బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు?

– లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లకే బీఆర్‌ఎస్ పరిమితం?
– వరంగల్,మెదక్‌లోనే గెలుపు
– మిగిలిన చోట్లా కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీ
– సర్వే ఫలితాల్లో వెల్లడి
– కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
– దానికి చెక్ పెట్టేందుకే బీజేపీతో పొత్తు యోచన
– గ్రేటర్ మినహా జిల్లాల్లో మైనారిటీలు కాంగ్రెస్ వైపే
– త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్?
– సోషల్‌మీడియాలో కథనాల వెల్లువ
– ఎన్డీఏలోకి కొత్త మిత్రులొస్తారన్న అమిత్‌షా
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు-శాశ్వత శత్రువులు ఉండరన్న నిజం ఇప్పటికే చరిత్ర చాలాసార్లు రుజువు చేసింది. తెలంగాణలో కూడా ఇదే నిజం కానుందా? అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న బీజేపీ-బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నాయా? తమ ఎమ్మెల్యేలను-పార్టీని ‘కాంగ్రెస్ గత్తర’ నుంచి కాపాడుకునేందుకు, బీఆర్‌ఎస్ నాయకత్వం బీజేపీతో పొత్తును కోరుకుంటోందా? ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు దానికి సంకేతమేనా? సోషల్‌మీడియా కథనాలు అవుననే దానికి సమాధానం ఇస్తున్నాయి.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసేందుకు, బీఆర్‌ఎస్ సిద్ధమవుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటికీ, ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు పట్టు తగ్గలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత-రేవంత్‌ను సీఎంగా చూడాలన్న సామాన్యుల కోరిక.. బీర్‌ఎస్‌ను ఓడించిందన్నది సుస్పష్టం. అయినా ఇప్పటికే కాంగ్రెస్‌తో పోలిస్తే, వ్యవస్థాగతంగా బీఆర్‌ఎస్ బలమే ఎక్కువన్నద నిష్ఠుర నిజం. పార్టీని ఆ స్థాయిలో నిర్మించిన కేసీఆర్ గొప్పతనం అది.

అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపు రెండు డజన్ల మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ అభివృద్ధి ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డిని ఈపాటికే కలిశారు. ఇంద్రవెల్లి తర్వాత కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని, గతంలో సీఎం రేవంత్ కూడా ప్రకటించారు.

అంతకంటే ముందు బీఆర్‌ఎస్ నల్లగొండ సభకు ముందే, ఆ పార్టీకి ఝలక్ ఇవ్వాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. ఆ సభకు ముందే నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నేతలకు, కాంగ్రెస్ కండువా కప్పాలన్నది కోమటిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో, ఎవరూ అంత ఉత్సాహంగా కనిపించడం లేదు.

తాజాగా అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిర్వహించిన ధర్నాలో, గ్రేటర్ ఎమ్మెల్యేలెవరూ కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ టచ్‌లోకి వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారిని ఎప్పుడు.. ఎలా.. ఏవిధంగా అస్త్రంగా సందిస్తారో చూడాలి.

పైగా గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, స్థానికంగా ఏ పనులూ కావడం లేదు. సాధారణ ఎస్‌ఐ కూడా వారి మాట వినని దుస్థితి. ఇలాంటి అవమానాలు పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. తమ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఇటీవలే హరీష్‌రావు కూడా ఆరోపించారు. చివరకు అసెంబ్లీ లాబీ లోపల ఉన్న విపక్షనేత కేసీఆర్ చాంబరు కూడా మార్చేసి, చిన్న గది కేటాయించడం ద్వారా కేసీఆర్‌కూ ఝలక్ ఇచ్చారు. దానితో అటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు-ఇటు బీఆర్‌ఎస్ నేతలలో అభద్రతాభావం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయడం ద్వారా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలన్న యోచన, బీఆర్‌ఎస్ నాయకత్వంలో మొదలయిందన్న ప్రచారం మొదలయింది. ఇది సోషల్‌మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగూ రెండు సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. మెదక్-వరంగల్ సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చని, మిగిలిన సీట్లలో కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ ఉండవచ్చని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఇండియాటుడే సైతం కాంగ్రెస్‌కు 10, బీఆర్‌ఎస్-బీజేపీకి చెరో మూడు వస్తాయని తేల్చింది.

