గానమె నీ భాష..!

గంధర్వ లోకాల నుంచి
దిగివచ్చాడేమో..
ఆ లోకాలకే మరలివెళ్లాడు..
ఈలోగా
తన గానమాధుర్యంతో
శ్రోతల్ని కూడా
గంధర్వలోకాలలో
ఓలలాడించిన సంగీత స్రష్ట
మంగళంపల్లి బాలమురళీకృష్ణ..
ఎప్పటికీ తీరిపోని
సంగీత తృష్ణ..!

ఆ గళంలో రాగాలు
అమృత ధారలైతే
స్వరాలు ఆ ధారల్లో
జలకాలాడలేదా..
సరిగమపదనిసలు
గుసగుసలాడుకుని
ఆ పేటికను తమ
వాకిటిగా చేసుకుని
ఎంతగా నర్తించాయో..
కొత్త కొత్త రాగాలై..
రసరంజితాలై..!

పాడనా వాణి కల్యాణిగా..
స్వరరాణి పాదాల పారాణిగా..
నా పూజకు శర్వాణిగా..
నా భాషకు గీర్వాణిగా..
శరీరపంజర స్వరప్రపంచ
మధురగాన సుఖవాణిగా..
తానే వస్తువుగా రాసిన కీర్తన
ఆ సంగీతకళానిధి స్వరంలో
పరవశంగా నర్తన..
తానూ పులకించి
వాగ్దేవి అభినందన..!

సలలిత రాగసుధారససారం
సర్వకళామయ నాట్యవిలాసం..
మంజుల సౌరభ సుమకుంజముల
రంజిల్లు మధుకర
మృదు ఝుంకారం..!
బృహన్నలగా
ఎన్టీఆర్ రసరమ్య నర్తనం..
నాదమహర్షి అనన్యసామాన్య కీర్తనం..
నర్తనశాల శ్రవణనయన మనోహరం..!

శ్రీరామ జయరామ సీతారామ..
ఈ పాటతో తెలుగు వాకిళ్ళలో వేసి ముత్యాలముగ్గు..
మౌనమె నీ భాష
ఓ మూగమనసా..
కప్పేసి విరాగరగ్గు..!

మేలుకో శ్రీరామ..
నీలనీరద శ్యామా..
మేలుకో మేలుకో
మేలైన గుణథామా!
మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి నరసార్దూల
నిన్ను నిందించ వలయునా..
తరుణి సీతమ్మ తల్లి
గృహ విధుల మునిగింది..
తిరిగి శయనించేవు
మర్యాద కాదయ్య..
మేలుకో శ్రీరామ..
ఇంత శ్రావ్యంగా పాడితే
ఆ కావ్యమనోహరుడు
లేవకుండునా..
లోకాలనేలకుండునా..!

భక్తప్రహ్లాదలో తానే నారదుడై
అరుణకమలనయనా
క్షీరజలధి శయనా..
నారాయణా..
ఇలాంటి శ్రావ్యమైన
మూడు పాటలతో పాటు
మధురమైన మాటలు కూడా
అందించిన కౌస్తుభగాన..
బాలమురళీజ్ఞాన.. స్వరవిజ్ఞాన..రసాస్వాదన!

ఎనిమిదో ఏటనే మొదలైన
సంగీత ప్రవాహం..
కొనసాగుతూనే ఉంది అహరహం..
ఆరోహం..అవరోహం..
ఆ గళం చిన్నప్పుడే
ఆడుకున్న ఆటలు..
పాడుకున్న పాటలు…
తానే వీణాపాణిగా..
వాయులీనమై..
మృదంగమే వీరంగమై..
శ్రీకారమైన సంగీతయాత్ర..
భీమ్ సేన్ జోషిని ఖుషి చేసి
చౌరాసియానే ఔరా అనిపించి
కిషోరీ అమోస్కరునే మెప్పించి..
కళాభూషణుడిగా..
తానే పద్మశ్రీగా.. పద్మభూషణుడిగా..
పద్మవిభూషణుడిగా
విరాజిల్లి బిరుదులే
ఆ సంగీతకళాసరస్వతి
ముందు మోకరిల్లిగా
ధన్యుడాయె బాలమురళి..
జీవనమంతా రాగాలతో కేళి
స్వరాలతోనే వ్యాహ్యాళి..
పాటలతో కథకళి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply