Suryaa.co.in

Entertainment Political News

ఎన్టీఆర్ కి నూరు..మారుమ్రోగిపోవాలి పేరు

మహానుభావుడికి మహాపురస్కారం
భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్..
ఆయనకు భారతరత్న రాలేదేమి..?
ఊహు..ఇవ్వలేదేమి..??

ఎవరి కంటే తీసిపోయారు
ఆయన..నటుడిగా పరిపూర్ణుడు..
రాజకీయవేత్తగా సంచలనం..
వ్యక్తిగా మహానుభావుడు..

ఇంతకంటే ఏం అర్హతలు కావాలి..ఎన్నో రంగాలలో ఎందరినో మించి ఎన్నెన్నో సాధించిన ఒక విశిష్ట వ్యక్తి
నందమూరి తారక రామారావు.కొన్ని రంగాల్లో ఆయన రాణించిన తీరు నభూతో నభవిష్యతి..
ఒక్క తెలుగుజాతి మాత్రమే గాక యావత్ భారత సమాజం ఎప్పటికీ మరిచిపోలేని ఒక శిఖర సమానుడు ఆయన..
అలాంటి మహనీయునికి అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించడం భరతజాతి ధర్మం..
ఇవ్వకపోవడంలో మరేంటో
మర్మం..!

మరో విషయం..
చలనచిత్ర సీమలో ఎన్టీఆర్ ఒక మేరు నగం..
ఆయన పోషించినన్ని వైవిధ్యభరితమైన పాత్రలు ప్రపంచంలో ఇంకే నటుడూ పోషించలేదంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాబోదు..ఇక్కడ ఎన్టీఆర్ నట వైశిష్ట్యం…ఆయన రాజకీయ ప్రస్థానం..వ్యక్తిత్వ ఔన్నత్యం..వీటి గురించి రాస్తే ఒక మహాగ్రంధమే అవుతుంది.నిజానికి అదే భారతరత్నతో సమానమైనది.
ఇప్పుడు అంశం
ఆ మహానటుడికి..
మహోన్నత వ్యక్తికి..
గొప్ప రాజకీయవేత్తకి
భారతరత్న ఎందుకు ఇవ్వలేదని..!?

ఇక్కడే మరో మాట..
అంతటి నందమూరికి పద్మశ్రీ మినహా మరో బిరుదు లేదంటే అదెంత ఘోరమో కదా.. పద్మభూషణ్..పద్మవిభూషణ్..ఇవి గాక దాదా సాహెబ్ ఫాల్కే వంటి పురస్కారాలకు ఆ విశిష్ట వ్యక్తి పేరు ఆయన జీవించి ఉన్నప్పుడు గాని..మరణించిన తర్వాత గాని పరిశీలనకు రాలేదంటే వెనక రాజకీయాలే నడిచాయో..ఈర్ష్యా ద్వేషాలే చోటు చేసుకున్నాయో..ఇంకేమి కారణాలు దాగి ఉన్నాయో..వీలైనంత మేర విశ్లేషిద్దాం.!

ఎన్టీఆర్..తెలుగు వారి గుండె చప్పుడు..
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక…
తెలుగుజాతి గొప్పదనాన్ని నటుడిగా..రాజకీయ నాయకుడిగా దేశానికి…ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి.. అంతే కాదు..ఈ రోజున కేంద్రప్రభుత్వాలైనా గాని.. రాష్ట్రాలలో కాని అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయనే బీజాలు వేశారు.రాజకీయాల్లోకి వస్తూనే నందమూరి తారక రామారావు ప్రకటించిన..అధికారంలోకి రాగానే అమలు చేసిన కిలో రెండ్రూపాయల బియ్యం ఈ రోజున ఎన్నో రూపాంతరాలు చెంది కోట్లాది ఇళ్ళల్లో సంతోషం నింపింది.అలాగే బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కల నెరవెరడానికి కూడా ఆయనే ప్రధాన కారకుడు.అలాంటి ఓ ఘనచరిత్ర కలిగిన నాయకుడికి ఉన్నత పురస్కారం రాకపోవడం తెలుగు జాతికి అవమానం.ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రంలోని పెద్దలకు గల చిన్న చూపునకు పరాకాష్ట మాత్రమే గాక ఒక రకంగా తెలుగు వారి ఘోర వైఫల్యం అని కూడా చెప్పవచ్చు.

