Home » ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

– కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా?
– సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం) lo
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు. 900 మంది సభ్యులున్న ఇంతోటి ఎన్నికలు బ్యాలెట్ పేపర్లా? ఈవీఎం ద్వారా జరపాలా? అన్న వాదనకొకటి. చూడ్డానికి చాలా ఎక్కువ చేస్తున్నట్లు అనిపించడం లేదూ? వినడానికి అతిగా ఉన్నట్లు లేదూ? మరదే సినిమా అంటే!
మళ్లీ ఇందులో రాజకీయ పైత్యం-వికారం ఒకటి. అసలు ‘మా’కు అధ్యక్షుడు ఎవరైతే ఏంటి? జనాలకు దానితో వచ్చే ఫాయిదా ఏమిటీ? టీవీలు టీఆర్పీ పెంచుకునే వీరముష్టి ఆలోచన కాకపోతే? తాజాగా విశాఖ నగర నడిబొడ్డులో ఒక వాచ్ మెన్ కూతురిని ఎత్తుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారన్న వార్త చానెళ్లకు ఎందుకు కనిపించడం లేదు? ‘ఒరేయ్ జర్నలిస్టులూ ‘మా’ ఎన్నికల చర్చలు పెడుతున్న మీకు ఈ దారుణం కనిపించడం లేదా’ అంటూ సోషల్ మీడియాలో శరపరంపరగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు, చానెళ్లకు కనీసం గుండుసూది మాదిరిగా కూడా గుచ్చుకోకపోవటంలో ఆశ్చర్యమేమీలేదు.
సరే మళ్లీ ‘మా’ ఎన్నికలకు దగ్గరకు వద్దాం. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారిలో ఒకరు మోహన్‌బాబు కొడుకు విష్ణు. మరొకరు ప్రకాష్‌రాజ్. నిజానికి విష్ణుతో పోలిస్తే ప్రకాష్‌రాజ్‌కు ఉన్న కులబలం-స్థానబలం-వర్గ బలం బహు తక్కువ. కేసీఆర్ సర్కారుతో సంబంధాలున్నా, అవి ఈ ఎన్నికల్లో అక్కరకు రావు. చిరంజీవి కాంపౌండ్ ఆయన గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకుంది. లేకపోతే ప్రకాష్‌రాజ్‌ది ఒంటరిపోరాటమయ్యేదన్నది మనం మనుషులం అన్నంత నిజం. నిజానికి ఇది ప్రకాష్‌రాజ్ ప్రతిష్ఠకు సంబంధించిన ఎన్నిక కానేకాదు. ‘చిరంజీవి అన్నయ్య’ సత్తాకు సవాలుగా మారిన ఎన్నిక. అందుకే సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నిక ప్రచారంలోకి దిగారు. తమ్ములుం గారయిన నాగబాబు కూడా, ప్రకాష్‌రాజ్ కోసం కొండెక్కి కూస్తున్నారు. అంటే.. ఆలెక్కన విష్ణు గెలిస్తే చిరంజీవి ఓడినట్లే! యస్. అందులో ఎలాంటి సందేహం లేదు.
మరి మంచు విష్ణు ఓడితే ఏపీ సీఎం జగనన్న ఓడినట్లేనా?.. ఇది బోడిగుండుకూ-బట్టతలకూ లింకు మాదిరిగానే ఉన్నా, ఇప్పుడు మా’ ఎన్నికల్లో జరగబోతోంది అదే. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది కమ్మ-కాపు వార్ మాదిరిగానే కనిపిస్తోంది. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజంగా నిఝం! ఎందుకంటే చిరంజీవి అన్నయ్య, కాపు వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. అఫ్‌కోర్స్.. ఆయన చుట్టూ ఎప్పుడూ కనిపించేది కమ్మవారే అయినప్పటికీ, అవతల బరిలో ఉన్నది ‘మనవాడు’ కాబట్టి, కమ్మవారి ఓటు ‘మంచు’వారికే పడతాయని ఊహించడానికి పెద్ద మేధావే కానక్కర్లేదు. కొంచెం మెదడుంటే చాలు! ఎన్నికల తర్వాత మళ్లీ హమ్ సబ్ ఏక్ హై. దట్సాల్!
