Suryaa.co.in

Entertainment

సాహో సర్దార్ పాపారాయుుడు..

1980 వరకు
ఇట్టాంటి ఓ సినిమా
నా కంట పడలేదు..
పడినాక అలాంటి బొమ్మ
మళ్లీమళ్లీ చూడలేదు..!

తారక రామారావుకు
మాత్రమే చెల్లిన అభినయం
ఆయనకే నప్పే ఆహార్యం..
ఎన్టీఆర్ ఒక్కడే
చెప్పగలిగే డైలాగులు..
గంభీరమైన స్వరం
భీకరంగా కనిపించినా
గుబురు గడ్డం మాటున అందమైన
నందమూరి మోము
ఒడలు గగుర్పొడిచే సన్నివేశాలు..
జాతి ద్రోహిగా ముద్రపడిన
నాయకుడి దేశభక్తి..
సత్యం,ధర్మం..న్యాయం పేరిట ప్రతినాయకుల
దేశద్రోహం..
గుండెల మీద కొట్టుకుంటూ
ఈ పాపారాయుడు
నిద్రపోడు బాబా…నిద్రపోడు..
ఎప్పటికీ చెరిగిపోని
ఆ ముద్ర..
నాటికీ..నేటికీ..ఏనాటికీ
ఓ చరిత్ర..
సర్దార్ పాపారాయుడు!

హాల్లో టెంపర్..
విజయా సూపర్..
అప్పటికే విరిగిన చెయ్యికి కట్టుకట్టి నిర్మాతకు
నష్టం ఉండకూడదనే సంకల్పంతో
షూటింగ్ చేసిన
నందమూరి సిన్సియారిటీ..
పోనీ ఒక పాత్రా..
ద్విపాత్రాభినయం…
డైలాగులు దండి..
రామారావుకు కొట్టిన పిండి..
పిచ్చివాడా నీ వయసు
నా అనుభవమంత లేదు..
పాతికేళ్ల నా నిజాయితీ పాతికేళ్లుగా పాతబడిపోయింది
ఆ నిజం రుజువు కావడానికి ఇంకో పాతికేళ్ళు పడుతుంది..
వ్యవస్థల గుడ్డలిప్పుతూ
దాసరి రచన..
ఎన్టీఆర్ వచన..
సాహో సర్దార్..!

మా వంటవాడు భారతీయుడు
మా పనివాడు భారతీయుడు..
అంటూ తెల్లదొరగా
మోహన్ బాబు డైలాగులు..
వెంటనే పాపారాయుడి మాటల ఫిరంగులు..
మీ చెప్పులు కుట్టేవాడు భారతీయుడు..
చివరకు మీ ప్రాణం తీసేది కూడా ఆ భారతీయుడే..!
ప్రతి పదం..ఓ శపథం..
సంగ్రామంలో లేని పాత్రే అయినా ఉన్నట్టుగానే
ఓ చరిత్ర..
ఊపిరి పోస్తూ ఎన్టీఆర్ పోషించిన ఆ పాత్ర!

అల్లూరి పాత్ర
రామారావు కల
ఈ సినిమాలో పోషించి..
జనాల్ని మెప్పించి..
ఆ వయసులోనూ
ఆహా అనిపించిన గెటప్పు..
ఏ పాత్ర వేసినా అచ్చంగా సరిపోయే మేకప్పు..
అన్నట్టు సెంచరీకి చేరువలో
కలిసిన జ్యోతిలక్ష్మి పాట..
ఆమె కడితే చీరకే సిగ్గొచ్చిందట
అంతా దర్శకరత్న
నడిపించిన బొమ్మలాట!

సూటేసుకున్న ప్రతివోడు
జంటిల్మేను కాడు..
బూటేసుకున్న ప్రతివోడు
మిలటరీ మేనూ కాడు..
ఇలాటి డవిలాగులు
రావు గోపాలరావే చెప్పాలి…
ఈ పక్కన శనిగ్రహం అల్లు
ఆ పక్కన
నిండైన విగ్రహం కైకాల..
ఎన్టీఆర్ ద్విపాత్రం..
ధీటుగా విలనీత్రయం..
అటు తండ్రి నందమూరి..
ఇటు కొడుకు రామారావు..
మధ్య నలిగిన శారద..
పెద్దబ్బాయి.. చిన్నబ్బాయి..
ముద్దుమాటల శ్రీదేవి..
సినిమా హిట్టులో తలోచెయ్యి..
పాపారాయుడు అలాసాగాడు
నూరురోజులు రయ్యిరయ్యి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE