సినిమాకి వెళ్లామా.. చూశామా.. జై బాలయ్య… అంటూ గోల చేశామా… ఈల కోట్టామా.. అయిపోయిందా !
ఇంతే కాదు.ఇంకా చాలానే ఉంది.అఖండ ఆంధ్ర దేశానికి ఓ బలమైన సందేశం ఇచ్చాడు. వర్తమానాన్ని వడపోసి, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, వాటి ప్రభావాల్నీ విడమరిచి మరీ చూపించాడు.
డజనున్నరకి తక్కువ కాకుండా డైలాగులు పేల్చాడు. కథ తిరిగింది అఘోరా చుట్టూ అయినా చెప్పింది మాత్రం మనం ఎదుర్కొంటున్న ఘోరాల గురించే !ఎదుటోడి కూసాలు కదిలిపోయే స్థాయిలో, సొంతోళ్లు మీసాలు మెలేసే రేంజులో ఏం చెప్పాడో, ఎందుకు చెప్పాడో చూద్దాం. రివ్యూ మీరు ఎక్కడైనా చదవొచ్చు. కానీ రిలెవెన్స్ మాత్రం మీరు రాజనీతిలోనే చూడాలి. ఎందుకంటే ఇది రాజనీతి స్పెషల్.
గొర్రెలెప్పుడూ కసాయోడినే నమ్ముతాయ్ అనేది పాత మాట. గొర్రెలెప్పుడూ కసాయోడికే ఓటు వేస్తాయ్ ఎందుకో – అనేది అఖండ బిగినింగ్ లో వినిపించే డైలాగ్. అది మొదలు ఆ తర్వాత గేర్ మారుతూనే ఉంటుంది. రీలు రీలుకీ రింగు రింబోలా అయిపోతూనే ఉంటుంది.అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా అనే డైలాగ్ టీజర్ లో చాలా మంది చూసే ఉంటారు. సినిమా చూస్తే అర్థం అవుతుంది దాని ఇంటెన్సిటీ. అనంతపురం రైతు చెప్పే మాట ఇది.
నిజానికి రాయలసీమకి పోలవరానికి నేరుగా సంబంధం లేదు. పట్టిసీమ సంగతి మామూలుగా అయితే వాళ్లకు పట్టనే పట్టేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ మూల ఏం జరుగుతోందో, ఎవరి మీద ఆ ప్రభావం ఎలా పడుతోందో తెలియని రోజులు ఇవి.అందుకే ప్రాంతాలకి అతీతంగా ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసింది అనే రేంజులో ఆ డైలాగు వాడాడు బాలయ్య. పంచ భూతాలతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగు పడలేదు తునాతునకలై ముక్కలు కూడా దొరకలేదు – అనే డైలాగ్ పడినప్పుడు అయితే కొత్త తరం కుర్రోళ్లు కూడా ఈలలు కొట్టారు – మరి ఏం అర్థం అయ్యిందో ఏంటో !
ప్రాంతాల వారీగా విడగొట్టి, కులాల వారీగా చిచ్చుపెట్టి, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం నీ స్టైల్ ఏమో, నా అనే వాళ్లకి ఏం జరిగినా నిలబడటం నా స్టైల్ అనడంలోనే బాలయ్య మార్క్ ఉంది.గుళ్లో విగ్రహాలు ఏం చేశాయిరా కూల్చేస్తారా, పడగొడతారా అంటూ గుడి ప్రాశస్త్యాన్ని చెప్పే డైలాగ్ వింటే… ఏ పీఠాధిపతి కూడా ఇంత జనరంజకంగా చెప్పలేదు కదా అనపిస్తది.సినిమా మాధ్యమానికి ఉన్న పవర్ అది.
ఇక పేకాటగాళ్లు, తాగుబోతులు ఒక చోట చేరి శివలింగాన్ని పక్కన పెట్టి జూదాలు ఆడే సందర్భం అయితే ఆంధ్రప్రదేశ్ గర్భశోకాన్ని కళ్లకి కట్టినట్టే ఉంది. మా ఇష్టం, మా గుడి, మేం ఏమైనా చేస్తాం అంటూ కొందరు వాళ్లకి వత్తాసు పలికితే అఘోరా చెప్పే సమాధానం సింప్లీ అదుర్స్.
ఈ గుడి నువ్ కట్టావా అంటాడు. లేదు అని చెబుతాడు అవతలోడు. మరి నువ్ కట్టనప్పుడు, నువ్ నిలబెట్టనప్పుడు మార్చే అధికారం నీకు ఎవడు ఇచ్చాడు ? అసలు ఏది ఎక్కడ ఉండాలో, స్థాన, స్థల, దర్శన పురాణాలు ఎందుకో, ప్రకృతి కాల గమనాలకు ఆలోచనల్ని మేళవించి భావి తరాల కోసం చేసే
తపస్సురా నిర్మాణం, మీకేం అర్థం అవుతుంది రా అన్నప్పుడు అది ఆ శివలింగం గురించి మాత్రమే కాదు సాక్షాత్తూ ఆ అమరేశ్వరుడి గురించి. అమరావతి గురించి. ఏపీ రాజధాని గురించి. ఈ విషయం కాస్త ఆలోచన ఉన్నవాళ్లకి ఇట్టే తడుతుంది. గుండె తలుపు తడుతుంది.మనసును మెలి పెడుతుంది. ఇండస్ట్రియలిస్ట్ ను చంపితే వెంటనే రక్తం క్లీన్ చేసేసే సీన్ చూస్తున్నప్పుడు, ఆ మధ్యన టీవీల్లో చూసిన బాత్ రూమ్ దృశ్యాలు మన కళ్ల ముందు మెదులుతాయ్.
నాకో లెక్కుంది, నా వెనకో మంద ఉంది, నాకో స్వామీజీ ఉన్నాడు, ఏదైనా చేసేస్తా, ఎంతైనా దోచేస్తా, పంచ భూతాలను కబళిస్తా అంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా అనే డైలాగ్ విన్నప్పుడు ఎవరు ఉలిక్కి పడతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా ! కావాలంటే చూడండి మీకే అర్థం అవుతుంది.
ఈ దేశం నాకోటి ఇచ్చింది, అందుకే నేను ఈ దేశానికి ఏమేమి ఇస్తానో నువ్వే చూస్తావ్ కదా అని ముఖ్య విలన్ అనడం కూడా ఇక్కడి సందర్భమే. దేశం బదులు రాష్ట్రం పెట్టుకోవాలి. రాష్ట్రం నా మీద ఓ ముద్ర వేసింది, నేను ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తానో చూడు అన్నది అక్కడ అర్థం. దీనికీ ఈలలు పేలాయ్ బీభత్సంగా !
అసలు బాలయ్య డబుల్ ఫోజ్ కేరెక్టరైజేషన్ లో కూడా ఓ సింబాలిజమ్, సందేశం ఉన్నట్టుగా అనిపిస్తాయ్. ప్రకృతిని, మంచిని ప్రేమించేవాడు ఒకడు. అరాచకాన్ని అణిచేసే రుద్రుడు మరొకడు. క్లీన్ మైండ్ ఉన్నోడు స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మిస్తాడు అనే మాట బాలయ్య వేదిక మీద చెప్పే సీన్ కూడా ఇంచుమించు ఇలాంటిదే !
అంటే రాష్ట్రాన్నీ, జనాన్ని, భవిష్యత్ నీ ప్రేమించేవాడు ఓ నాయకుడు, ఓ వ్యక్తి అనుకుంటే… రుద్రుడిగా అరాచకాన్ని అణిచి వేసే వాడు జనాభిప్రాయం, ప్రజల మనోభీష్టం అనుకోవాలి. అంటే అలాంటి వాడు తమతో ఉంటాలి అని, అలా ఉండాలి అంటే జనం ఇలా చేయాల్సి ఉంటుంది అని చెప్పేందుకు స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా అనిపించింది.అంతా అయ్యాక, దుష్ఠ సంహారం చేశాక, నాకు దేని మీదా ఆశ లేదు, నేను నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తా అని బాలయ్య చెప్పింది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు… బహుశా నిజ జీవిత సూత్రం అనుకుంటా. అందుకే చప్పట్లు అనుకోకుండా, అలవోకగా మోగిపోయాయ్.
అహింసా పరమో ధర్మహ అని హిందూ మతం చెప్పింది కదా – నువ్ ఇంత హింస చేస్తున్నావేంటి అని అడిగినప్పుడు అఘోరా హిందుత్వానికి ఇచ్చే డెఫినిషన్ వింటే అర్థం అవుతుంది – చాలా మందికి ఈ కోణం అర్థం కాలేదు ఇప్పటి వరకూ అని.అహింసా పరమోధర్మహ అని సగమే చెబుతున్నారు. హిందుత్వం పూర్తిగా చెప్పింది. ధర్మ హింసా తథీవచ అని కూడా అన్నది.అంటే అహింస అనుసరణీయం. ధర్మం కోసం చేసే హింస అన్నిటికంటే ఉత్తమమైనది అని దాని అర్థం అంటాడు.
అంటే హిందుత్వ అని కబుర్లు చెప్పడం కాదు, ఉద్ధరణ కోసం పూనుకుంటే అరాచకుల్ని అణిచేందుకు కలిసి రావాలి అని దాని అర్థం. కలిసికట్టుగా దారుణాల్ని తిప్పికొట్టాలి అని చెప్పడం అనమాట.
ఈ విషయం నిజంగా అర్థం చేసుకుంటే పువ్వులు వికసిస్తాయ్.ఇన్ని కాంటెంపరరీ డైలాగులు, అదిరిపోయే ఆర్ ఆర్ ఉన్నప్పుడు మామూలుగా అయితే మాడు పగిలే తలనొప్పి రావాలి, అలాంటిది సీటీ కొడుతూ, జై బాలయ్య అంటూ జనం బయటకి వస్తున్నారూ అంటే బోయపాటి భలే సక్సెస్ కొట్టేశాడూ అని అర్థం.
అఖండ ఎక్కేసింది.
– కేఎన్నార్