పైగా ఇప్పుడు బీఆర్‌ఎస్ మైనారిటీలను చూసి భయపడాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే, బీఆర్‌ఎస్‌కు దన్నుగా నిలిచారు. కానీ మిగిలిన జిల్లాలన్నీ కాంగ్రెస్‌కే జైకొట్టిన విషయాన్ని, బీఆర్‌ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, మైనారిటీలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపడటం సహజం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగిన మజ్లిస్ వైఖరి , ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుండ టాన్ని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

రేవంత్ పిలుపు మేరకు మజ్లిస్ శాసనసభాపక్ష అక్బరుద్దీన్ ఓవైసీ, ఇటీవల లండన్ వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాతబస్తీ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికీ ఓవైసీని సీఎం రేవంత్ పక్కనే కూర్చుబెట్టుకోవడాన్ని విస్మరించకూడదంటున్నారు. కాబట్టి బీజేపీతో చేతులు కలిపితే, మైనారిటీ ఓట్లు పోతాయని భయపడాల్సిన పనిలేద ంటున్నారు.

నిజానికి బీఆర్‌ఎస్‌కు బీజేపీతో సైద్ధాంతిక విబేధాలేమీ పెద్దగా లేవు. చివరి మూడేళ్ల వరకూ బీజేపీ సర్కారుకు, పార్లమెంటులో బీఆర్‌ఎస్ అనధికార మిత్రపక్షంగానే వ్యవహరించింది. వ్యవసాయ చట్టాలకూ మద్దతునిచ్చింది. ఒక సందర్భంలో సభలో స్వయంగా కేసీఆర్.. ప్రధాని మోదీని విమర్శించిన కాంగ్రెస్ సభ్యులపై కన్నెర్ర చేశారు. ప్రధానిని మనం గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదగకూడదన్న వ్యూహంతో బీజేపీని ప్రమోట్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు, కేసీఆర్ ఆరకంగా పరోక్షంగా సాయం చేసినట్లే లెక్క. ఆ తర్వాత కేసీఆర్ వ్యూహం బూమెరాంగయిందని ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. అది వేరే విషయం.

అయితే కవిత కేసు తర్వాతనే, బీజేపీతో విబేధాలు పెరిగాయన్న ప్రచారం ఉంది. కాగా తాజాగా హోంమంత్రి అమిత్‌షా, ఎన్డీఏలోకి కొత్త మిత్రులు-పాతమిత్రులు కూడా వస్తారని చెప్పడం ప్రస్తావనార్హం. ఇది సోషల్‌మీడియా కథనాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది.

సహజంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు జాతీయ అంశాల కోణంలోనే ఓట్లు వేస్తారు. ఇప్పుడు దేశంలో అయోధ్య ట్రెండ్ నడుస్తోంది. అయోధ్యను ‘ప్రమోట్’ చేయడంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయింది. అక్కడి నుంచి అక్షింతలు తెచ్చి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. బీజేపీ తన స్వంత ఖర్చులతో నియోజకవర్గాల వారీగా రైళ్లు వేసి మరీ, హిందువులను అయోధ్యకు తీసుకువెళుతోంది. ఇటు ఆర్‌ఎల్‌డీ, అకాలీదళ్, జనతాదళ్.. తాజాగా ఏపీలో టీడీపీ సైతం మళ్లీ బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీఏ గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ-పంజాబ్‌లో ఆప్ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇది బీజేపీకి సానుకూల అంశంమేనని, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓట్లు చీలి, అది బీజేపీకి లాభిస్తుంది. ఫలితంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి బలహీనపడనుంది. అదీగాక మళ్లీ దేశంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని, అన్ని సర్వేలూ ఘోషిస్తున్నాయి. పివి నరసింహారావు, చౌదురి చరణ్‌సింగ్, ఎల్‌కె అద్వానీకి భారతరత్న అవార్డులివ్వడం ద్వారా ఆయా వర్గాలను మెప్పించటంలో బీజేపీ సక్సెస్ అయింది.

చౌదురి చరణ్‌సింగ్‌కు అవార్డు ఇవ్వడం ద్వారా యుపి, హర్యానా, బీహార్, రాజస్థాన్‌లోని జాట్ల వర్గానికి చేరువయింది. భారతరత్న దెబ్బకు చరణ్‌సింగ్ మనుమడు ఫిదా అయిపోయి, తన ఆర్‌ఎల్‌డి త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని వె ల్లడించారు. అంటే దాని ప్రభావం ఏ స్థాయిలో పనిచేసిందో ఊహించుకోవచ్చు.

ఇక పివికి అవార్డు ఇవ్వడం ద్వారా, తెలుగువారిని.. ప్రధానంగా తెలంగాణ ప్రజలను బీజేపీ మెప్పించింది. దానితో బీజేపీని వ్యతిరేకించే బీఆర్‌ఎస్ కూడా మోదీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అనివార్య పరిస్థితి. అయితే కేవలం అవార్డుతోనే ఓట్లు రాకపోయినా, ఆయా వర్గాల్లో బీజేపీపై ఉండే వ్యతిరేకత స్థానంలో సానుకూలత ఏర్పడే అవకాశాలు మాత్రం కొట్టివేయలేం. ఏపీలో కాపుల మాదిరిగా, ఉత్తరాదిన జాట్లలో కులాభిమానం ఎక్కువగా ఉంటుందని విస్మరించకూడదు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం, కాంగ్రెస్ బలపడేందుకు రేవంత్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలతోపాటు, శక్తియుక్తులున్న రేవంత్‌రెడ్డిని తట్టుకోవడం ఇప్పట్లో కేసీఆర్‌కు అసాధ్యమే. రేవంత్ మునుపటి మాదిరిగా నోటికి పనిచెప్పకుండా, కాగల కార్యాన్ని ఏసీబీ గంధర్వులతో కానిచ్చేస్తున్నారు. ఇది ఫైర్‌బ్రాండ్ రేవంత్‌లో వచ్చిన గుణాత్మకమార్పు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ను నిర్వర్యం చేయాలన్నది ఆయన ఏకైక లక్ష్యం. దానికోసమే ఆయన తన మెదడు-మేధస్సుకు పదునుపెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

పైగా కాళేశ్వరం ప్రాజెక్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫార్ములా రేసింగ్, హెచ్‌ఎండిఏ వంటి కుంభకోణాలు కేసీఆర్ కుటుంబానికి ఉచ్చుగా మారనున్నాయి. ఈపాటికే సీనియర్ ఐఏఎస్ అర్విందకుమార్ రేసింగ్ నిధులు, కేసీఆర్ చెబితేనే విడుదల చేశామని సీఎస్‌కు వలిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఇక హెచ్‌ఎండిఏ కుంభకోణంలో కూడా కేటీఆర్‌కు ఉచ్చుబిగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అధికారంలో ఉండగా కేటీఆర్‌కు కళ్లు-చెవులు-సర్వంగా ఉన్న, నలుగురు ఐఏఎస్‌లపైనా ఉచ్చు బిగిస్తున్నారు.

వీటిని గమనించి, ఇంతమంది ప్రత్యర్ధులను ఏకకాలంలో ఎదుర్కోవడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారట. దానితో రాబోయే రాజకీయ పరిణామాలను పసిగట్టిన కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపడమే, ఇప్పటి సమస్యలకు ఏకైక ప్రత్యామ్నాయమని భావిస్తున్నట్లు, బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదీగాక ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిలో, జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరడం అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు, సోషల్‌మీడియాలో కథనాలు దొర్లుతున్నాయి. అయితే అదంతా అబద్ధమేనని హరీష్‌రావు రెండుసార్లు ఖండించారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఉన్న క్లిష్ట పరిస్థితి.. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండాలంటే… కేసులను కోర్టుల్లో బలంగా ఎదుర్కోవాలంటే, బీజేపీతో చేతులు కలపడమే ఏకైక మార్గమని, బీఆర్‌ఎస్‌లో కొన్ని వర్గాలు సైతం భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ అండ ఉంటే, రాష్ట్రంలో మళ్లీ సులభంగా అధికారంలోకి రావచ్చన్న భావనలో ఆ వర్గాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

Leave a Reply