జనసేన-బీజేపీ… ఉత్తుత్తి పొత్తులేనా?

– విశాఖ ఘటనపై ఆలస్యంగా మేల్కొన్న బీజేపీ నాయకత్వం
– లోకేష్ ట్వీట్ తర్వాత కదిలిన ఏపీ బీజేపీ
– నాగోతు స్పందన తర్వాత మేల్కొన్న రాష్ట్ర నాయకత్వం
– విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన లో కనిపించని బీజేపీ నేతలు
– తరలిరాని విశాఖ బీజేపీ క్యాడర్
– సర్కారుతో జనసైనికుల ఒంటరిపోరు
– కలసి కదం తొక్కుతామన్న రొటీన్ ప్రకటనలు
– ఎక్కడా కనిపించని ఉమ్మడి ఉద్యమం
– స్థానిక ఎన్నికల్లోనూ విడి సమరమే
– మూడు ఉప ఎన్నికల్లోనూ ఉత్తుత్తి మద్దతే
– కమలం-జనసేన కంటితుడుపు పొత్తులేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇద్దరూ ‘హమ్ సబ్ ఏక్ హై’ అంటారు.. కలసి కదం తొక్కుతామన్న గంభీర ప్రకటనలిస్తారు.. మేమూ-జనసేన కలసి పోటీ చేస్తామంటారు.. మాకెవరితోనూ పొత్తుల్లేవంటారు.. కానీ వాళ్లిద్దరూ కలసి పనిచేసినట్లు ఎక్కడా కనిపించదు. సర్కారుపై కలసి కదం తొక్కినట్లు భూతద్దం వేసి వెతికినా కనిపించదు. చివరాఖరకు స్థానిక ఎన్నికల్లోనూ అదే సీను. అయితే వారి సఖ్యత- స్నేహమంతా పత్రికాప్రకటనల ‘మద్దతు’వరకే కనిపిస్తాయి. క్షేత్రస్థాయిలో కనిపించవు. తిరుపతి నుంచి ఆత్మకూరు ఉప ఎన్నికల వరకూ ఇదే తంతు. మొన్నటి విశాఖ ఘటనలోనూ అవే సీన్లు రిపీటయ్యాయి. ఇదీ ఏపీలో బీజేపీ-జనసేన ‘నిఖార్సయిన’ దోస్తానా.

బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో తప్ప, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని ఏపీ బీజేపీ దళపతి సోము వీర్రాజు ఖండితంగా చెబుతుంటారు. కానీ జగన్ సర్కారును గద్దె దింపేందుకు, తాము ఎవరితోనయినా కలిసేందుకు సిద్ధమమని జనసేనాధిపతి పవన్ చెబుతారు. దానికోసం ఒక మెట్టు తగ్గేందుకయినా సిద్ధమేనంటారు. ఈసారి విపక్షాల ఓట్లు చీలనిచ్చేదిలేదంటారు. ఇవి భవిష్యత్తు ఎన్నికలపై వారిద్దరూ చేసే భిన్నప్రకటనలు.

అంతకుముందు.. రాష్ట్రంలో బీజేపీ-జనసేన కలసి కార్యక్రమాలు నిర్వహిస్తాయని, ఒకరికొకరు సమన్వయంతో కలసి పనిచేస్తాయని.. పవన్‌ను కలసిన ప్రతిసారీ బీజేపీ నేతలు, మీడియాకు చెబుతుంటారు. కానీ ఒకరి కార్యక్రమాల్లో మరొకరు పాల్గొన్న దాఖలాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించదు. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు-బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా, కలసి పనిచేసిన దృశ్యాలు కనిపించలేదు. పైగా తిరుపతి ఎంపీ అభ్యర్ధిని మిత్రపక్షమైన తమను సంప్రదించకుండానే, బీజేపీ ఏకపక్షంగా ప్రకటించడంపై జనసైనికులు కారాలు మిరియాలు నూరారు. ఆ మూడు ఎన్నికల్లోనూ జనసైనికులు ప్రచారంలో అంటీముట్టనట్లే పనిచేశారు. పవన్ మాత్రం, తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్లారు.