అయితే ఇక్కడే చిన్న తిరకాసు. చిరంజీవి-నాగార్జున దోస్తులు. వారిద్దరి మధ్య ఉన్న అవగాహన చాలా లోత యినది. నాగార్జున చాలామందికి వ్యాపారం నేర్పారు. ఆయన అటు జగనన్నకూ ఖాసు దోస్తు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న వైరం వల్ల, అక్కినేని వారు జగనన్నకు మిత్రుడయిపోయారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ప్యామిలీ, మంచు విష్ణుకు ఆశీస్సులిచ్చేసింది. సూపర్‌స్టార్ కృష్ణ కూడా డిటో డిటో. కాబట్టి ఆటోమేటిక్‌గా నాగ్.. చిరంజీవి అన్నయ్య నిలబెట్టిన ప్రకాష్‌రాజ్‌కు జైకొట్టాల్సిందే. మరి అక్కినేని కూడా కమ్మాయనే కదా అనే డౌటనుమానం రావచ్చు. నిజమే. కానీ ఇక్కడ ఆ ఈక్వేషన్ కుదరదు. నిజానికి నాగార్జున ఏపీ సీఎం జగనన్న బావమర్దయిన విష్ణుకే జైకొట్టాలి. పైగా ఒకటే బీరకాయపీచు. అయితే ఇక్కడ చిరంజీవి కోసం నాగ్.. తన వర్గం ఓట్లను ప్రకాష్‌రాజ్‌కు వేయించక తప్పదు. ఇదీ చిరంజీవి-నాగ్ దోస్తానా! ఏంటీ.. చిత్రవిచిత్రంగా అనిపిస్తోంది కదూ? సినిమా పాలిటిక్స్ అంతే గురూ!
సినిమా వాళ్లంటే సహజంగా టీడీపీకి సహజ మద్దతుదార్లని పేరు. ఆ పేరు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ విజయవంతంగా కొనసాగుతోంది. సినిమా పరిశ్రమలో అక్కినేని మినహా, మిగిలిన కమ్మవారంతా టీడీపీకి ఏదో ఒక రూపంలో శ్రమదానం చేసేవారన్నది బహిరంగ రహస్యం. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుదారు, అంతకుమించి.. జగనన్నతో బంధుత్వం ఉన్న మోహన్‌బాబు కొడుకు విష్ణును కులాభిమానంతో గెలిపిస్తారా? లేక జగనన్న బంధువు కాబట్టి, ‘పార్టీ అభిమాన కోణం’లో విష్ణును ఓడిస్తారా అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.
మరి ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఓడిపోతే జగనన్న ఓడిపోయినట్లేనా? ఇదీ ఇప్పుడు ప్రశ్న. సోషల్‌మీడియాలో కూడా ఈ కోణంలోనే జరుగుతున్న ఆసక్తికర మైన చర్చ. విష్ణు విజయానికీ-జగనన్నకూ సంబంధమేమిటని అనుకోవడం సహజం. మరిక్కడే ఉంది తిరుగుడు యవ్వారం! మోహన్‌బాబు గత ఎన్నికల్లో జగనన్న విజయం కోసం,వైసీపీ కండువా కప్పేసుకుని మరీ ప్రచారం చేశారు. పైగా జగనన్నకు మోహన్‌బాబు బంధుత్వం కూడా ఉంది. అంటే విష్ణుకు జగనన్న బావ అవుతారు. మరి అలాంటి విష్ణు ఎన్నికల్లో ఓడిపోతే ‘జగన్ బావ’ కూడా ఓడినట్లే కదా? ఇదీ ఇప్పడు వినిపిస్తున్న లాజిక్. అందుకే అసలు మిన్ను విరిగి మీదపడ్డా పట్టించుకోని జగనన్నకు ‘మా’ ఎన్నికలు పితలాటకంలా మారాయి. పార్టీపరంగా కూటికీ-గుడ్డకూ పనికిరాని ఈ ఎన్నికల్లో విష్ణు ఓడిపోతే, ఎక్కడ తన ఇమేజీ డామేజీ అవుతుందేమోనన్న ముందుచూపుతో ‘ఈ ఎన్నికలకు-జగన్‌కు ఎలాంటి సంబంధం లేదు’ అని సినిమామంత్రితో ప్రకటన ఇప్పించడం బట్టి.. వైసీపీ శిబిరం ఈ ఎన్నికలపై ఎంత కంగారుగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
కాలం ఖర్మం కలిసిరాక ఒకవేళ ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. ఇహ రేపటి నుంచి జగన్ ఓడిపోయారని, బావమర్దినే గెలిపించుకోలేకపోయారన్న ప్రచారం షురూ అవుతుంది. మరి ఈ యవ్వారంలో ‘మేమూ మేమూ కాపునాకొడుకులమే. మీకెందుకు చౌదరి గారూ’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పిన సినిమా మంత్రి పేర్ని నాని.. కాపు శిబిరానికి నాయకత్వం వహిస్తున్న కాపు నేత చిరంజీవితో ఏమైనా ‘మన్‌కీబాత్’ మాదిరిగా మాట్లాడారా? అన్నది తెలియదు. మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. బామ్మర్ది విష్ణు విజయం, బావ జగనన్నకు ఇజ్జత్‌కా సవాల్‌గా మారిందన్నమాట. మరికొద్ది గంటల్లో ఆ ముచ్చట కూడా తెలిసిపోతుంది.

Leave a Reply