ఉచిత విద్యుత్తుతో ఉక్కిరిబిక్కిరి!

– కేంద్రం బొగ్గు ఇవ్వడం లేదన్న సర్కారు
– లోటు లేదన్న కేంద్ర విద్యుత్, గనులశాఖ మంత్రులు
– కేంద్రంపై నెపం నెడుతున్నా కిమ్మనని ఏపీ బీజేపీ
– కేంద్ర మంత్రుల ప్రకటనతో సంకటంలో ఏపీ సర్కారు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఓట్ల రాజకీయానికి విద్యుత్తు బలవుతోంది. రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీల వలలో చిక్కుకున్న జనం ఇప్పుడు చీకట్లో చిక్కుకుని ఫలితం అనుభవిస్తున్నారు. గద్దెనెక్కిన పాలకుల ఉచిత విద్యుత్తు ఇప్పుడు రాష్ట్రాలను అంధకారబంధురం చేస్తోంది. దీనికి కేంద్రాన్ని నిందిస్తూ, నెపాన్ని ఢిల్లీపై నెట్టే ప్రయత్నాలు విమర్శలపాలవుతున్నాయి. ఏపీలో సర్కారు తప్పిదం వల్ల ఆ రాష్ట్రం అంధేరాప్రదేశ్‌గా మారింది. కేంద్రం మోగించిన ముందస్తు ప్రమాదఘంటికలు పెడచెవిన పెట్టిన ఫలితాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సిన అనివార్యా పరిస్థితి. ఇదంతా కేంద్ర నిర్వాకమేననంటూ వైసీపీ చేస్తున్న దాడిపై ఏపీ బీజేపీ ఎదురుదాడి చేయలేని నిస్సహాయ పరిస్థితి. దానితో కేంద్రానిదే తప్పని భావించే స్థితి.
ఏపీకి 27,310 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యంఉంది. కానీ 18,648 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అంటే 8,662 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని (అంటే 31శాతాన్ని) ఆపేశారు . తెలంగాణకు 14,408 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యముంటే, 13,895 మెగావాట్లు ఉత్పత్తిచేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రం కేవలం 513 మెగా వాట్లు మాత్రమే నిలిపేసింది. ఒడిశాకు 12,258 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యముంటే, 9,829 మెగావాట్లను ఆ రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది. అంటే కేవలం 19శాతం మాత్రమే ఉత్పత్తి ఆగిపోయింది. చత్తీస్ ఘడ్ కు 24,659 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యముంటే, 18,266 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. 6,393 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి ఆగిపోయింది. తమిళనాడుకు 37,704 మెగావాట్ల సామర్థ్యముంటే, 28,773 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. 5,931 మెగావాట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. ఆ విధంగా అన్నిరాష్ట్రాలకంటే అధికంగా ఏపీలోనే 8,662 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు.
ఇక విద్యుత్ వినియోగం విషయానికి వస్తే, గుంటూరు వన్ టౌన్లో 3,497మిలియన్ యూనిట్లు అవసరమైతే, సరఫరా అవుతున్నది 3,007 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటేదాదాపు 490మిలియన్ యూనిట్లు సరఫరాచేయడం లేదు. గుంటూరు టూ టౌన్లో 3,064 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరమైతే, 2,379 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తెనాలిలో 2,385 మిలియన్ యూనిట్లు అవసరమై తే, 2049 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరాచేస్తున్నారు. బాపట్లలో 1565 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమై తే, కేవలం 1020 మిలియన్ యూనిట్లు మాత్రమే అందిస్తున్నారు . నరసరావుపేటలో 3,118 మిలియన్ యూనిట్లకు 1099 మిలి యన్ యూనిట్లు మాత్రమే అందిస్తున్నారు. మాచర్లలో 1937 మిలియన్ యూనిట్లు వినియోగదారులకు అవసరమైతే, 1531 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరాచేస్తున్నారు. అమరావతి లో 1066 మిలియన్ యూనిట్లు అవసరమైతే, 1044 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరాచేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ కరెంట్ కోతలు అనధికారికంగా అమలుచేస్తున్నారు. జిల్లాకేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోనే పరిస్థితి ఇలాఉంటే,ఇక పల్లెల్లో ఎలా ఉంటుందో చెప్పాల్సినపనిలేదు.
‘‘ రాష్ట్రంలో బొగ్గునిల్వలు లేవనిచెప్పి, యూనిట్ విద్యుత్ రూ.2.50పైసలకు అందించే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూసేసిన ముఖ్యమంత్రి, బయటనుంచి రూ.20 లకు కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీప్రశ్నిస్తోంది. 20లక్షల టన్నుల బొగ్గు సిద్ధంగా ఉందని కేంద్రం చెబుతుంటే, ఈ ముఖ్య మంత్రి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు బాకీలు చెల్లించకుండా , ప్రధానికి లేఖరాసి చేతులు దులుపు కుంటారా? 20లక్షల టన్నుల బొగ్గు సిద్ధంగా ఉందని కేంద్రం చెబుతుంటే, ఈ ముఖ్య మంత్రి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు బాకీలు చెల్లించకుండా , ప్రధానికి లేఖరాసి చేతులుదులుపుకుంటాడా? రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాని కి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసేసి, బయటనుంచి అధికధరకు విద్యుత్ కొనడంఏమిటని ప్రశ్నిస్తున్నాం. విద్యుత్ సంస్థలను అడ్డు పెట్టి అప్పు తీసుకొచ్చిన రూ.26వేల కోట్లను ఏంచేశాడో ముఖ్య మంత్రి ప్రజలకు సమాధానంచెప్పాలి. రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాని కి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలనుమూసేసి, బయటనుంచి అధికధరకు విద్యుత్ కొనడంఏమిటని ’’ టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు.

కిం కర్తవ్యం?

కాగా తాజాగా కేంద్ర విద్యుత్, గనులశాఖ మంత్రులు చేసిన వేర్వేరు ప్రకటనలతో ఏపీ సర్కారు సంకటంలో పడింది. బొగ్గు అందుబాటులోనే ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రకటించారు. ‘20 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోనే ఉంది. కొనడానికి ఏపీ సర్కారు దగ్గర డబ్బులేదేమో’నన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వ్యాఖ్య, ఏపీ సర్కారును ఇరుకున పెట్టింది. ఆ ఇద్దరు కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై.. వైసీపీ సర్కారు ఇప్పటిదాకా స్పందించకపోవడమే సర్కారు ఆత్మరక్షణ లో పడిందనడానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పెను భారంగా మారిన ఉచిత విద్యుత్తు

ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిపై ఉచిత విద్యుత్తు పెను భారంగా మారింది. రోజూ విద్యుత్తు కొనుగోలు కోసం ప్రభుత్వం 60 కోట్లు వెచ్చిస్తోంది. నిజానికి సింగరేణికి 2 వేల కోట్లు, మహానది కోల్ ఫీల్డ్ కంపెనీకి 200 కోట్లు, కోల్ ఇండియాకు 215 కోట్లు చెల్లించే ఆర్థిక స్తోమత లేని ఏపీ సర్కారు, ఇప్పుడు బేల చూపులు చూడాల్సిన దుస్థితి తలెత్తింది. పాత బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్తు ఇస్తామని మెలిక పెడుతున్న విద్యుత్ సంస్థలను, జగన్ సర్కారు ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే విద్యుత్తు సంస్థలను చూపి 26 వేల కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఆరుసార్లు విద్యుత్ రేట్లు పెంచడం ద్వారా 11,611 కోట్ల భారం వేసింది. ఆ విధంగా ఏపీ ప్రజలు మోస్తున్న విద్యుత్ భారం మొత్తం 36 వేల కోట్లు.
ఈ విషమ పరిస్థితిలో ఉచిత విద్యుత్తు సర్కారుకు తలకుమించిన భారమవుతోంది. ప్రతి ఏటా దాదాపు 8500 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సుమారు 17 లక్షల కనెక్షన్లకు ఏటా 15 మిలియన్ యూనిట్లు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి ఏడాదికి దాదాపు లక్ష రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కారుకు, ఉచిత విద్యుత్తు తలకుమించిన భారంగా మారింది. దీనిని తొలగించకపోతే విద్యుత్తు రంగంలో మరిన్ని చీకట్లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేంద్రానికి మద్దతుగా గళం విప్పని కమల దళం

‘‘దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. కేంద్రం బొగ్గు సరఫరా చేయటం లేదు. ఎంత డబ్బు పెట్టినా దొరికే పరిస్థితి లేదం’’టూ నెపాన్ని కేంద్రాన్ని నెట్టే ప్రయత్నం చేసిన వైసీపీ సర్కారుపై, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటిదాకా ఎదురుదాడి చేయకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమయింది. 20 లక్షల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్వయంగా ప్రకటించడం బట్టి, దేశంలో విద్యుత్తు అందుబాటులోనే ఉందని స్పష్టమవుతోందని బీజేపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. పాత బాకీలు చెల్లించి బొగ్గు దిగుమతి చేసుకోవాలని, బొగ్గు కొరత ఉంటే తీసుకోవాలని తామెప్పుడో ఏపీ సర్కారుకు లేఖ రాశామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి సోషల్‌మీడియా వచ్చిన కథనాలను వారు గుర్తు చేస్తున్నారు.
పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం 10 రూపాయలకే యూనిట్ విద్యుత్‌ను అమ్ముతుంటే, జగన్ సర్కారు 20 రూపాయలకు కొనాల్సిన అవసరం ఏమిటన్న అంశంపై, ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రశ్నించకపోవడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విద్యుత్ సమస్య తీవ్రమయి, అది ప్రజాజీవితంపై ప్రభావితం చూపుతుంటే పార్టీపరంగా ప్రభుత్వంపై సీరియస్‌గా పోరాడకుండా.. కంటితుడుపు ధర్నాలతో, తమ పార్టీ చేస్తున్న బంతిపూల యుద్ధంపై బీజేపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అసలు కారణం ఇదీ..

బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది.దాంతో సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు 50% విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి.ఢిల్లీ కి సంబంధించి ఒక్క రోజుకి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ గఢ్,మహారాష్ట్ర, పంజాబ్,తమిళనాడు రాష్ట్రాలలో విద్యుత్ కోతలు తప్పేట్లు లేవు.
సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు, విదేశాల నుండి బొగ్గుని దిగుమతి చేసుకొని విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండోనేషియా ఇప్పటి వరకు ఒక టన్ను బొగ్గు కి గాను $60 డాలర్లు వసూలు చేసేది. కానీ హఠాత్తుగా ధరలు పెంచేసి టన్ను కి $160 డాలర్లు అడుగుతున్నది. అంటే టన్నుకి 100 డాలర్లు పెంచేసింది. దాంతో అంత ధర పెట్టి కొనలేని విద్యుత్ కేంద్రాలు మన దేశంలోని బొగ్గు గనుల మీద ఆధారపడడం మొదలు పెట్టేసరికి, బొగ్గుకి తీవ్ర కొరత ఏర్పడింది.
సాధారణంగా ప్రతీ మూడు లేదా ఆరు నెలల ముందే బొగ్గుకి ఆర్డర్ చేస్తాయి విద్యుత్ సంస్థలు. కానీ ఇండోనేషియా ఒక్క సారిగా ధరలు పెంచే సరికి దిగుమతిని ఆపేశాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పేరుతో దుబారా చేస్తూ, విద్యుత్ సంస్థల పైన తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి తక్కువ ధరకి విద్యుత్ ఇవ్వమని.పైగా తెర చాటు లంచాలు సరేసరి! ఇప్పుడు? బొగ్గు కొరత ఏర్పడగానే చేతులు ఎత్తేసి కేంద్రం వైపు చూడడం మొదలుపెట్టాయి.
మరి ముందు జాగ్రత్త తీసుకోలేదా? ఎలా తీసుకుంటారు? ప్రతి 45 రోజులకి రాష్ట్ర విద్యుత్ బోర్డులు, విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకి చెల్లింపులు చేస్తుంటాయి. కానీ గత కొంత కాలంగా మూడు నుండి 6 నెలల దాకా బకాయి పడ్డాయి రాష్ట్ర విద్యుత్ బోర్డులు. దాంతో చేతిలో డబ్బు లేక , ముందు జాగ్రత్తగా బొగ్గుకి ఆర్డర్ ఇవ్వలేకపోయాయి. దాని ఫలితమే ఇప్పటి తీవ్ర బొగ్గు కొరత. ఓట్ల కోసం ఉచితాలు ఇవ్వడం దేనికి? దాని ఫలితంగా విద్యుత్ సంస్థలకి ఆలస్యంగా బిల్లులు క్లియర్ చేయడం దేనికి? ఇప్పుడు బొగ్గు సరఫరా చేయమని కేంద్రం మీద ఒత్తిడి తేవడం ఎందుకు?
2019 లో సెప్టెంబర్ నెల కాలానికి, 2021 సెప్టెంబర్ నెల కాలానికి విద్యుత్ డిమాండ్ 35% పెరిగింది. అంటే 2019 కంటే 2021 కి ఎక్కువ డిమాండ్ ఉంది.కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఒక్కసారిగా పుంజుకోవడం తో, ఆర్డర్లు ఎక్కువ అయి విద్యుత్ కి డిమాండ్ ఏర్పడ్డది. 2020 కి గాను కోవిడ్ వల్ల లెక్కలోకి తీసుకోలేదు.
ఇప్పటికే పంజాబ్ లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. లోడ్ షెడ్డింగ్ ని అమలు చేస్తున్నారు. పంజాబ్ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. పంజాబ్ రైతులు ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే అత్యంత ధవంతులు. కాబట్టి ఇకనయినా ఉచిత విద్యుత్ ఆపేస్తారా? లేక ఎక్కువ ధరపెట్టి విదేశాలనుండి దిగుమతి చేసుకుంటారా?
ప్రస్తుతానికి 7 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కోబోతున్నాయి. భవిష్యత్తులో ఈ జాబితాలోకి మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి, రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నది. కోల్ ఇండియా తో పాటు ఇండియన్ రైల్వేస్ తో కూడా, రోజువారీగా సమీక్షలు చేస్తున్నది కోర్ కమిటీ. మొత్తం 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకి బొగ్గు సరఫరా చేయడానికి, యుద్ధ ప్రాతిపదికన ఇండియన్ రైల్వేస్ వాగన్ లని సమకూరుస్తున్నది బొగ్గు సరఫరా కోసం.
గత నెలలో పడ్డ తీవ్ర వర్షాలకి బొగ్గు గనులలో నీరు చేరి తవ్వకాలకి ఆటంకం ఏర్పడ్డది.యుద్ధ ప్రాతిపదికన గనులలో ఉన్న నీరుని శక్తివంతమయిన పంప్ లతో బయటికి తోడిస్తున్నారు.బహుశా ఈ ప్రక్రియ ముగిసి మళ్ళీ బొగ్గు తవ్వకాలు మొదలవడానికి వారం పట్టవచ్చు. అప్పటి వరకు విద్యుత్ కొరత తప్పదు.
సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు, కేంద్రం ఆక్సీజెన్ ఇవ్వలేదని విమర్శించిన పార్టీలు, ఇప్పుడు కూడా బొగ్గు మీద రాజకీయాలు మొదలుపెట్టాయి .ప్రైవేట్ విద్యుత్ సంస్థలు 3 నెలలు ముందుగానే బొగ్గుకి ఆర్డర్ ఇవ్వాలి. అలాగే నెల రోజులకి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా వాటిదే.రాష్ట్ర విద్యుత్ బోర్డులు సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే, విద్యుత్ సంస్థలు ముందస్తుగా బొగ్గుని కొనలేవు. ఇది ఒక దానితో ఇంకోటిగా ఉండే చైన్ లింకు. విదేశాలనుండి బొగ్గు ఖరీదు ఎక్కవ అవగానే.. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకుండా, ఇప్పుడు మన దేశ బొగ్గు గనుల నుండి బొగ్గు సరఫరా చేయమని అడగడం దేనికి? అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

Leave a Reply