ఇక జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు శరపరంపరగా చేస్తున్న మాటల దాడులపైనా బీజేపీ నేతలది పలాయనవాదమే. మంత్రులపై జనసేన నేతలే ఎదురుదాడి చేస్తున్నారుpavan తప్ప, బీజేపీ నేతలు ఏ సందర్భంలోనూ ఖండించిన దాఖలాలు లేవు. అదే సమయంలో అప్పుడప్పుడు.. మంత్రులు-వైసీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలయిన సత్యకుమార్-కన్నా లక్ష్మీనారాయణను విమర్శిస్తున్నా, జనసేన నేతలు వాటిని ఖండించడం లేదు. పవన్‌పై మంత్రులు-వైసీపీ నేతలు చేసే విమర్శలను.. టీడీపీ నేతలు ఖండిస్తున్నారే తప్ప, మిత్రపక్షమని ప్రకటించుకున్న బీజేపీ నేతలు మాత్రం మౌనంగా ఉండటం మరో విచిత్రం.

తాజాగా విశాఖ ఘటనలో సైతం.. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్, చంద్రబాబు ఖండ న ప్రకటన విడుదల చేసిన తర్వాతనే, బీజేపీ నాయకత్వం మేల్కొనడం ఆశ్చర్యం. అది కూడా తొలుత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు వీడియో విడుదల చేసిన తర్వాతనే, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. విశాఖలో జనసైనికులపై పోలీసు జులం- దానిపై పవన్ నిరసన ఎపిసోడ్ జరిగిన కొన్ని గంటల తర్వాత.. అది కూడా రాత్రివేళ, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలతో, ఎమ్మెల్సీ మాధవ్ బృందం.. పవన్ ఉన్న హోటల్‌కు వెళ్లి, పరామర్శించింది. ఆ తర్వాత విజయవాడలో పవన్‌ను, సోము వీర్రాజు బృందం వెళ్లి సంఘీభావం ప్రకటించింది. అక్కడ యధావిధిగా.. బీజేపీ-జనసేన ఇకపై కలసి కదం తొక్కుతామని వీర్రాజు ప్రకటించారు. ఆవిధంగా ప్రకటించడం అప్పటికి డజన్లసార్లు కావడం విశేషం.

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హోటల్ వరకూ, పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. జనసేన కార్యకర్తలకు- మంత్రి రోజాకు వాగ్వాదం జరిగింది. మంత్రుల కార్లపై జనసైనికులు రాళ్లేశారు. జనసేన కార్యకర్తలకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. కొందరిని అరెస్టుimage-2 చేశారు. దానిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వరస వెంట వరస ట్వీట్లు చేశారు. ఇవన్నీ మీడియాలో నిరంతరం ప్రసారమవుతూనే ఉన్నాయి. అయినా విశాఖ బీజేపీ నాయకులు గానీ- క్యాడర్ గానీ, పవన్ బస చేసిన హోటల్ వద్దకు వె ళ్లకపోవడం ఆశ్చర్యం. ఆ సమయంలో తమకు బాసటగా నిలవకపోవడంపై, పవన్ కల్యాణ్ అభిమానులు బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

కష్టం వచ్చినప్పుడు దన్నుగా నిలవకుండా.. అంతా అయిపోయిన వచ్చి ప్రకటించే బీజేపీ నేతల ఉత్తుత్తి సంఘీభావంతో, వచ్చే లాభమేమిటని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమకు టీడీపీ సహకరించిందే తప్ప, బీజేపీ క్యాడర్ ఎక్కడా సహకరించలేదని వారు గుర్తు చేస్తున్నారు. తమపై దాడులు జరిగినప్పుడే బీజేపీ నేతలు సంఘీభావం పేరుతో వస్తున్నారు తప్ప, పవన్‌పై మంత్రులు చేసే విమర్శల సమయంలో స్పందించడం లేద న్న అసంతృప్తితో జనసైనికులు రగిలిపోతున్నారు.

Leave a Reply