Suryaa.co.in

Editorial

తిరుపతి ప్రచారానికి జగన్

14న భారీ బహిరంగసభ?
బీజేపీ హిందుత్వ విమర్శలపై సభలోనే సమాధానం
ప్రచారంపై మనసు మార్చుకున్న సీఎం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, తాజాగా మనసు మార్చుకున్నారు. ఫలితంగా ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న, భారీ బహిరంగసభకు హాజరవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ యువనేత  నారా లోకేష్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా ఈనెల 12న, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా గురువారం నుంచి,  ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా ప్రచారానికి రానున్నారు.  ఈ నేపథ్యంలో వైసీపీ  కార్యకర్తలలో  ఉత్సాహం నింపేందుకు, సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం… 14న తిరుపతి రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేయనున్న భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అందుకోసం మైదానంలో ఏర్పాటుచేస్తున్నారు. నిజానికి స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న జగన్.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు చిత్తూరు, నెల్లూరు జిల్లా వైసీపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటివరకూ జరుగుతున్న డబ్బు పంపిణీ విషయంలో కూడా ఆయన వినూత్నమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఆ ప్రకారంగా.. ఓటుకు నోటు ఇవ్వకుండా, పాలనపై ప్రజల స్పందన ఎలా చూసే ఒక ప్రయోగంగా ఈ ఉప ఎన్నికను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే.. బీజేపీ అగ్రనేతలు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో,  హిందూత్వ కార్డును సంధిస్తున్నారు. వైసీపీ పాలనలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందన్న ప్రచారానికి పదును పెడుతున్నారు. దానితో అప్రమత్తమయిన  జగన్,  మనసు మార్చుకోవలసి వచ్చిందని పార్టీ వర్గాలు చెప్పాయి.  తిరుపతి వేదిక నుంచే హిందూమత పరిరక్షణ కోసం తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను హిందువులకు వెల్లడించేందుకే, సీఎం తిరుపతి ప్రచారానికి వస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. ‘ఈనెల 14న బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయమయింది. వేదిక కోసం మేం రెండు, మూడు చోట్ల పరిశీలించి వచ్చాం. బహుశా యోగానంద ఇంజనీరింగ్ కాలేజీ వేదిక ఖరారు కావచ్చు. అయితే సీఎం బహిరంగసభకు మాత్రమే హాజరవుతారా? లేక రోడ్‌షో ద్వారా బహిరంగసభకు వస్తారా? అన్నది ఇంకా ఖరారు కాలేద’ని ఆ  ఎమ్మెల్యే వెల్లడించారు. హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించి, హిందుమత సంరక్షణకు మా ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుందో అదే వేదికపై జగన్‌గారు చెప్పడం ద్వారా, బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టబోతున్నామని ఆ ఎమ్మెల్యే వివరించారు.

నిజానికి పార్టీకి సబంధించినంత వరకూ, ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందులేమీ కనిపించటం లేదు. తిరుపతి పార్లమెంటు పరిథిలోని చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. ఫలితంగా  ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో 27 డివిజన్లు, సూళ్లూరుపేటలో 14 వార్డులు,  నాయుడుపేటలో 22, వెంకటగిరిలో 22 వార్డు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు కూడా నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లో  ఏకపక్షంగానే సాగాయి.

LEAVE A RESPONSE