుంది.
పూనా లో క్రమశిక్షణ కలిగిన ఒక పేరున్న పెద్ద స్కూల్ లో తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకుని, మెరిట్ స్కాలర్ షిప్ తెచ్చుకున్న చిన్ను ఇప్పుడు తల్లితో పాటు ఆ చిన్నవూరిలోని బడిలో చేరవలసి వస్తుంది.
పల్లెలోని,ఆ కొత్తబడిలో అడుగు పెట్టిన తొలిరోజే చిన్నూకి, ఆ బడి ఒక యుధ్ధభూమిలా కనిపిస్తుంది.బల్లలపై పిల్లల దరువులు,దానికనుగుణంగా డాన్సులు,బల్ల లెక్కి కొట్టుకుంటున్న పిల్లలు,ముష్టి ఘాతాలు,యూనిఫాం ,బూట్లు సరిగా వేసుకోని పిల్లలు అంతా తికమకగా అనిపిస్తుంది.పిల్లలెవరూ సొంత పేర్లతో పిలుసుకోరు.అన్నీ వెక్కిరింతల మారుపేర్లే.ఒకడు అండా[గుడ్డు]ఇంకొకడు యువరాజ్ వీడి నాన్న దుబాయ్ లో పనిచేస్తూ,వీడు అడిగిందల్లా కాదనకుండా కొనిస్తుంటాడు.ఒకడు లంబా,ఇలా చివరికి చిన్నుకి గూడా ఐన్ స్టీన్ అనే పేరు తగిలిస్తారు..పల్లెలో ప్రక్రుతి ఒడిలో పెరుగుతున్న ఆ పిల్లల ఆటపాటలు చిన్నూకి విస్మయం కలిగిస్తాయి.
చివరకు ఆ పిల్లలు చిన్నూ ని తమలో కలుపుకుంటారు.ఇక వాళ్ళతో కలిసి సంతోషంగా కొంకణ్ సముద్రతీరంలో చేపలు,పీతలుపట్టటం,చెట్లెక్కి ఆడటం,కొబ్బరికాయలతో ఆటలు,టేబుల్ మీద దరువులు,టాయి లెట్లో గోడ మీద రాతలు,పుస్తకాల సంచిలో వానపాములు తేవటం,ఆ ఎరలు తో చేపలు పెట్టటం,.స్కూల్ లో తోటి పిల్లలకు రాని లెక్కలు చెబుతూ,వాళ్ళ స్నేహాన్ని సంపాదిస్తాడు.
ఒకరోజు,చిన్ను తల్లితో కలిసి సముద్రతీరంలో వున్న లైట్ హౌస్ చూడటానికి వెళ్తాడు.గైడ్ అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1832 లో జాన్ ఆస్వాల్డ్ అనే బ్రిటిష్ దొర కట్టించాడని,దాని ఎత్తు 135 అడుగులు,అని అది ఎలా పనిచేస్తుందో,చూపించి వివరిస్తాడు.ఇక్కడ దర్శకుడు చిన్నూతో పాటు, ప్రేక్షకులను గూడా ఆ లైట్ హౌస్ లోకి తీసుకెళ్ళి,చూపిస్తాడు… దూరాన కనిపిస్తున్న ఓడల్ని చూస్తూ,చల్లనిగాలి పిలుస్తూ,ప్రకృతిలో పరవశిస్తూ,చిన్ను చక్కని కవిత్వం చెబుతాడు.భర్తను గుర్తు తెచ్చుకుని బాధపడుతున్న తల్లిని ఓదార్చుతాడు.
ఒకరోజు పిల్లలంతా సైకిల్ పోటీలు పెట్టుకుని జైగడ్ కోట వరకూ వెళ్తారు.ఆ గ్రామీణ పిల్లలకు ఆ కోటలోకి ఎలా వెళ్ళాలో,రావాలో తెలుసు.ఆ కోట 13 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది.చిన్ను కోటలో తప్పిపోయి వెలుపలకు రాలేకపోతాడు.ఓ పక్క వాన.భయపడతాడు.పిల్లలంతా చిన్ను కోసం వెతికివెతికి వెళ్ళిపోతారు.చివరకు కోటలోనుండి,బయట పడతాడు.దీనితో కోపం వచ్చిన చిన్ను ఆ పిల్లలతో మాట్లాడడు.వాళ్ళలో భలేరావు చిన్నూని కలుపుకుందామని ఎంత ప్రయత్నించినా,కలవడు.
ఈ లోగా తల్లికి ఆఫీస్ లో చికాకులు మొదలవుతాయి.నిజాయితీగా వుండే ఆమెను ఒక డబ్బున్న కాంట్రాక్టర్ NOC లేకుండానే,సంతకాలు చేయమని బెదిరిస్తుంటాడు.ఈ విషయమై హెడ్ ఆఫీస్ నుండి పిలుపు వస్తుంది.వాళ్ళు చూసి,చూడనట్లు పోవాలి.లేకపోతే నీకే ప్రమాదం అని హెచ్చరించి,పంపుతారు.
తల్లి దిగులుగా వుండటం,చిన్ను స్నేహితులకు దూరమవటం.తల్లికి చెప్పకుండా చిన్ను బెస్తవానితో కలిసి సముద్రం లోపలికి వెళ్ళటం,ఇవన్నీ .తల్లి గమనించి అతని స్నేహితులను భోజనానికి ఇంటికి పిలుస్తుంది.
చిన్ను కాస్త కుదురుకునే సరికి,నిజాయితీగా,ఉద్యోగంలో నిక్కచ్చిగా వుండే తల్లికి మళ్లీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి.చిన్నూకి మళ్లీ కొత్త స్కూల్.ఇలా తరచుగా బదిలీ అయ్యే ఉద్యోగుల పాట్లు,ఆ చిన్నపిల్లల మానసిక స్తితిగతులు దర్శకుడు చక్కగా చూపించారు.కొంకణ్ సముద్రతీర అందాలు,అడవులు,ఆ ప్రాంతంలో ఎప్పుడూ పడే వానలు,ఆ ప్రక్రుతి చక్కగా చూపించారు.అమృత సుభాస్ నటన,చిన్ను[ఆర్కిడ్ ]అతని స్నేహితుల నటన,స్కూల్ లో మాథ్స్ సర్ నటన,పిల్లలు మాథ్స్ ఎక్ష్జామ్ లో పడే పాట్లు,సంగీతం క్లాసు కడుపుబ్బా నవ్విస్తాయి.చూడదగ్గ సినిమా..దర్శకుడు,సినిమాటోగ్రాఫర్ అవినాష్ తరుణ్..కత తుషార్ పరంజపే..సంగీతం నరేన్ చందావాకర్..netflis లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది..

– పూదోట శౌరీలు,
బోధన్

Leave a Reply