Suryaa.co.in

Crime News Telangana

హెచ్‌ఎండీఏలో బాలకృష్ణుడి అవినీతి లీలలు

– ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎండిఏ పెద్ద గద్ద
– బీఆర్‌ఎస్ సర్కారులో బాలకృష్ణదే హవా
– పాలకులతో చెట్టపట్టాల్
– వందకోట్ల సంపాదన ఎలా సాధ్యం?
– ఒక అధికారి సంపాదనే వందకోట్లా?
– మరి పెద్ద గద్దల సంపాదన ఎంతో?

ఆయన హెచ్‌ఎండిఏలో ఒక కీలక అధికారి. బీఆర్‌ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట శిలాశాసనం. తాజాగా ఆయన ఇంటిపై తెలంగాణ ఏసీబీ జరిపిన దాడిలో, వందకోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడింది. సారు ఇంట్లో డబ్బులు లెక్కించే మిషన్లు నాలుగు దొరికాయట. ఒక అధికారే వందకోట్లు సంపాదించారంటే.. ఆయనపై అధికారులు… నాడు సర్కారులో చక్రం తిప్పిన సచివులు ఇంకెంత సంపాదించారో, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇదీ బాలకృష్ణుడి అవినీతి లీలలు

టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాస్తులు రూ. 100 కోట్లు పై మాటే..!
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శి గానూ కొనసాగుతున్నారు.

బుధవారం తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో 14 బృందాలు.. బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశాయి. ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.

గుర్తించిన ఆస్తులు ఇవే..
రూ. 40 లక్షల నగదు, రెండు కిలోల బంగారం..
స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు..
60 ఖరీదైన చేతి గడియారాలు..
14 మొబైల్ ఫోన్లు,
10 ల్యాప్ టాప్స్ గుర్తించారు.
మొత్తం రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు బయట పడ్డాయి.

బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలను సైతం అధికారులు గుర్తించారు. నాలుగు బ్యాంకు లాకర్లు సైతం గుర్తించినట్టు సమాచారం. తనిఖీలు గురువారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ లో ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులన్నీ కూడ బెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలతో రూ. కోట్లు కూడ బెట్టినట్టు వచ్చిన సమాచారం ఆధారంగా ఏక కాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది.

LEAVE A RESPONSE