Suryaa.co.in

Entertainment

నలభై ఏళ్ల తెలుగు నాటక -సినీ హీరోయిన్…స్థానం నరసింహారావు

బాపట్ల అమెరికన్‌ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్‌ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు.

ఆపై చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు, కొన్ని గంటలలో ప్రదర్శించబోయే ఆ నాటకంలో ఒక వేషం కూడా వెయ్యాలని! ‘ఏ పాత్ర? మాతంగ కన్యా?’ అన్నాడా కుర్రాడు. అదో చిన్న పాత్ర. ‘కాదు, చంద్రమతి’ అన్నాడు హనుమంతరావు. హడలిపోయాడా కుర్రాడు.

ఒక్కసారి కూడా ముఖానికి రంగు పూసుకోలేదు. పోర్షన్‌ కూడా రాదు. ఎలా? వణికిపోయాడు.‘ఏం ఫర్వాలేదు. నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు. అదే చాలు. మిగతా నేను చూసుకుంటా!’ అని చేతులు పట్టుకున్నంత పని చేశాడాయన. సరేననక తప్పలేదు. వెళ్లిపోతూ ఇంకోమాట కూడా చెప్పారు హనుమంతరావు, ‘ఒరేయ్‌ నాయనా! నువ్వు రాకపోతే ఊరి పరువుపోతుంది.

ఇంక మేం తలెత్తుకోలేం. పైగా ముఖ్యఅతిథులు ఎవరో తెలుసు కదా! తిరుపతి వేంకటకవులు. వారు ప్రతి కళాకారుడినీ ఆశుకవిత్వంతో దీవిస్తారు!’ భయం భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి కృత్యాద్యవస్థ మీద ఒప్పుకున్న ఆ కుర్రాడు స్థానం నరసింహారావు. అత్యంత నాటకీయంగా రంగస్థల ప్రవేశం చేసారు స్థానం నరసింహారావు గారు

* * *
ఒక కళారంగంలో అనితరసాధ్యమైన విజయాలను సాధించిన కళాకారులందరూ తరువాతి తరాలవారికి మార్గదర్శకులే. అటువంటి ఉత్తమ కళావేత్త శ్రీ స్థానం నరసింహారావు. పురుషులే స్త్రీ వేషాలు వేసే రోజుల్లో రంగస్థలం మెట్టి విభిన్నమైన పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకతను చూపించి ముప్ఫయి సంవత్సరాలపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది.
నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు, అశేష ఆంధ్రావని నిరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి తాను చేస్తున్న పనిలో నిమగ్నత, రెండు ఆ పనిమీద భక్తి ప్రపత్తులు. తన వృత్తి యెడల అంతటి గాఢమైన మమకారం.
గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకొని మసలుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేయడం నటుని ప్రాధమికమైన అవసరాలుగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలను, కోపాన్ని, తాపాన్ని – యిలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకొని అమలుపరచడం స్థానం నటజీవన విశిష్టత. నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన.
స్థానం నరసింహారావు 1902, సెప్టెంబర్ 23 న హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం:
1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించాడు.

ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు:
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ, వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థలం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.

సినీ రంగంలో:
వీరు సినీ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాలలో నటించాడు. తన నటనానుభవాలను చేర్చి “నటస్థానం” అనే గ్రంథాన్ని ఆయన రచించాడు.

సత్యభామగా:
వాచి కాబి నయనాలలో దివి నుండి సాక్షాత్తు సత్యభామ రంగస్థలానికి ఆరుదెకింద అన్నట్లు ప్రేక్షకులను మైమరపింప చేసేవారు.
శ్రీకృష్ణతులాభారం’ రంగస్థల నాటకంలో స్థానం నరసింహారావు సత్యభామగా నటించేవారు. ఆయనే రాసుకుని పాడిన ‘‘మీరజాలగలడా నాయానతి’’ పాట పెద్దహిట్టు. ఆయన నటనకీ, పాటకీ ప్రేక్షకులు వెర్రెత్తిపోయి, ఈలలు కొడుతూ, ‘వన్స్‌మోర్‌’ కొట్టేవారు. 1935లో తొలిసారిగా ‘శ్రీకృష్ణతులాభారం’ సినిమాగా తీశారు. అప్పటికి ఆ పాట పుట్టలేదు. 1955లో రాజరాజేశ్వరీ కంపెనీ అదే చిత్రం తీసినప్పుడు ఎస్‌.వరలక్ష్మి సత్యభామగా నటించి, అనుమతి తీసుకొని ‘మీరజాలగలడా’ పాడింది. అదే వరస. 1966లో సురేష్‌ వాళ్లు మళ్లీ ‘శ్రీకృష్ణ తులాభారం’ తీశారు. జమున సత్యభామ. అదే పాటని, అదే వరసతో పాడించారు.

చీరకట్టులోని అతని నైపుణ్యం:
చీరకట్టులోని అతని నైపుణ్యం స్త్రీలనే అసూయ పరిచేదిగా ఉండేది .చీర కట్టటంలో మెళుకువలను అనేక మంది స్త్రీలు అతని వద్దే తెలుసుకునే వారని ప్రతీతి.

పేరంటం పిలుపుకోసం:
విశాఖజిల్లా మాడుగలలో ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్‌ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపుకోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు.
స్త్రీలే ఆయనను ఒక పురుషునిగా గుర్తించలేక పోయారంటే ఆ గెటప్‌లో ఆయన ఎంతగా ఒదిగిపోయే వారో….

పురస్కారాలు:
1956లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు, కళాకారుడు.
ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది.
వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.

వీరి షష్టిపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాదులో నిర్వహించారు.
స్థానం వారు 1971 ఫిబ్రవరి 21 తేదీన మరణించాడు.
స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర విస్మరించలేదు.కన్న తల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది. కళామతల్లి స్త్రీ జన్మనిచ్చింది.
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.

Collected by
– Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.

LEAVE A RESPONSE