మళ్లీ పాలిటిక్స్‌లోకి డీఎల్ రీ ఎంట్రీ

(మార్తి సుబ్రహ్మణ్యం)
కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, క్యాబినెట్ నుంచి తవలగించబడిన డీఎల్ ఒకప్పుడు సంచలన రాజకీయనేత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డికి మద్దతునిచ్చిన తర్వాత డీఎల్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సీట్లు ఇవ్వకపోవటంతో, ఆగ్రహించిన డీఎల్ వారిని ఇండిపెండెంట్లుగా నిలబెట్టారు.
చివరకు తన సొంత గ్రామంలో కూడా, తాను సిఫార్సు చేసిన వారికి సీట్లు ఇవ్వని వైనం ఆయనకు మనస్తాపానికి గురిచేసింది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నిలబెట్టిన అభ్యర్ధులపై చాలాచోట్ల డీఎల్ వర్గీయులే గెలవడంతో, ఎమ్మెల్యే వర్గీయులు డీఎల్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు నిర్వహించారు. ఈ అంశాలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.ఇదంతా అవమానంగా భావించిన డీఎల్, అప్పటినుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు.
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఆ మేరకు చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు. చివరకు నిధుల అంశం కూడా మాట్లాడుకున్నారు. అయితే చివరిలో నాటి టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్‌కే టికెట్ ఇవ్వడంతో, టీడీపీలో చేరాలనుకున్న ఆలోచన విరమించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ డీఎల్ పేరు రాజకీయాల్లో ఎక్కడా వినిపించలేదు.
అయితే కరోనాకు ముందు మైదుకూరు నియోజకవర్గంలోని తన అనుచరులతో భేటీ నిర్వహించిన ఆయన పాదయ్రాత్రకు సిద్ధమయినట్లు ఆయన అనుచరులు అప్పట్లో చెప్పారు. మండలాలు, గ్రామాల వారీగా కమిటీలు వేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే కరోనా తీవ్రత వల్ల ఆయన ఆలోచన వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఎన్నికల వరకూ ఏ పార్టీలో చేరకుండా, అప్పటివరకూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వంపై పోరాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ ఇప్పుడు తాను క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నానని ఆయనే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పనన్న డీఎల్.. వైసీపీ సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అన్ని శాఖల ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డినుద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులను డమ్మీలుగా అభివర్ణించిన డీఎల్ ఏమన్నారంటే..
‘‘ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తా . ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుంది. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు.రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చింది. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి.తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడు. పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడు. నా సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదు.
సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదు.దారినపోయే వారందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు.ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు. సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుంది.
భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పని. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. సబ్సిడీ ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమం..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు ’’
సజ్జలకు ఏం సంబంధం: డీఎల్
కాగా పొలిటికల్ రీఎంట్రీపై డీఎల్‌తో మాట్లాడగా.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే తాను మళ్లీ యాక్టివ్ కావలసిన అవసరాన్ని సృష్టించాయని వ్యాఖ్యానించారు. ‘‘ఏందయ్య.. మీరు ఇన్నాళ్ల నుంచీ మమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడైనా అన్ని శాఖల తరఫున ఒకడే మాట్లాడటం మీరెప్పుడైనా చూశారా? ఇప్పుడేందిది? అందరి తరఫున సజ్జల మాట్లాడతాడా? ఆయనకేం తెలుసు? అడిగేవాడు లేడా? మంత్రులు సిగ్గుపడాల్సింది పోయి ఆయన పక్కన కూర్చుంటారా? మొన్న ఉండవల్లి ప్రెస్‌మీట్ చూశా. ఏంది అప్పులు చేయడం మంచిదేనా? ఎవడబ్బసొమ్మని చేస్తారు? ఎవరు తీరుస్తారని చేస్తారు? రాష్ట్రంలో అరాచక పరిస్థితులు చూస్తున్నాం. వాటిని చూస్తూ ఉండలేకపోతున్నా. చాలామంది మీలాంటి వాళ్లు మౌనంగా ఉండటం మంచిదికాదని నన్ను అడుగుతున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మేధావుల మౌనం సమాజానికి ప్రమాదం. రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండి మౌనంగా ఉంటున్న వాళ్లందరూ దయచేసి బయటకొచ్చి గొంతు విప్పాల్సిన సమయం ఇది’’ అన్నారు. త్వరలో తన భవిష్యత్తు ప్రణాళిక వెల్లడిస్తానని డీఎల్ చెప్పారు.

Leave a Reply