Suryaa.co.in

Entertainment Telangana

50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత

-సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్
-ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం కోసం పాటుపడతాం
-ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరును మోడీ మరింత విస్తృత పరిచారు
-తెలుగుజాతి నెంబర్ – 1 కావాలన్నదే నా కల
-మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-శిల్పకళా వేదిక సహా సైబరాబాద్ అభివృద్ధిని కార్యక్రమంలో మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: 50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీమోహన్ ఘనత అని, కొందరు వ్యక్తులకే అది సాధ్యమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ అయ్యారని మురళీమోహన్ ను చంద్రబాబు ప్రశంసించారు. ఎమ్.ఎమ్.ఎమ్ (మాగంటి మురళీ మోహన్) 50 ఏళ్ల సినీప్రస్థానం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన ‘తెలుగునేల గౌరవం…తెలుగు సినీ గాంఢీవం’ అనే పాటను ఆవిష్కరించారు. అతిథులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…ఎన్నో రోజులు తర్వాత ఈ శిల్పకళావేదికకు రావడంతో పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రంగానికే పరిమితం అవుతారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పాత్రలు ఎవరూ వేయలేరు. మళ్లీ ఆయన పుట్టి వస్తే తప్ప ఆ పాత్రలు వేయడం సాధ్యంకాదు.

దేశ రాజకీయాలనూ మార్చి నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో వుండే వ్యక్తి..తెలుగు జాతి బతికున్నంతకాలం వినబడే వ్యక్తి ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ వరఒడి తీసుకొచ్చారు. మురళీ మోహన్ 350 సినిమాల్లో నటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ తప్పకుండా ప్రచారం చేసేవారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడి ప్రజలకు సేవలందించారు. మురళీమోహన్ మనసుపెట్టి ఏ పనైనా చేస్తాడు. సినిమా రంగంలో ప్రాధాన్యం కోల్పోతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అయినా మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా 20 సినిమాలు నిర్మించారు.

నేను హైటెక్ సిటీ కడితే..దాని పక్కన జయభేరి ఎస్టేట్స్ తో బ్రహ్మాండంగా నిర్మాణాలు చేశారు. 36 ఏళ్ల నుండి నిరంతరాయంగా అయ్యప్ప దీక్ష చేపట్టడం గర్వకారణం. మురళీమోహన్ ఒక అలుపెరగని వీరుడు. 11 వందల మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసి వారి జీవితాలు మార్చారు. 1978లో నేను, వెంకయ్యనాయుడు రాజకీయాల్లోకి వచ్చాం. అప్పట్లో వెంకయ్య నాయుడును చూస్తే అసెంబ్లీ గడగడలాడేది. 1984లో ఎన్టీఆర్ ను సీఎంగా తొలగిస్తే వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నా ఎన్టీఆర్ కు అండగా ఉండి సీఎం అయ్యేదాకా నిలబడ్డారు. తీసుకున్న పదవులకే వన్నెతెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆయనకు పద్మవిభూషన్ రావడం తెలుగుజాతికే గర్వకారణం. పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా దేశానికి విశేషమైన సేవలందించారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా నేటికీ బ్రహ్మాండంగా సేవలందిస్తున్నారు.

గతంలో ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండేవి..కనీసం జీపులు కూడా వచ్చేవి కాదు. అయినా ఇక్కడ హైటెక్ సిటీ నిర్మించాను. దేశంలోని నిష్ణాతులందరినీ పిలిచి వారి సూచనలు, సలహాలతో హైటెక్ సిటీ నిర్మించాం. బిల్డింగ్స్ అన్నీ పూర్తయ్యాక…హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం ఎలా ఉందో తెలియడానికి రాగ్ గార్డెన్ పెట్టాం. ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రం హైదరాబాద్ కే తలమానికం . హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మార్చిన ఘనత టీడీపీది. ఐటీ, ఫార్మా రంగం అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది.

1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి…పీవీ నరసింహారావు ప్రధాని ఉన్నారు. దేశంలో మెరుగైన ఆర్థిక వ్యవస్థకు పీవీ కృషి చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న రావడం చాలా సంతోషం. నాడు పీవీ దూర దృష్టి వల్లే దేశ దశ, దిశ మారింది. ఆయన సంస్కరణలు లేకుంటే మనం ఈరోజు ఇలా కూర్చునేవాళ్లం కాదు. ప్రధాని మోడీ కూడా దేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల విజిబిలిటీ వచ్చింది. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రజాతిగా భారతీయులు ఉంటారు..అందులో తెలుగువారు 30 శాతం ఉంటారు. ఎక్కువ ఆదాయం ఆర్జించేవారిలో భారతీయులు ఉంటే..వారిలో తెలుగువారు ఎక్కువ ఉన్నారు.

సంపద సృష్టించడం అవకాశంగా వచ్చింది. సంపద సృష్టించడంతో పాటు దాంతో పేదరికాన్ని రూపుమాపాలి. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా పేదరికాన్ని కొంత నిర్మూలించగలిగాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని రూపమాపవచ్చు. పేదరికంలేని తెలుగుజాతిని చూడాలన్నదే నా ఆశయం. మారుమూల గ్రామాల్లో పుట్టిన వారు ఇప్పుడు అన్ని రంగాల్లో రానిస్తున్నారు. మళ్లీ మీ గ్రామాల్లోని పేదరిక నిర్మూలన కోసం అంతా కష్టపడాలి’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎంపి రఘురామకృష్ణంరాజు, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి వంటి ప్రముఖుల రాకతో కార్యక్రమం సందడిగా మారింది.

LEAVE A RESPONSE