Home » రూము లేదు.. కారు లేదు.. ప్యూన్ లేడు!

రూము లేదు.. కారు లేదు.. ప్యూన్ లేడు!

తెలంగాణ ఆఫీసులో ఏపీ చైర్మన్‌కు చోటు లేదు
హైదరాబాద్‌లో ఏపీ హెచ్‌ఆర్‌సీ దుస్థితి
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)

హైకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఏపీ హ్యూమన్ రైట్ కమిషన్ (ఏపీహెచ్‌ఆర్‌సీ)కు ఇప్పటిదాకా సొంత కార్యాలయం లేదు. ప్రభుత్వం నియమించిన చెర్మన్, సభ్యులకు  కూర్చునేందుకు చోటు లేదు. వారికి కనీసం అటెండరు లేడు. ఇక కారు సంగతి గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, ఏపీ నుంచి రోజుకు 20 ఫిర్యాదులు మాత్రం వస్తుంటాయి. వాటిని పరిష్కరించాల్సిన చైర్మన్, సభ్యులకు మాత్రం ఇప్పటిదాకా నిలువనీడ లేదు. ఇవీ హైదరాబాద్‌లో ఏపీ హెచ్‌ఆర్‌సీ ఎదుర్కొంటున్న కష్ట్టాలు.

రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ల తర్వాత, ఏపీకి ప్రత్యేకంగా హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుచేయాలని ఏపీ హెకోర్టు ఆదేశించింది. దానితో ప్రభుత్వం ‘ఏపీ స్టేట్ హెచ్చార్సీ, నాంపల్లి, హైదరాబాద్’ పేరుతో హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు జీఓ ఇచ్చింది. అయితే.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ,  హెచ్‌ఆర్‌సీ కార్యాలయం నాంపల్లిలోనే కొనసాగుతోంది. తెలంగాణ  హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం, చాలాకాలం క్రితమే తెలంగాణ హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని నాంపల్లి కార్యాలయాన్నే తెలంగాణ హెచ్‌ఆర్‌సీ కూడా వినియోగిస్తోంది. విభజన చట్టం ప్రకారం  హెచ్‌ఆర్‌సీలో ఉద్యోగులు, కార్యాలయ విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు.

అయితే గత నెలలో ఏపీ హైకోర్టు కూడా.. తెలంగాణ హైకోర్టు మాదిరిగానే, ఏపీ హెచ్చార్సీ ఏర్పాటుచేయాలని ఆదేశించింది. దానితో ఏపీ సర్కారు ముందూ వెనకా, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా.. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే, ఏపీ హెచ్చార్సీ ఏర్పాటుచేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. దానితో సమస్య మొదలయింది. ప్రస్తుతం నాంపల్లిలోని ఉమ్మడి రాష్ట్ర హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని, తెలంగాణ హెచ్‌ఆర్‌సీ పూర్తి స్ధాయిలో వినియోగించుకుంటోంది. గతంలో జస్టిస్ కక్రు, కాకుమాను పెదపేరిరెడ్డి, డి. సుబ్రమణ్యం వినియోగించిన గదులన్నీ,  ఇప్పుడు  తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్, సభ్యులు వాడుకుంటున్నారు. దానితో ఏపీ హెచ్చార్సీ చైర్మన్, సభ్యులకు కూర్చునేందుకు రూము, కుర్చీ కూడా లేకుండా పోయిన దుస్థితి ఏర్పడింది.

దానితో చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు, దండే సుబ్రమణ్యం గత నెల మార్చి 24న, ఎవరి ఇళ్లలో వారే పద వీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. నాంపల్లిలోని తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే, ఏపీ హెచ్చార్సీకి ఆఫీసు కేటాయించినప్పటికీ..అక్కడ స్థలం లేకపోవడంతో, ఇప్పటిదాకా ఎవరూ ఆఫీసులో అడుగుపెట్టని వైచిత్రి నెలకొంది. ఇప్పటిదాకా వీరికి కారు సౌకర్యం, అటెండరు సౌకర్యం కూడా ఏర్పాటుచేయలేదు. హెచ్చార్సీ ఏర్పాటుకావడంతో ఏపీ నుంచి నాంపల్లి హెచ్చార్సీ ఆఫీసుకు ప్రతిరోజు 20 నుంచి 25 ఫిర్యాదులు.. మెయిల్, పోస్టు ద్వారా వస్తున్నట్లు సమాచారం. ఆ ఫిర్యాదులను పరిష్కరించేవారెవరూ లేకపోవడంతో, సిబ్బంది వాటిని కట్టకట్టి పక్కనపెడుతున్నారు. హెచ్చార్సీ విభజన ఇప్పటికీ జరగకపోవడంతో, ఏపీకి చెందిన ఉద్యోగులు ఇంకా తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

నిజానికి మానహ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం,  రాష్ట్ర రాజధాని నగరంలోనే హెచ్చార్సీ ఆఫీసు ఉండాలని స్పష్టం చేసింది. ఆ  మేరకు గత ఏపీ ప్రభుత్వం, విజయవాడ బందరు రోడ్డులోని ఆర్ అండ్ బీ బిల్డింగ్‌లో, 5 వేల చదరపు అడుగులు హెచ్చార్సీ ఆఫీసు కోసం కేటాయించింది. కానీ గత నెల వరకూ హెచ్చార్సీ చైర్మన్, సభ్యులు లేకపోవడంతో ఆ కార్యాలయాన్ని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం అదే భవనంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఏపీ హెచ్చార్సీ ఏర్పడినప్పటికీ, అది తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో ఏర్పాటుచేయడం సమస్యలకు దారితీస్తోంది. విజయవాడలోనే ఏపీ హెచ్చార్సీ ఆఫీసు ఏర్పాటుచేయకపోతే, ఏపీ నుంచి ఫిర్యాదుదారులు హైదరాబాద్‌కు రావడం కష్టమవుతుంది.

కాగా ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని,  ఏపీ హెచ్చార్సీ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. ఏపీ హెచ్చారీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన వివరణ కోరగా… ‘నిజమే. అయితే ఈ సమస్యలన్నీ బహుశా వారం, రెండువారాల్లో పరిష్కారమవుతాయనుకుంటున్నా. చైర్మన్ గారు సీఎస్‌తో ఇప్పటికే చర్చించారు.  తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌తో కూడా చర్చించి ఈ సమస్య పరిష్కరించాల్సి ఉంది. కాబట్టి అన్ని సౌకర్యాలతో ఏపీ హెచ్చార్సీ పనిచేయడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నా’నని వ్యాఖ్యానించారు. కాగా బుధవారం సాయంత్రం ఏపీ హెచ్చార్సీ చైర్మన్ సీతారామమూర్తి హటాత్తుగా, తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అందుబాటులో ఉన్న గదులు, ఇతర అంశాలపై చర్చించారు

Leave a Reply