సాములు..ఆసాములు..ఆహా సాములు!

– విగ్రహ విన్యాసంలో విరుపులు-మెరుపులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘నాకూ- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలాంటి విబేధాలు లేవు. ఇదంతా మీడియా ప్రచారం’
jeeyar-jyothi– ఇదేదో టీఆర్‌ఎస్‌లో నెంబర్‌టూగా భావించే మంత్రుల ఖండనపర్వమనుకుంటే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే.
స్వామిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం… స్వామికి కేసీఆర్ ఝలక్
jeeyar-jyothy1– పత్రికల్లో వచ్చే ఈ హెడ్డింగులు చూసి, సదరు స్వామి ఏ టీఆర్‌ఎస్ నాయకుడనుకుంటే మళ్లీ పప్పులో కాలేసినట్లే.
ఈ విగ్రహావిష్కరణకు మోదీని మించిన అర్హుడు భారతదేశంలో లేరు.
– ఈ ప్రకటనేదో భాజపాకు చెందిన నాయకుడదనుకుంటే మళ్లీ పప్పు-తప్పులో కాలేసినట్లే.
తనపై ఆగ్రహంగా ఉన్న సీఎం వద్దకు రామేశ్వరరావును రాయబారిగా పంపిన స్వామి
– ఓ పత్రికలో వచ్చిన ఈ వార్త చూస్తే, ఒకే పార్టీలోని ఇద్దరు అగ్రనేతల మధ్య ఏదైనా గొడవ వచ్చి, సర్దుబాటు జరుగుతున్నట్లు ఉంది కదా?
* * *
అసలు ఆ స్వామి ఎవరు? ఆ ఆవిష్కరణ ఏమిటి? మధ్యలో ప్రధానిపై పొగడ్తలేమిటి? ఆ స్వామిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఝలక్ ఇవ్వడమేమిటి? మధ్యలో తనపై అలిగిన సీఎం వద్దకు రియల్‌ఎస్టేట్ పెద్దను స్వామి రాయబారిగా పంపడమేమిటి?తనపై ఆగ్రహంతో ఉన్న సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు ఇదంతా ఆయన చలవేనంటూ వీఐపీలకు స్వాములోరు అడక్కపోయినా చెప్పాల్సిన అవసరం ఏమిటి? అసలు ఈ గజిబిజి గందరగోళమేమిటి అనే కదా అందరి డౌటనుమానం?!

వెళదాం. వెళదాం. అక్కడికే వెళదాం. ఇదంతా గత కొన్నిరోజుల నుంచి ముచ్చింతల్ గ్రామం వేదికగా జరుగుతున్న విగ్రహ విన్యాసానికి సంబంధించిన హడావిడి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ రామానుజాచార్యుల అతి పెద్ద విగ్రహాన్ని విశాలమైన పొలాల మధ్య నిర్మించారు. ‘కొద్దిరోజుల ముందు వరకూ’ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజగురువుగా ప్రచారంలో ఉన్న.. త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి కోరిక మేరకు, ఆయన పర్యవేక్షణలో.. పాలకులను ప్రేమించే-పాలకులు ప్రేమించే రియల్టర్లు, పారిశ్రామికవేత్తల ఆర్ధికసాయంతో ఏర్పాటుచేసిన విగ్రహమది.

స్వయంగా సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి, ఏర్పాట్లను కూడా పర్యవేక్షించేంత ప్రాధాన్యం ఉన్న స్థలమది. రాజకీయ-ఆధ్యాత్మిక-వ్యాపార కేంద్రమని గిట్టని వారి విమర్శ కూడా. రామానుజ విగ్రహ ఏర్పాటు ద్వారా, ఆ చుట్టుపక్కల భూముల రేట్లు పెంచుకుని, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలన్న వ్యూహమేనని రేవంత్‌రెడ్డి ఉవాచ.

అసలు జీయరు స్వామంటే మామూలు మహత్తు గల స్వామి కాదు. ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఆయన దిశానిర్దేశం చేయగలరు. సీఎంలు స్వాముల వద్దకు వెళతారు కాబట్టి,
jeeyar-swamy-with-telugu-cm-sఆటోమేటిగ్గా సీఎం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకూ ఆయన గురువే. అందువల్ల వారు కూడా తమ ‘రాజకీయ ఈతిబాధలు’ స్వామి వారి సముఖంలో వెళ్లబోసుకునేందుకు, క్యూలు కడుతుంటారు. తమ బాధలు ఆయనకు చెప్పుకుంటే ముఖ్యమంత్రికి చెప్పుకున్నట్లే అన్న భరోసా.

