Suryaa.co.in

Editorial

వైనాట్ 175 నుంచి.. దేవుడి దయ వరకూ..

– జగన్‌లో ధైర్యం జారిపోతోందా?
– ఇండియాటుడే ఇంటర్వ్యూలో జగన్ బేల వ్యాఖ్యలు
– దేవుడిపై భారం వేశానంటూ వైరాగ్యం
-ఓడినా బాధపడనంటూ చేతులెత్తేసిన నైరాశ్యం
– తలపట్టుకున్న మంత్రులు, వైసీపీ సీనియర్లు
– అధినేత వైరాగ్యంపై అభ్యర్ధుల ఆందోళన
– జగనే ఆ మాటంటే ఇక మా జరుగుబాటేందని ఆవేదన
– ఎన్నికల వేళ ఏమిటీ వైరాగ్యం అని ఆగ్రహం
– జనంలో తప్పుడు సంకేతాలు వెళితే మా గతేంటని ప్రశ్న
– ఓడిపోతున్నామని ముందస్తు సంతేకాలిస్తే ఎలా?
– కేసీఆర్ బాటలోనే జగన్ పయనిస్తున్నారా?
జగన్ మాదిరిగానే అప్పుడు కేసీఆర్ వైరాగ్యం
– ఓడిస్తే ఇంట్లో రెస్టు తీసుకుంటామన్న కేసీఆర్
– ఇప్పుడు కేసీఆర్ బాటలోనే జగన్
– యుద్ధానికి ముందే అస్త్రసన్యాసమా?
జగన్ అస్త్ర సన్యాసంపై అభ్యర్ధుల ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)

అడవికి రాజు సింహం. దాని రాజసం, దర్పమే వేరు. సింహం సిక్కయినా, ఆకులు-అలమలు-డ్రైఫ్రూట్సూ తినదు. గ్రీన్‌టీ తాగదు. జంతువునే తింటుంది. జంతువు రక్తమే తాగుతుంది. . అంతే తప్ప దేవుడు విసిరే మాంసం కోసం ఎదురుచూడదు. దేవుడిపై భారం వేయదు. పోరాడి గెలవడం దాని నైజం. జూలో సింహాలు మాత్రమే, దేవుడు ఇచ్చే మాంసంపై ఆధారపడతాయి. సింహం సింగిల్‌గా వస్తుందని గొప్పగా చెప్పుకునే వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే సింహం, దేవుడిపై భారం వేసింది. ఓడినా పెద్దగా ఫీలవ్వనంటోంది.

‘కొండంత రాగం తీసి పిచ్చగుంటలో పాడినట్లు’ అన్నది తెలంగాణలో ఒక సామెత. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల మనోభావం కూడా ఇదే. సింహం సింగిల్‌గా వస్తుందని రజనీకాంత్ మాదిరిగా, నిన్నటి వరకూ భారీ డైలాగులు కొట్టిన వైసీపీ వీరులు.. ఇప్పుడు అధినేత బేల మాటలతో ఆందోళనలో పడ్డారు. వైనాట్ 175? వైనాట్ కుప్పం? అన్న అన్నయ్య.. ఇప్పుడు ‘దైవాధీనం లారీ సర్వీస’ని చేతులెత్తేయడం, అభ్యర్ధులను కలవరపరుస్తోంది.

మరి ఇన్నాళ్లూ చెప్పిన నా అక్కా చెల్లెలూ.. అవ్వాతాతలు… నా ఎస్సీలు.. నా బీసీలు.. నా బీసీలు ఏమైనట్లు? అవన్నీ అన్నయ్య మేకపోతు గాంభీర్యమేనా? ఎవరొచ్చినా.. ఎంతమంది వచ్చినా.. నా వెంట్రుక కూడా పీకలేరన్న డైలాగులు ఉత్తుత్తివేనా? అవన్నీ తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకేనా? ‘నా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయ’నుకునే అధినేత అన్నయ్య.. చివరాఖరకు దేవుడు గెలిపిస్తే తప్ప, గెలిచే దిక్కులేదా?.. ఓడినా బాధపడనన్న ముందస్తు ఓటమి ఒప్పుకోలు, అన్నయ్య బేలతనాన్ని స్పష్టం చేస్తున్నాయా? ఇవీ ఇప్పుడు వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలు. దానికి కారణం అన్నయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలే.

సింహం సింగిల్‌గా వస్తుందన్న వైసీపీ నేతల గంభీర ప్రకటనలు.. తాజాగా అధినేత జగన్ ఇండియాటుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, సింహం సిక్కయిందని, వేటాడే మూడుకు బదులు.. దేవుడే తిండిపెడతాడన్న వైరాగ్యానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘సింహం సిక్కయితే పందికొక్కులు స్టెటస్కోప్ వేసుకుని పల్సు చూశాయన్న’ ఓ తమిళ డబ్బింగు సినిమా డైలాగు, ఆంధ్ర రాష్ట్రంలో నిజం కానుందా? అన్న సందేహాలకు తెరలేచింది.
లేకపోతే.. ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తూ, ప్రత్యర్ధులపై విరుచుకుపడే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. లేటెస్టుగా జావగారిపోయి, దేవుడిపై భారం వేసి మాట్లాడటమే ఆయన వీరాభిమానులకు జీర్ణం కావడం లేదట.

సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి.. కృష్ణాజిల్లా ఇద్దరు నానీలు.. నెల్లూరు అనిల్.. విశాఖ అమర్నాధ్.. నగరి రోజాలు, ఇప్పటిదాకా తమ అధినేత జగన్‌ను సింహంతోనే పోల్చారు. టీడీపీ-జనసేన కలసి పోటీ చేసినా, సింహం సింగిల్‌గానే వస్తుందని భారీ డైలాగులు చెప్పారు. కానీ జగన్ మాత్రం తాను దేవుని బిడ్డ కాబట్టి.. దేవుడే చూసుకుంటాడని, ఆధ్మాత్మిక వైరాగ్యం ప్రకటించారు. ఎన్నికల్లో ఓడినా బాధపడనంటూ.. యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయడం, జగన్ వీరాభిమానులకు రుచించడం లేదు. ఇప్పటివరకూ జగన్ గురించి తామిచ్చిన బిల్డప్పులన్నీ, రాంగోపాల్‌వర్మ సినిమాలో గుండుసూది శీను మాదిరిగా మారాయని తెగ మధనపడుతున్నారట. దానికి వారు చెబుతున్న లాజిక్కు భలేగా ఉంది.

అసలు రాజకీయాల్లో అర్ధనాకు పనికిరానివాళ్లయినా, విజయం తమదేనంటారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని బిల్డప్పులిస్తుంటారు. 150 సీట్లలో తమదే విజయమని బిల్డప్పు అప్పారావులా మాట్లాడుతుంటారు. అలాంటిది అధికారంలో ఉండి… అక్కాచెల్లెమ్మలు, అవ్వా తాతల ఆశీస్సులుండి, వై నాట్ 175 అని నినదించిన తమ అధినేత జగన్.. కనీసం ‘వచ్చే ఎన్నికల్లో తమదే విజయం’ అని బల్లగుద్ది, ఇండియాటుడే సర్దేశాయ్ ముందు, ఎందుకు వాదించలేదో వైసీపీ వీరులకు ఇప్పటికీ అర్ధం కావడం లేదట.

చివరకు కెఏ పాల్ లాంటి వాళ్లు కూడా.. తానే సీఎం, తానే పీఎం అని ఏకకాలంలో ప్రకటించుకుంటుంటే.. 151 సీట్లు సాధించిన జగన్ మాత్రం, తానే కచ్చితంగా గెలుస్తానని చెప్పకుండా.. దేవుడిపై భారం వేయడం ఏమిటో, ఇప్పటికీ అర్ధం కావడం లేదట. అంటే అక్కా చెల్లెమ్మలు, అవ్వా తాతలు వైసీపీకి ఓట్లు వేయరన్న ఉప్పు జగనన్నకు ముందే అందిందా? అందుకే దేవుడిపై భారం వేశారా? అంటే ఎన్నికల్లో జెండా పీకేస్తామన్న అంచనాకు వచ్చేశారా? అన్న డౌటనుమానాలు, వైసీపీ నేతల్లో మొదలయ్యాయి.

నేతల సంగతి పక్కనపెడితే..జగనన్న లేటెస్టు కామెంట్లపై, వైసీపీ అభ్యర్ధులే ఆగమవుతున్నారు. స్వయంగా అధినేతనే దేవుడిపై భారం వేస్తే ఇక మా గతేమిటి? జగనన్నే దేవుడిపై భారం వేస్తున్నానంటే, ఇక మాకు ఓట్లేసేదెవరు? 80 శాతం సంతృప్తకర స్థాయి… 86 శాతం బీసీ-ఎస్టీ-ఎస్టీ-మైనారిటీ వర్గాలు వైసీపీ వైపే ఉన్నాయని చెప్పే జగన్, ఎన్నికల్లో వాళ్లంతా చేయిచ్చేస్తారని డిసైడయ్యారా?

అయితే అయ్యారు.. దాన్ని మనసులో పెట్టుకోకుండా, దేవుడిపై భారం వేశానని చెప్పిన ఫలితంగా, ‘ఇక వైసీపీ సినిమా అయిపోయిందన్న’ సంకేతాలు జనంలోకి వెళితే మా బతుకేంటి? మీమీద మీకే నమ్మకం లేకపోతే మిమ్మల్ని చూసి ఓటెవరు వేస్తామంటే మా భవిష్యత్తు ఏమిటన్నది వైసీపీ అభ్యర్ధుల అసలు ఆందోళన.

తెలంగాణలో బీఆర్‌ఎస్ అధినేత- మాజీ సీఎం కేసీఆర్ కూడా.. ఎన్నికల ముందు చేసిన ఇలాంటి బేల వ్యాఖ్యలే, ఆ పార్టీ కొంపముంచిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ‘‘మీరు గెలిపిస్తే ఇంకా గట్టిగా పనిచేస్తాం. లేకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటా’’మన్న కేసీఆర్ వ్యాఖ్యలు, బూమెరాంగయి బీఆర్‌ఎస్ కొంపముంచాయి. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా తమ కొంప ముంచేలా ఉన్నాయన్నది వైసీపీ అభ్యర్ధుల ఆందోళన.

ఇప్పుడు తమ అధినేత జగన్ కూడా.. ‘‘దేవుడిపైనే భారం వేశాం. ఓడినా బాధపడేది లేద’’ని చేసిన వ్యాఖ్యలు, యుద్దానికి వెళ్లే సైనికులు ముందస్తు అస్త్ర సన్యాసం చేసిన మాదిరిగా ఉందని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారట. ఏదేమైనా సింహం ఇప్పుడు, దేవుడు దయతలిస్తే తప్ప.. వేటాడే పరిస్థితిలో లేదని సింహమే చెప్పుకుంది.

LEAVE A RESPONSE