Suryaa.co.in

Entertainment

కవి సుగమ్ బాబుకు అల్విదా

సుగమ్ బాబు (మహబూబ్‌ ఖాన్‌) ఇక లేరు. తెల్లవారు జామున (18.10.2022) ఆయన తుది శ్వాస నిలిచిపోయింది.. ఎం. కె. సుగంబాబు తెలుగు రచయిత, జర్నలిస్టు. అతను పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించాడు. అతను 9 సంపుటాల కవిత్వాన్ని, 3 సంపుటాల ఇతర రచనలను చేసాడు. రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు. అతను రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన “అస్తమించిన సూర్యుడు”కు బంగారు నంది పురస్కారం లభించింది.

జీవిత విశేషాలు
సుగంబాబు గుంటూరు పట్టణంలో 1944 ఏప్రిల్‌ 1 న సకినాబీబి, ఫరీద్‌ఖాన్ దంపతులకు జన్మించాడు. అతనికి తల్లితండ్రులు పెట్టిన పేరు మహబూబ్‌ ఖాన్‌ కాగా అదికాస్తా “సుగంబాబు” గా పేరు స్థిరపడింది. అతను బి.ఏ (తెలుగు) చదివాడు. 1963 డిసెంబర్‌లో ‘భారతి’ మాసపత్రికలో ‘మట్టీ బొమ్మ’ కవిత ప్రచురణతో అతని రచనా వ్యాసంగం ఆరంభం అయింది. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు రాసాడు.

పైగంబర్‌ కవుల లో ఒకరు :
తెలుగు సాహితీజగత్తును దిగంబర కవులు ఒక కుదుపుకుదిపిన రోజుల్లో ఆ స్ఫూర్తితో గుంటూరు నుండి పైగంబర కవులు అవతరించారు. దేవీప్రియ, సుగమ్‌బాబు, కిరణ్‌బాబు, ఓల్గా, కమలాకాంత్‌ ఈ బృందంలోని సభ్యులు. తెలుగు సాహిత్యంలో నెలకొన్న స్తబ్ధతను బద్దలుకొట్టింది పైగంబర కవిత్వం.
జ్వాల పత్రిక ద్వారా తమ కవిత్వాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిజానికి దిగంబర కవులకు, పైగంబర కవులకు వస్తువు విషయంలో భేదాభిప్రాయం లేదు. అందరూ అభ్యుదయవాదులే. కేవలం అభివ్యక్తి విషయంలోనే అభ్యంతరం.

సిద్ధాంత రాహిత్యం, బూతుల ప్రయోగాల వల్ల దిగంబర కవిత్వం తన లక్ష్యానికి సమీప దూరంలో ఆగిపోయింది. దిగంబరకవిత్వంతో సంబంధం లేకుండా మనిషిని అజెండా చేసుకొని, మానవత్వాన్ని తట్టి లేపుతూ సామాజిక చేతన ప్రధాన లక్ష్యంగా పైగంబర కవిత్వాన్ని తెరపైకి తెచ్చారు. తెలుగు సాహిత్యంలో ‘పైగంబర్‌ కవులు’ గా సుప్రసిద్ధులైన ఐదుగురిలో ఒకరైన సుగంబాబు . సుగం బాబు 1970లో దేవిప్రియ,కిరణ్ బాబు,ఓల్గా,కమలాకాంత్ లతో కలిసి పైగంబర కవితోద్యమానికి శ్రీకారం చుట్టాడు. పైగంబర కవిత్వం ఉద్యమ రూపం సంతరించుకునే సమయంలోనే విరసం ఆవిర్భవించింది. పైగంబర కవుల్లో కిరణ్ బాబు ఓల్గా, సుగంబాబు విరసం లో చేరిపోయారు. ఆరకంగా ఉద్యమ స్థాయిలోనే పైగంబర కవిత్వం నిలిచిపోయింది. అయినప్పటికీ భాషలో, భావంలో, చేతనా పరంగా మంచి కవిత్వాన్నే అందించారు. పైగంబర కవులు యుగసంగీతం, యుగచైతన్యం అనే రెండు కవితా సంకలనాలను వెలువరించారు.

రెక్కలు :
2003లో తెలుగు సాహిత్యంలో ‘రెక్కలు’ అను నూతన కవితా ప్రక్రియను ప్రారంభించి ఐదుఎడిషన్లు వెలువరించాడు. తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం (ఇజ్రాయిల్‌) కు చెందిన ఆచార్య సుర్మన్‌ డేవిస్‌ ఆంగ్ల భాషలో ‘వింగ్స్’ పేరిట వాటిని అనువదించి వెలువరించినప్పటి నుండి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో ‘రెక్కలు’ ప్రక్రియ పాఠకాదరణ పొంది, అది కన్నడం, హిందీ భాషా సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అతను రాసిన గ్రంధాలలో ‘సూరీడు’ ఖ్యాతి తెచ్చిపెట్టింది.

“రెక్కలు” కవితా ప్రక్రియ :
సుగమ్ బాబు గారు ప్రఖ్యాత కవి. తెలుగు సాహిత్యంలో అభ్యదయ, విప్లవ, దిగంబర కవులకు ఒక విశిష్ట స్థానం ఉన్నట్లే పైగంబర కవులు కూడా అటువంటి స్థానమే ఉంది. ఆ పైగంబర కవుల్లో సుగమ్ బాబు గారు కూడా ఒకరుగా ఉండేవారు. తర్వాత కాలంలో ఆయన సాహిత్యాన్ని పాఠకులకు మరింత దగ్గరగా చేర్చాలనుకున్నారేమో, రెక్కలు ప్రక్రియతో ముందుకొచ్చారు. ఈ ప్రక్రియ 20 వ దశకం నుండి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని సుగం బాబు రూపకల్పన చేశాడు. ఈ ప్రక్రియలో అక్షరాల నియమం లేదు .
ఆరు వరసలు ఉండాలి. మొదటి నాలుగు వరుసల్లో స్టేట్ మెంట్ చెప్పాలి . చివరి రెండు వరుసలూ పై స్టేట్ మెంట్ ని ఉన్నతీకరించి ఎగిరేటట్టు చేయాలి. అవే రెక్కలు అన్నమాట. తాత్విక విషయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
ఉదాహరణ
సవరించు
నిన్ను నీవు
ప్రశ్నించుకో
ఎదుటి వానిలో
దర్శించుకో !
ఆత్మజ్ఞానం
దైవ సమానం !
-పి. లక్ష్మణ్ రావ్
*
నిన్నునీవు
వ్యక్తం చేసుకోవటం కవిత్వం..
నిన్ను నీవు
నిలబెట్టుకోవటం జీవితం__
దివ్య పరిమళం
వ్యక్తిత్వం!”.
***
అతని చేతుల్లో
పలుగు పార
అతని స్వరం లో
పాటల ధార__
విచిత్ర కవలలు
పని పాటలు .
**
వెంట వెంటనే
రావచ్చు విజయం
దశాబ్దాలైనా…
అందకపోవచ్చు
ఫలిస్తుంది
ప్రయత్నం “.

రచనలు :
1) చరలో సెలయేరు (1968)
2) విప్లవం (1969)
3) పైగంబర్‌ కవులు (1971)
4) సూరీడు (పాటల పుస్తకం, 1971)
5) లెనిన్‌…లెనిన్‌ (1984)
6) రెక్కలు (2003)
7) కొత్తనీరు రెక్కలు

LEAVE A RESPONSE