ఆ క్రమంలో పీఠానికి రోజువారీ ఎదురయ్యే ‘అనేక సమస్యలు’ నేరుగా స్వాములో, వారి మేనేజర్‌లో, పీఏలో, పీఆర్‌ఓలో సదరు వీఐపిలకు చెప్పడం.. అదెంతపనంటూ సదరు వీఐపీలు, వారి సమస్యలు నగలు లేదా నగదురూపంలోనో ఇచ్చి పరిష్కరిస్తుంటారు. ఇదంతా ఒక్క జీయరు స్వామి పీఠానికే కాదు. పక్కనున్న విశాఖ పీఠం వంటి అనేక పీఠాల్లో కనిపించే, ‘కనిపించని దృశ్యాలే’. వాటిలో గుప్తదానాలే ఎక్కువ. నేను స్వామివారికి ఇంత సమర్పించుకున్నానని పక్కనున్నవారికి చెబితే తప్ప, వారెంత ఇచ్చిందీ ఎవరికీ తెలియదు. సో.. ఎంతమంది వీవీఐపి భక్తులుంటే ఆ పీఠాలకు అంత ఇమేజ్, సుఖమన్నమాట. అందుకే సాముల్లోరు బెంజి కార్లలో తిరగగలుగుతున్నారు.

మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పీఠాలేమీ లేవా అని అడగవచ్చు. ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువ పేద-మధ్య తరగతి పీఠాలే. అంటే అరటిపండ్లు, యాపిల్‌పండ్లు తీసుకువచ్చే స్థాయి ఎమ్మార్వో, ఆర్డీఓ, గుమాస్తా, కాకా హూటళ్ల ఓనర్ల స్థాయి భక్తుల సంఖ్యనే ఎక్కువన్నమాట. ధనం లేక కార్లలో ఇంధనం కూడా ఒక్కోసారి ఉండదు. ఆ స్వాములు చెప్పినా వీఐపీలు పట్టించుకోరు. దేవదాయ శాఖ మంత్రులను కలవాలంటే, వారు కూడా అపాయింట్‌మెంట్లు తీసుకోవాలి. అంత నార్మల్ స్వాములు వారు. ముఖ్యమంత్రులనయినా, ప్రధానమంత్రులయినా అంత దూరం నుంచే మాట్లాడతారు. ముద్దులూ అవీ పెట్టరు. లౌక్యం తెలియని చాదస్తులు! అందుకే ఆ తరహా స్వాములను వీఐపీలు పట్టించుకోరు.

అదే ఏ జీయరో, ఏ స్వరూపానంద స్వామే అనుకోండి. వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు. సీఎంలే జీడిపప్పులు, కిస్‌మిస్సుల పూలగుత్తులతో వచ్చి మఠంలో వాలిపోతారు. అవన్నీ స్వాములను మేనేజ్ చేసే మధ్యవర్తులే చూసుకుంటారు. ‘పురుషుల్లో పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు.. స్వాముల్లో కాస్ట్లీ స్వాములు వేరయా!
మరి సీఎం కేసీఆర్ దగ్గర అంతలావు పలుకుబడి ఉన్న స్వామిపై కేసీఆర్ ఆగ్రహించడమేమిటి? స్వామివారు ఎంతో ప్రేమతో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణకు హాజరుకాకుండా కేసీఆర్ ముఖం
muchintal చాటేయడం ఏమిటి? అంతకష్టపడిన కేసీఆర్ పేరు విగ్రహావిష్కరణలో రాయకుండా ఆయనను కరివేపాకులా తీసేయడమేమిటి? మళ్లీ తర్వాత రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్ పేరు ఎలా కనిపించింది? అన్న ప్రశ్నలు తెరపైకి రావడం సహజం. దాన్నలా పక్కన పెడితే.. అసలు సర్వసంగ పరిత్యాగులపై సీఎంలు ఆగ్రహించడమేమిటి? స్వాములు కదా సీఎంలపై ఆగ్రహించాల్సింది? ఇక్కడ ఏపీలో జగనన్న స్కీము మాదిరిగా ‘రివర్స్ యవ్వార’మేందన్న సందేహం బుద్ధిజీవులకు రావడమూ అంతే సహజం.

jeeyarఇదంతా పక్కనపెడితే.. అసలు ఇప్పుడు సామి ఎవరు? ఆసామి ఎవరు? విగ్రహ నిర్మాణం నుంచి ఏర్పాట్ల వరకూ అన్నీ చూసింది కేసీఆరే కాబట్టి, ఆయనే ఆసామి అనుకోవాలా? సాములోరి కేంద్రంగానే ఇవన్నీ జరుగుతున్నందున, ఆయనను కేవలం సాములోరిగానే అనుకోవాలా? అన్నదే బుద్ధిజీవుల సందేహం. స్నేహమయినా, బంధమయినా, చనువయినా, చొరవయినా మరీ మోతుదు మించితే, హద్దులు దాటితే సహజంగా అందులో ఎవరో ఒకరు పలచనవుతారు. ఇప్పుడు ‘ముచ్చింతల్ విగ్రహ విన్యాసం’ ఎపిసోడ్‌లో జరుగుతోంది అదేనన్నది పెద్దల భాష్యం. నిజానికి కేసీఆర్ గొప్ప దైవభక్తుడు. చినజీయరుకు ఈ స్థాయిలో ప్రచారం రావడానికి ఆయన ఓ కారణమన్నది మనం మనుషులం అన్నంత నిజం. అసలు తెలంగాణలో చాలాకాలం నుంచి, వెలమ వర్గానికి చెందిన వారంతా జీయరు భక్తులే. ఆ ప్రభావం వల్లే వారు శైవులయినా, ఇళ్లలో కూడా వైష్ణవమతాచారం పాటిస్తుంటారు.

సరే.. ఇంతకూ జీయరు స్వామి వారు అత్యంత శ్రద్ధాశక్తులతో, చైనా నుంచి తెప్పించిన లోహాలతో అంతెత్తున నిర్మించిన రామానుజ జీయరు ఎవరన్నది పామరుల సందేహం. సమతా మూర్తి. అంటే అందరూ సమానమేనన్నది ఆయన తత్వం. రామానుజగారి గురువు ఆయనకు అష్టాక్షరి నేర్పించి, అది ఎవరికీ చెప్పవద్దని హితవు పలికారట. అయినా సరే రామానుజులు గారు గురువాజ్ఞ ధిక్కరించి, ఓ ఆలయ గోపురంపైకెక్కి.. తన గురువు ఎవరికీ చెప్పవద్దన్నప్పటికీ, అందరూ తెలుసుకోవాలన్న తన సిద్ధాంతం ప్రకారం అష్టాక్షరి చెబుతున్నానంటూ ఊరందరికీ అష్టాక్షరి బోధించారట. ఆరకంగా అందరూ సమానమేనని చెప్పడానికి ప్రయత్నించారట. ఇదీ క్లుప్తంగా రామానుజులు గారి గురించి కొద్దిమందికి తెలిసిన మాట.

అంటే గురువాజ్ఞను ధిక్కరించిన వ్యక్తి జగద్గురువెలా అవుతారు? అసలు అద్వైతం బోధించిన ఆదిశంకరాచార్య గానీ, ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు, విశిష్టాద్వైతం బోధించిన రామానుజాచార్యులలో ఒక్క ఆదిశంకరాచార్య మాత్రమే జగద్గురువైనప్పుడు కొత్తగా, మధ్యలో

రామానుజాచార్యులు జగద్గురువెలా అయ్యారు? ‘ముచ్చింతల్ సాము’లోరికి ఈ కొత్త ప్రచారమేమిటి? శంకరాచార్యులు తన 32వ ఏట మూడుసార్లు దేశాటన చేసి, పండితులను ఓడించి జగద్గురువైతే.. ఒక్క చోటకూ వెళ్లని ‘ముచ్చింతల్ సామి’ ఎలా.. ఎప్పుడు జగద్గురువయ్యారు? వెంకటేశ్వరస్వామికి ముచ్చింతల్ సామి గురువని ఏ పురాణాల్లో ఉంది? ఇదంతా జీయరు వారు తన వైష్ణవమత ప్రచారం కోసం కొత్తగా చేస్తున్న ప్రచారమేనన్నది ద్వైత, అద్వైతుల వాదన. నిజం నారాయణుడెరుక?!

సరే.. ఈ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత పంచాయతీ ఎప్పటికీ తెగేది కాదు కాబట్టి.. దాన్నలా వదిలేసి, సమతామూర్తి సిద్ధాంతం దగ్గరకు వద్దాం. రామానుజుల వారు సమతామూర్తి. అందుకే ‘మేకిన్ ఇండియా’ స్లోగన్‌కు విరుద్ధంగా, ముచ్చింతల్‌లో చైనా మెటల్‌తో ఆయన విగ్రహం ప్రతిష్టించారనుకుందాం. విగ్రహమంటే మనందిరికీ తెలిసింది రాతి విగ్రహాలే. శిల్పులు రాయిని విగ్రహంగా మారుస్తారు. ఇప్పటి యాదాద్రిలోనూ కనిపించేది అదే. మరి అలాంటిది చైనా నుంచి లోహాలు తెప్పించి, దానికి బంగారు తాపడాలు అద్ది విగ్రహం ప్రతిష్ఠించడం శాస్త్రసమ్మతమా? అసలు ప్రపంచానికి అష్టాదశ కర్మక్రతువుల గురించి నిర్దేశం చేసిన.. వైఖానస ఆగమ పండితుడయిన విఖనసాచార్యుల విగ్రహం బదులు, రామానుజాచార్యుల విగ్రహం ఎందుకు పెట్టారు? అన్న పండితుల ప్రశ్నల జోలికి పోతే అదో పెద్ద రచ్చలాంటి చర్చ. కాబట్టి వదిలేద్దాం.

కానీ సమానత్వ సిద్ధాంతాన్ని ప్రవచించిన రామానుజుల వారి బాటలో చిన జీయరుస్వామి ఎందుకు పయనించలేదన్నది ఇప్పుడు తెరపైకొచ్చిన ప్రశ్న. విగ్రహావిష్కరణ ఆహ్వానానికి ఢిల్లీ వెళ్లిన చిన జీయరు స్వామి, కేవలం అధికార పార్టీ అయిన బీజేపీ నేతలను మాత్రమే ఎందుకు ఆహ్వానించారు? రాహుల్‌గాంధీ,
modi-jeeyar కేజ్రీవాల్, ములాయంసింగ్ వంటి విపక్ష నేతలను స్వయంగా వెళ్లి ఎందుకు ఆహ్వానించలేదు? పోనీ తెలుగు రాష్ట్రాల సీఎంలయిన కేసీఆర్, జగన్‌ను స్వయంగా ఆహ్వానించిన చినజీయరు స్వామి.. విపక్ష నేతలయిన చంద్రబాబునాయుడు, పవన్, రేవంత్‌రెడ్డి, శైలజానాధ్, అసదుద్దీన్ ఒవైసీ, షర్మిల, ఆర్‌ఎస్ ప్రవీణ్‌తోపాటు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ను అదే పద్ధతిలో స్వయంగా వెళ్లి ఎందుకు ఆహ్వానించలేదు? అంటే వారంతా జీయరు స్వామి దృష్టిలో సమానులు కాదా? వారికి రామానుజుల సిద్ధాంతం వర్తించదా?

మరి అందరూ సమానమని ప్రవచించిన సమతామూర్తి సిద్ధాంతాన్ని స్వాములోరే ఉల్లంఘిస్తే ఎలా? అంటే అధికారంలో ఉన్న వారి దగ్గరకే వెళ్లమని ముచ్చింతల్ స్వాములోరు చెప్పారా? వీటికిమించి.. సమానత్వ సిద్ధాంతం ప్రవచించిన రామానుజుల వారి విగ్రహ సందర్శనకు, ఇప్పటివరకూ ముస్లిం-క్రైస్తవులెవరైనా వచ్చారా? 108 దేవాలయాలను ఇక్కడే ప్రతిష్ఠిస్తే, ఇక భక్తులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఈ విగ్రహ ఏర్పాటుతో చినజీయరు సాములోరు, హైందవ సంప్రదాయానికి ఇవ్వదలచుకున్న సందేశం ఏమిటి? అన్న ద్వైత, అద్వైతుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వారెవరు?

Leave a Reply