బాబూ..మారు
ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడం పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం..నిజం..!భుజాలు తడుముకున్నా.. బుకాయింపులకు తెగబడినా ఇది కాదనలేని సత్యం.కాదని అంటే తమ నాయకుడికి భారతరత్న వచ్చేలా చంద్రబాబు చిత్తశుద్దితో చేసిన ప్రయత్నాలు ఏంటో త్రికరణశుద్ధిగా చెప్పమనండి. ఇప్పుడంటే సీన్ మారింది కాని ఒకనాడు కేంద్రంలో చంద్రబాబు ఏం చెబితే అదే జరిగిన కాలం. కలాంను నేనే ప్రెసిడెంట్ చేశా..వాజపేయి ప్రధాని కావడానికి నేనే మూలకారణం..ఇలా పదేపదే డంబాలకు పోయే బాబు నిజానికి తన పార్టీ మూలస్తంభం.. తమందరి తలరాతల విధాత..ముఖ్యంగా..పరిస్థితులు..జరిగిన విధానం ఏదైతే గాని తాను ముఖ్యమంత్రి..జాతీయ స్థాయి నాయకుడు కావడానికి కారణమైన వ్యక్తికి భారతరత్న వంటి గొప్ప పురస్కారం వచ్చేలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు. ఆయన అడిగి ఉంటే వాజపేయి..మోడీ కాదనే వారా..కారణాలు ఏవైనా గాని బాబు అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు.చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చేది.రాలేదు గనక చెయ్యలేదని భావించాల్సిందే.

ఈ విషయంలో ఎన్టీఆర్ కుటుంబం కూడా అవసరమైనంత స్ధాయిలో స్పందించలేదు.బాబుపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు.ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని..అటు రామారావు కుటుంబం గాని ఎంతసేపూ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేందుకే తాపత్రయ పడ్డారు గాని సొంత లాభం కొంత మానుకుని పెద్దాయన రుణం తీర్చుకునే ఆలోచన లేకపాయె..ఇది దురదృష్టకరం.నిజానికి వారంతా ఆ పని చేసి ఉంటే ఒకనాడు తమ దేవుడికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అయ్యేది కూడా.. రామారావు ఇంత గొప్పవారు..నాన్న గారు మహానుభావుడు అని మాటలు చెబితే సరిపోతుందా..ఆయన రుణం తీరిపోతుందా.. చెప్పండి..!

శతజయంతి వేళ శతకోటి ప్రణామాలు!
ఇది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం..28న ఆయన నూరో సంవత్సరంలో అడుగుపెట్టినట్టు..వచ్చే ఏడాది..అంటే..2023 మే 28 నాటికి ఆ చారిత్రక పురుషుడికి నూరు నిండుతుంది. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడానికి ఇంతకు మించి సందర్భం ఏముంటుంది..

అయితే కేంద్రం ఆ పని తనంత తానుగా చేసే పరిస్థితి లేదు. రాష్ట్రం నుంచే ప్రయత్నాలు జరగాలి.. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నందమూరి తారకరామారావు అనే వ్యక్తిని తన ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడుగా గాక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా గౌరవించి కృషి చెయ్యవచ్చు.గతంలో ఎవరూ చెయ్యని విధంగా ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టింది ఈ ప్రభుత్వమే.అదే స్ఫూర్తితో తెలుగుబిడ్డ రామారావుకి భారతరత్న రావడానికి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి.ఇక ప్రధాన బాధ్యత తెలుగు ప్రజలదే..

ఎన్టీఆర్ ఉభయ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ..ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సొత్తు.. తెలుగు జాతి విశిష్ట ప్రతినిధి..అలాంటి వ్యక్తికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండుతో ఒక మహోద్యమమే సాగాలి.
సమాచార వ్యవస్థ ఇంత విస్తృతంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలుగు వారి కోరికని సంబంధిత పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళడం సులువైన పనే..తెలుగువారందరూ మూకుమ్మడిగా అందుబాటులో ఉండే ప్రతి వేదికపై నుంచీ స్పందించాలి.

స్టేటస్..వాట్సాప్..ట్విట్టర్..ఫేస్ బుక్..పత్రికలు..టివిలు..వినతిపత్రాలు.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో తమ కోరికని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలి. ఇక ముఖ్యంగా తెలుగు సినిమా పెద్దలు తమ ఇంటి పెద్దలు భారతరత్న వచ్చేలా ప్రత్యేకంగా నడుం బిగించాలి.మన ఆలోచన ప్రధాని..సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి వెళ్ళాలి.

ఈ విషయంలో ముఖ్యంగా మన తెలుగు బిడ్డ..ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు..
ప్రస్తుత ఉప రాష్ట్రపతి..రానున్న రోజుల్లో దేశ అత్యున్నత పదవిని చేపట్టే వ్యక్తిగా ప్రచారంలో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

కలిసి నినదిద్దాం..
కలగలిపి సాధిద్దాం..
మన ఎన్టీఆర్..
మన ఆత్మగౌరవం..
మన ఆస్తి..
భారతరత్న కావాలి..
అదే లక్ష్యం..
అదే సంకల్పం..
అదే ధ్యేయం..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286
విజయనగరం

LEAVE A RESPONSE