Suryaa.co.in

Entertainment

కమర్షియల్ కళాఖండాల దర్శకేంద్రుడు @ 81

పురాణాల్లో ఇంద్రుడు
కాస్త బూతు దేవుడే..
మన సినిమాకి అలాంటోడు
రాఘవేంద్రుడే..
అందుకే అతగాడు అయ్యాడు దర్శకేంద్రుడు ..
రసికరాజ తగువారము కామా
అంటూ ఇన్నాళ్లు తీసి దృశ్యకావ్యాలు
ఇప్పుడు కామానికి కామా పెట్టి
ఆధ్యాత్మికంగా ఓ కొత్త పరంపర
వాటిలోనూ కొనసాగిస్తూ
అందాల జాతర..!
అన్నమయ్య కీర్తనలు
మరదళ్ల నర్తనలు
సమపాళ్లలో..
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవప్రణయ దేవతలకు ఆవాహనం..
పిలక పెట్టి తాళ్ళపాక
రొమాన్సు ముదురు పాకాన..
అటు రామదాసునూ వదలక
చాలు చాలు చాలు
సరసాలు చాలు చాలు
అంటూ భక్తి,రక్తి సమపాలు
హాట్ హాట్ సమోసాలు..
రాఘవేంద్రుడి సమాసాలు
పాండురంగడులో మాత్రం
రామదాసును మించి
ప్రేమ డోసు..
బాలయ్యతో తిరకాసు..!

ఇంటి పేరు కోవెలమూడి
తెలిసింది జనాల నాడి
పాటలు తీస్తే
ముసలాళ్ళకైనా
పుట్టును ఒంట్లో వేడి..
చూపించేది హీరోయిన్ నాభి
ఆమె దుస్తుల
విషయంలో మహా లోభి..
రాఘవేంద్రరావు పాటల్లో మంచి లొకేషన్లు..
ఆ చుట్టుపక్కల
పళ్ల మార్కెట్ కి మంచి గిరాకీ
ఏ హీరో అయినా
అవ్వాలి గురి చూసి
బొడ్డు మీద
కొట్టేటంత చలాకీ!

హీరోలకు అతగాడి
చేతి బోణీ..
సూపర్ స్టార్లుగా చలామణీ..
వెంకీని చేసి
కలియుగ పాండవులతో హీరో
అతగాడి చేతే ఆడించాడు సుందరకాండ..
మహేష్ బాబు ఈయన దిద్దితేనే అయ్యాడు రాకుమారుడు..
అల్లుకు బోణీ గంగోత్రి..
ఇప్పుడతడు బిజీ ఆయిపోయాడు పగలు రాత్రి..
ఆయన చేతి చలవతో
నాగార్జున లెవెలే మారి..
తిరుపతి వెంకన్న సుమనోహరుడై..
రాఘవుడు పట్టినా లేకపోయినా ఆధ్యాత్మిక దోవ
జనాలకు మాత్రం అందింది
భక్తి గీతాల వెల్లువ..

కెవిరెడ్డి జయంతిని మించి
దర్శకేంద్రుడి ఇంద్రకుమారి
భలే సొగసరి..
అదంతా రాఘవేంద్రుని సిరి..
అంతటి తుపానులోనూ
కలెక్షన్ల జాతర..
పాత రికార్డులకు పాతర!
ఎన్నో హిట్లు కొట్టిన ఎన్టీఆర్ కు
అడవిరాముడు ఓ సంచలనం
ఆ వెనకే వేటగాడు..
డ్రైవర్ రాముడు..
కొండవీటి సింహం..
జస్టిస్ చౌదరి..
ఆ హిట్లు నందమూరి
రాజకీయ అరంగేట్రానికి మెట్లు!
టిటిడి ఛానల్ ఆద్యాత్మికతకు
కొత్త సొగసు..
ఆ కిటుకులన్ని దర్శకేంద్రుడికి
బాగా తెలుసు..
మొత్తానికి రాఘవేంద్రుడి
మాజికల్..
మ్యూజికల్ టచ్ తో
కమర్షియల్ సినిమాకి దృశ్యకావ్యం హోదా
అందుకే ఆయన ప్రతిభకు
ప్రేక్షకలోకం అయింది ఫిదా!

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావుకు
జన్మదిన శుభాకాంక్షలతో ..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE