Suryaa.co.in

Editorial

పాపం.. విజయ‘అ’శాంతి!

– రాములమ్మ స్టార్‌ క్యాంపెయినర్‌ కాదట
– టికెట్‌ కూడా దక్కని అవమానం
– తొలుత కేసీఆర్‌పై పోటీ చే స్తారన్న ప్రచారం
-అయినా మూడు జాబితాల్లోనూ కనిపించని పేరు
– బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో కనిపించని పేరు
– ఈటల, అరుణ, కొండా పాటి గౌరవం దక్కని విజయశాంతి
– పేరుకే విజయశాంతికి ఆందోళన కమిటీ చైర్మన్‌
– స్టార్‌ క్యాంపెయినర్‌గా అవకాశం ఇవ్వని బీజేపీ
– పొమ్మనలేక పొగబెడుతోందా?
– జంపువుతారన్న అనుమానంతోనే జాబితాలో చోటివ్వలేదా?
– ఇక విజయశాంతి దారెటు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌, ఒకప్పటి లేబీ అమితాబ్‌కు పువ్వు పార్టీలో అవమానాలు పెరుగుతున్నాయా? ఆమెను బీజేపీ నాయకత్వం పట్టించుకోవడం లేదా? కొత్తగా చేరిన వారి పాటి గౌరవం కూడా ఆమెకు ఇవ్వకుండా అవమానిస్తోందా? కంటితుడుపు కమిటీకి చైర్మన్‌గా వేసి పక్కనపెట్టిందా? ఇప్పుడు రాములమ్మను పొమ్మనలేక పొగబెడుతోందా? మరి విజయశాంతి దారెటు? కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు? తాజాగా బీజేపీ ప్రకటించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో, విజయశాంతి పేరు కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు అవును అనే సమాధానం వస్తోంది.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న బీజేపీ.. ఆ మేరకు తగిన నేతలు, యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. జాతీయ నేతలను ప్రచారరంగంలోకి దింపనున్న బీజేపీ.. వివిధ రాష్ర్టాలకు చెందిన ఎమ్మెల్యేలను, ఒక్కో నియోజకవర్గానికి ఒకరిని ఇన్చార్జిగా నియమించింది. సంఘ్‌ పర్యవేక్షణ దానికి అదనం.

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం తాజాగా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాను అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీసులకూ అందిస్తారు. అయితే ఆ జాబితాలో తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌, బీజేపీ సీనియర్‌ నేత విజయశాంతి పేరు లేకపోవడం సంచలనం సృష్టించింది. నిజానికి ఆమెకు పార్టీ నాయకత్వం ఇటీవలే ఆందోళన కార్యక్రమాల కమిటీ చ్మైరన్‌గా నియమించింది. ఇంతలోనే ఆమె పేరు స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఆమెను కేసీఆర్‌ లేదా కేటీఆర్‌పై పోటీ చే యిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. విజయశాంతి పోటీతో, బీజేపీ బలపడుతుందన్న భావన ఏర్పడింది. ఆవిధంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు మీద బలమైన అభ్యర్ధులను నిలబెట్టాలని భావించింది. ప్రస్తుతం విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

అలాంటి ది తాజా స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో విజయశాంతి లేకపోవడాన్ని పార్టీ వర్గాలు అవమానంగా భావిస్తున్నారు. టికెట్‌ ఇవ్వని నాయకత్వం.. చివరకు స్టార్‌ క్యాంపెయినర్‌గా కూడా అవకాశం ఇవ్వవలేదంటే, పొమ్మనలేక పొగబెట్టడంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నారు.

అయితే దానికి పార్టీ సీనియర్లు మరొక వివరణ ఇస్తున్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న విజయశాంతి, ఇటీవల చేసిన కొన్ని ట్వీట్లు వివాదంగా మారాయి. వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయం లేని బీజేపీలో, వ్యక్తిగత ప్రాధాన్యం ఆశించడం అవివేకమంటున్నారు. పైగా ఆమె కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్‌ వంటి దారిలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను నాయకత్వం గ్రహించినట్లు చెబుతున్నారు.

నిజానికి విజయశాంతి కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం నిర్ణయించారని, అది ఏ కారణం వల్ల వాయిదా పడిందో తమకు అర్ధం కావడం లేదంటున్నారు. విజయశాంతి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరితే.. స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించిన తర్వాత కూడా, ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లారన్న ప్రచారం పార్టీకి నష్టం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. అప్పుడు పార్టీ ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటికే కిషన్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడంపై విపక్షాలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నాయి. కిషన్‌రెడ్డి యుద్ధానికి ముందే అస్త్రసన్యాసం చేశారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితిలో ఒకవేళ విజయశాంతికి స్టార్‌ క్యాంపెయినర్‌ ఇచ్చినా.. ఆమె వెళ్లిపోతే పార్టీ పరువు పోతుందన్న కారణమే, ఆమెకు స్టార్‌ క్యాంపెయిన్‌ హోదా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అయితే పార్టీలో సీనియర్‌ అయిన విజయశాంతికి అటు టికెట్‌ ఇవ్వకపోవడం ఒక అవమానమయితే, స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా ఇవ్వకపోవడం మరో అవమానకనమంటున్నారు. విజయశాంతి కంటే పార్టీలో జూనియర్లయిన ఈటల రాజేందర్‌, డికె అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి పాటి విలువ విజయశాంతి చేయరా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE