Suryaa.co.in

Editorial

ఏబీకి పోస్టింగ్‌పై మళ్లీ హైకోర్టుకు

– అపీలుకు వెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయం
– క్యాట్ తీర్పును లెక్కచేయని వైనం
– కోడ్ అమలులో ఉన్నా సీఎం ఎలా ఆదేశిస్తారు?
– కోడ్ సమయంలో సీఎంకు ఫైలు ఎలా పంపిస్తారు?
– అప్పుడే ఎందుకు అపీలుకు వెళ్లలేదు?
– జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు నిర్ణయాలా?
– ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయించడమే జగన్ లక్ష్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అమరావతి: అనుకున్నదే జరుగుతోంది. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ సర్కారు, తన కక్షసాధింపును కొనసాగిస్తోంది. ఆయనకు తక్షణం పోస్టింగుతోపాటు, నిలిపివేసిన జీతభత్యాల బకాయిలు కూడా చెల్లించాలని క్యాట్ ఆదేశించింది. క్యాట్ తీర్పు కాపీని ఏబీవీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి అందచేసి, తనకు పోస్టింగ్ ఇవ్వాలని లేఖ రాశారు. అయితే దానిపై జవహర్‌రెడ్డి తక్షణం నిర్ణయం తీసుకోకుండా, దానిని సీఎం జగన్‌కు పంపించారు.

దానితో ఏబీవీకి అనుకూలంగా క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈనెల 23న విచారణ జరగనుంది. అది ఎలాగూ మరికొంతకాలం సాగుతుంది. ఈలోగా ఏబీవీ ఈనెల 31న రిటైర్ కానున్నారు. అంటే ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయించాలన్న జగన్ లక్ష్యం నెరవేరినట్లే. ఒకవేళ హైకోర్టు ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇస్తే, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఖాయం. ఆ కోణంలో చూసినా ఏబీవీ సర్వీసు పుణ్యకాలం తీరిపోతుంది.

డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై, జగన్ సర్కారు వేధింపుల పరంపర విజయవంత ంగా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, రెండుసార్లు సస్పెండ్ చేసిన ఏబీవీ క్యాట్‌తో సహా అన్ని కోర్టుల్లోనూ విజయం సాధించారు. అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుకు వ్యతిరేక తీర్పులే వచ్చాయి. ఏబీకి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారం కూడా సమర్పించలేక చేతులెత్తేసిన జగన్ సర్కారు, కోర్టు కేసులను వాయిదాలతో విజయవంతంగా సాగదీసింది.

తాజాగా క్యాట్ సైతం ఏబీపై చేసిన అభియోగాల్లో పస లేనందున, ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అక్కడ నుంచి తీర్పు రావడానికే మూడు రోజులు పట్టడం ఇంకో వింత. ఆ కాపీని ఏపీ సీఎస్‌కు ఇచ్చారు. నిజానికయితే సీఎస్ ఆయనకు వెంటనే ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి. పోనీ క్యాట్ ఆర్డరును అప్పుడే హైకోర్టులో సవాల్ చేయాలి. ఈరెండూ చేయకుండా, ఫైలును సీఎం జగన్‌కు పంపించడంతోనే.. ఏబీకి రిటైరయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వరని అర్థమయిపోయింది. సీఎం వద్దకు వెళ్లిన ఆ ఫైలును పరిశీలించిన జగన్.. క్యాట్ ఆర్డరును హైకోర్టులో సవాల్ చేయాలని ఆదేశించారట.

నిజానికి క్యాట్ తీర్పు కాపీలు సీఎస్‌కు అందినప్పుడు, ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పటికీ కోడ్ అమలులోనే ఉంది. అదివేరే విషయం! అప్పుడు సీఎంకు పాలనతో ఎలాంటి సంబంధం ఉండదు. సీఎస్ సొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకుని, ఈసీకి తెలియచేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా సీఎంకు ఫైలు ఎలా పంపారన్న చర్చ అధికారవర్గాల్లో జరుగుతోంది.

అయితే క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లాలన్న తాజా నిర్ణయం కూడా, సీఎం జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు వెలువడటమే విచిత్రం. ఒకవేళ సీఎం జగన్ రాష్ట్రంలోనే ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకుని ఉంటే, అప్పుడే హైకోర్టుకు అపీలు కోసం వెళ్లాల్సి ఉంది.

అయితే ఇదంతా నిశితంగా పరిశీలిస్తే.. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే ఆయనను రిటైర్ చేయించాలన్న కుట్ర స్పష్టమవుతోందని ఐపిఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈనెల 23న హైకోర్టులో జరిగే కేసు కూడా ఆయన రిటైరయ్యే వరకూ తేలదని, కాబట్టి ఆయన సర్వీసులోచేరకుండానే రిటైర య్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు.

LEAVE A RESPONSE