Home » జాషువా గుండెల్లోని వ్యధ.. మనది!

జాషువా గుండెల్లోని వ్యధ.. మనది!

పరాయి పాలనలో మ్రగ్గుతూ ఉండిన భారతావనిలో అన్ని రంగాల్లోనూ కారుచీకట్లు కమ్ముకున్న కాలమది. సవర్ణ హిందూవులచేత వెలివేయబడిన నిమ్నజాతుల వారికోసం విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని నెలకొల్పి మిషనరీలు ఆ అమాయకులను క్రైస్తవానికి ఆకర్షిస్తూ ఉండిన రోజులవి. గుంటూరులోని లూథరన్ మిషన్, వినుకొండలోని బాప్టిస్టుమిషన్ లు ఆ రోజుల్లో మతప్రచారానికి కేంద్రబిందువులు. అసమానతలకు ఊపిరిపోసిన కులమతాల కుమ్మలాటకు తోడు అంథవిశ్వాసాలు, మూఢాచారాలు తోడై సమాజాన్ని నిర్వీర్యం చేశాయి.
అలాంటి సామాజిక పరిస్థితుల మధ్య జన్మించినవాడు కవికోకిల గుఱ్ఱం జాషువా. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన సాహితీవేత్తల్లో ధ్రువతార గుఱ్ఱం జాషువా. జాషువా తండ్రి గుఱ్ఱం వీరయ్య గొల్లకులస్థుడు. తల్లి లింగమాంబ మాదిగ కులస్థురాలు. శ్రీ జాషువా 28 సెప్టెంబరు 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. ఆయన పాఠశాలలో చేరినప్పటి నుండి తోటి పిల్లలు “నన్నుతాకవద్దు నీవు అస్పృశ్యడవంటూ” అవమానపరచేవారు. తనకవమానాలు ఎదురైనపుడు జాషువా ఊరుకొనేవాడు కాదు. తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టిన సందర్భాలున్నాయ్.
అనంతర కాలంలో ఈ సత్కవీంద్రుడు కవిత్వాన్నే ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. శ్రీ జాషువా ఒక సందర్భంలో తన జీవన వివరాలను చెబుతూ, “జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు. పేదరికం, కుల మత వివక్ష. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ, బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైనే ద్వేషం,” అని తన జీవన సందేశాన్ని తెలిపారు.
సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి,సామాజిక ప్రయోజనం ఆశించి మాత్రమే ఆయన రచనలు చేశారు.భావ కవిత్వం పేరుతో ప్రబలిన భావదారిద్ర్యం,అస్పష్ట భావచాలనం,అంధానుకరణ,ప్రేయసీ సమారాధన వంటి అంశాలు ఆయనకు నచ్చలేదు. ముఖ్యంగా ప్రేయసీ సమారాధనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారనే చెప్పవచ్చు. “దుష్కవీశ్వరులమ్మాయిలకై రచింతురు తమాషా గేయ విజ్ఞప్తులన్” అనేశారంటేనే ఆ తరహా రచనలపై ఆయనకున్న విముఖత మనకు అవగతమవుతుంది.
చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు.
1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. తనకు ఎదురైన అవమానాల కారణంగా…. జాషువా వ్యధిత హృదయం నుండి కవిత్వం పెల్లుబికింది. కానీ భావ ప్రకటనకు అవసరమయిన భాష లేదు. భాషా జ్ఞానం కోసం పురాణేతిహాసాలను చదువ సాగారు. దానితో క్రైస్తవులు ఉగ్రులయ్యారు. మాదిగ కులస్థుడు అయి ఉండి శాస్త్రాలు చదవడమా? అంటూ హిందువులు ప్రశ్నించారు. జాషువా కవిత్వంలో హిందూమతాన్ని ప్రచారం చేసే అంశాలు ఉండడంతో క్రైస్తవ బోధకులు జాషువా చేస్తున్న టీచరు ఉద్యోగం నుండి ఆయనను డిసిమిస్ చేశారు.
ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఆయన పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశారు.
తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశారు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివారు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అంటరానివాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను ద్వేషించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి వెలివేశారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది.
1934లో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి జమీందారును కలవడానికి రైలులో ప్రయాణిస్తున్నారు జాషువా. రైలులో జాషువాకు పరిచయమైన ఒక అగ్రకులోన్మాది జాషువా కవిత్వం విని ప్రశంసించాడు. ఆ తరువాత నీ కులం ఏమిటని అడిగి, తెలుసుకుని అవమానపరుస్తూ లేచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో జాషువా హృదయంలో బాకుతో కుమ్మినట్లయింది. ఈ సంఘటనను కవిత్వంలో చెప్పారాయన.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపురే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళియన్నవారె, ‘నీ
దే కులమన్న’ ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో,
బాకున గ్రుమ్మినట్లగును, పార్థివచంద్ర! వచింప సిగ్గగున్!
ఆయన ఫిరదౌసి, గబ్బిలము, స్వప్నకథ, కాందిశీకుడు, ముంతాజ్ మహల్, నేతాజీ, స్వయంవరము ‘నాకథ’ వంటి రచనలు రచించారు. మీ జీవితంలో మరపురాని ఆనందకరమైన సంఘటన ఏమిటని ప్రశ్నిస్తే, “తిరుపతి వేంకట కవుల వంటి పెద్దలు స్వయంగా నాకు గండపెండేరం తొడిగి, ఏనుగుపైకెక్కించి, కనకాభిషేకం చేయడం” అని ఆయన ఆనందభాష్పాల మధ్య చెప్పేవారు.
గుఱ్ఱం జాషువా ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నారు. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధులయ్యారు. పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలను అందుకున్నారు.
ఆయన సాహితీరంగంలో అత్యున్నతస్థానాన్ని పొందారు. కానీ అంటరానివాడుగా అడుగడునా అవమానాలకు, వివక్షకు గురయ్యారు. అయినా హిందూసమాజం మీదగానీ, భారతావని పైనగానీ ఆయన అక్కసు పెంచుకోలేదు. సామాజిక వికృతులను చీల్చి చెండాడుతూ తన సాహిత్యం ద్వారా సామాజిక సమతా సందేశాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు. ఆరోజుల్లో క్రైస్తవ మతప్రచారము, ఆంగ్లేయ ప్రభుత్వపాలన, వారి నాగరకతల పట్ల మోజు, సామ్యవాదపు ప్రభంజనం తీవ్రంగా ఉండినది. జాతీయవాదానికి ప్రమాదంగా ఉన్న కష్టకాలమది. ఆసమయంలో ఆయన కలంనుండి వెలువడ్డ సాహితీ ఆణిముత్యాలు కొన్ని…..
‘అనాథ’ అన్నకావ్యంలో ప్రమాదంపాలైన ఒక దళిత మహిళను ఒక అగ్రకుల సజ్జనుడు రక్షించి వైద్యశాలకు తీసుకువెడతాడు. తాను చేసిన పనికి ‘గంగాస్నానం చేసినంతగా సంతోషపడతాడు. కానీ అతని భార్యమాత్రం ‘మాల’ను ముట్టుకొన్న భర్తను తిట్టి, అతని పై నీళ్ళుపోసి స్నానం చేయిస్తుంది. భర్త మాత్రం అస్పృశ్యతను నిరాకరిస్తాడు. “నీ కోపం పోయిందా? బయటి స్నానం వల్ల ముక్తి వస్తుందా?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు భర్త.
అలక శమించెనా? జలకమాడిన యంతనె? మాలదాని పి
ల్లల కడగండ్లు సూచి బహుళంబుగఁ దప్తమునందు నా మనో
జలజము మైలవడ్డదది స్నానము చేసెనె? వెఱ్ఱిదాన! ఈ
వెలుపలి శుద్ధి జీవులకుఁ బెట్టునె? పోయునె? ముక్తి నిచ్చునే”?
1928లో ‘భారతమాత’ అన్న శీర్షికన కవితలో భారతదేశ ప్రాచీనతను పేర్కొంటూ “ఉర్వి పుట్టక ముందె నీవుంటి వేమొ” అన్నారు. హిమాలయాన్ని భారతమాత తలమీది ‘బొండు మల్లెల దండ’ గాను, సింహళ ద్వీపాన్ని ఆ దేవి “పూత బంగారు సొమ్ముల పెట్టె” గానూ స్తుతించారు.
1926లో ‘శివాజీ ప్రబంధము’ అన్న చారిత్రక కావ్యంలో భారతమాతను ఎంతో రమ్యంగా స్తుతించారు!
సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టిసాధ్వి
కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూతదేహ
కాళిదాసాది సత్కవికుమారులగాంచి కీర్తినొందిన పెద్దగేస్తురాలు
బుధాది మునిజనంబుల తపంబున మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు
సింధు గంగానదీ జల క్షీరమేపుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న
పచ్చి బాలెంతరాలు, మా భరత మాత, మాతలకు మాత, సకల సంపత్ సమేత”
అదే కావ్యంలో…. శివాజీని ఈ విధంగా స్తుతించాడు.
“శివరాజా ప్రతిభా విభాకర! శహజీ నందనా! దీనబాం
ధవ! హిందూ ధరణీ శుభంకర! మహాత్మా! సద్యశశ్చంద్రికా
ధవళీ భూత దిశావకాశ రిపు కాంతా సూత్ర విధ్వంసనో
త్సవ కేళీ పరతంత్ర! నీ కిదె నమస్కారంబు వీరాగ్రణీ”!
అంతేకాదు పాశ్చాత్యుల పాలన భారతీయులపాలిటి ఈశ్వరప్రసాదమని మురిసిపోయిన ఆంగ్లమానస భక్తుల – విదేశీ దాస్యప్రవృత్తిని కవికోకిల జాషువా నిర్మొహమాటంగా విమర్శించారు.
“ఆ కాలాన అమెరికా దొరల దాస్యంబు ఐహికాముష్మిక
శ్రీకిం చక్కని రాజమార్గమని హర్షీభూత చేతస్కులై
దూకుల్ బెట్టుచునుండు క్రైస్తవుల”… ను అపహాస్యం చేశాడు.
వివేకానందుడు అమెరికా వెళ్ళి సాధించిన విజయంపట్ల జాషువా ఇలా హర్షం ప్రకటించారు…..
దొరసానమ్మలు బొమ్మలై కలికి ముద్దుం కన్నులం నిండుట
చ్చెరువున్ మక్కువ నింప, చక్కదనమున్ చిన్నారి లేబ్రాయమున్
మెరయన్, హైందవ వేదసారమును గంభీరోక్తులన్ నీపయిన్
కురియించెం కద! మానరేంద్ర ముని చంద్రుడు, ఓ చికాగోపురీ”
1962 చైనా భారత దేశంపై దాడి చేసిన సందర్భంగా “ ముసాఫరులు” అన్న కావ్యంలో మాతృ దేశ రక్షణ కోసం చైనాతో పోరాడి అమరుడైన జీవుడు ఊర్ధ్వముఖంగా సూర్యమండలం మీదకి వెడుతూ మార్గమధ్యంలో చంద్రమండలంపై ఆగి సేద తీర్చుకుంటున్నాడంటూ దేశభక్తులకు ‘ముక్తి’ లభిస్తుందంటూ దేశభక్తిని ప్రబోధించాడు.
“చైనీయ రుధిర నిర్ఝరుల స్నానము చేసి భరత సైనిక కోటి మరలు దాక,
కుటిల నీతిజ్ఞుల గురుకపాలములతో అభవుండు తాండవమాడు దాక
పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి నిలయాన దివ్వెలు వెలుగుదాక
భారతీయుల భుజబల శౌర్యసంపత్తి పంచ ఖండములాక్రమించుదాక….
నిద్రపోవదు భారత భద్రకాళి”
అంటూ….త్యాగులైన భారత వీర సైనికులను స్తుతించాడు.
చివరిగా తన ప్రఖ్యాతమైన’గబ్బిలం’ లో గబ్బిలం ప్రయాణిస్తున్న మార్గాన్ని తంజావూరు నుండి ఎవరెస్టు శిఖరం వరకూ భారత భూమిని పరిచయం చేస్తాడు. జాషువా ‘గబ్బిలం’ ద్వారా శివునికి సందేశం పంపాడు. జాతీయ రహదారికి దూరంగా నున్నప్పటికీ గజ్జె కట్టి నాట్యంచేసే భీమేశ్వరుడు దళితులను ఉద్ధరిస్తాడన్న ఆశతో ద్రాక్షారామానికి వెళ్ళమని గబ్బిలాన్ని అర్థించాడు. ‘ముక్తి బిక్ష పొందడంకోసం’ వారణాశిలో అన్నపూర్ణచేతి – ఆహార బిక్షకు వారణాశికి వెళ్ళవలసిందిగా గబ్బిలాన్ని కోరాడు.
“అజ్జాయింతువొ చుట్టుమార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం
డుజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి ముప్పొద్దులన్
గజ్జం కట్టెడి నాట్యగాడతడు సాక్షాత్కారమున్ చెందినన్
మజ్జాత్యుద్ధరణంబు గల్గగలదమ్మా పొమ్ము సేవింపగన్”!
చివరకు గబ్బిలం హిమాలయాలమీద ఎగిరి కైలాసాన్ని చేరి ‘దళితసందేశాన్ని’ శివునికి వినిపిస్తుంది. అది విని శివుడు కన్నీరు కార్చాడట! పరమశివుని కరుణతో అంటరానితనం తొలగిపోయింది. దీనితో కావ్యం ముగుస్తుంది.
గబ్బిల మేమని చెప్పెనో గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్
గుబ్బటిలి లేచి, నల్లని మబ్బులలో తక్షణంబ మాయంబయ్యెస్.
గబ్బిలం కవిత వ్రాసి 70 సం॥లయినా ఆనాటి వివక్ష ఇంకా తొలగిపోలేదు. కొనసాగుతున్న వివక్ష గురించి ‘సందేహ డోల’ కావ్యంలో జాషువాసృష్టికర్తనే నిలదీశాడు.
“సృష్టికర్తవు నీవు నీ సృష్టిలోని
మానవుడ నేను, ఇద్దరి మధ్య మనకు
ముసుగులో గ్రుద్దులాటలు పొసగవింక!
హక్కు కలదయ్య! ప్రశ్నసేయంగ నిన్ను”
నిజానికి కొనసాగుతున్న సామాజిక వివక్షకు మనలను మనమే ప్రశ్నించుకోవాలి.
1971 జూలై 24 న గుంటూరులో శ్రీ జాషువా తనువు చాలించారు. జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవీయ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది.
కుటుంబంలో ఎలాంటి సాహిత్య నేపథ్యము లేకపోయినా జీవితంలో ఎదురైన వెతల నుంచే కవితలు పొంగించిన సహజ కవి శ్రీ జాషువా. ఆయన కవిత్వం పాఠకులని మైమరపిస్తుంది. జాషువా గుండెల్లోని వ్యధ మనదిగా తోస్తుంది. వారి ఆవేదనతో మనమూ సహానుభూతి చెందేలా చేస్తుంది. శ్రీ జాషువా ప్రార్థనలాలకించైనా ఆ పరమేశ్వరుడు మన దేశంలో ఏనాటికైనా ఆ ‘కులవివక్ష’ రక్కసిని అంతం చెయ్యాలి. అందుకోసం మనమంతా త్రికరణ శుద్ధిగా కృషి చెయ్యాలి. భారతమాతకు జయమగుగాక.

– శ్రీరాంసాగర్

Leave a Reply