తమ్మినేని.. ఏమిటి‘లా’?

– ‘న్యాయ’సంకటంలో ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
– ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ‘లా అడ్మిషన్‌’పై కొత్త వివాదం
– అర్హత లేకుండానే తమ్మినేని సీతారాం లా సీటు ఎలా సాధించారు?
– డిగ్రీ ఆపేసిన వ్యక్తికి మూడేళ్ల లా అడ్మిషన్‌ వచ్చింది?
– ఎన్నికల అఫిడవిట్‌లో డిగ్రీ ఆపేశానన్న తమ్మినేని
– మరి మూడేళ్ల లా అడ్మిషన్‌ ఎలా వచ్చిందని గళమెత్తిన టీడీపీ
– ఉస్మానియా వీసీ సమాధానం చెప్పాల్సిందేనన్న తెలంగాణ టీడీపీ నేత న ర్శిరెడ్డి
-స్పీకర్‌ అయితే తమ్మినేనికి ఎలా మినహాయింపు ఇచ్చారు?
– ఈ తరహా ఎంకెంతమంది ఉన్నారో తేలాల్సిందే
– మహాత్మాగాంధీ లా కాలేజీలో తమ్మినేనికి ఏ నిబంధనల ప్రకారం లా అడ్మిషన్‌ ఇచ్చారు?
– అది ఇంటర్‌తో ఐదేళ్ల కోర్సు మాత్రమేనన్న స్పీకర్‌ ఆఫీసు సిబ్బంది
– మీడియాలో రచ్చవుతున్నా ఇప్పటికీ స్పందించని తమ్మినేని
– తనపై ఆరోపణలు ఖండించకపోవడంపై మరిన్ని అనుమానాలు
– ఖండించి, ఆధారాలు చూపెడితే మంచిదంటున్న వైసీపీ వర్గాలు
– అడకత్తెరలో ఉస్మానియా అధికారులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

నైతిక విలువలు, రాజకీయాల్లో అవినీతిపై తరచూ వాపోయే ఆముదాలవలస వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం .. ఇప్పుడు విచిత్రమైన ‘న్యాయ’సంకటంలో పడ్డారు. తాను స్పీకర్‌ కంటే ముందు వైసీపీ ఎమ్మెల్యేనని సగర్వంగా చెబుతుంటారు. స్పీకర్‌గా ఎన్నికయిన తర్వాత ఆయన పొందిన మూడేళ్ల లా అడ్మిషన్‌, ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల అఫిడవిట్‌తోపాటు.. అనేక టీవీ ఇంటర్వ్యూలలో , తాను డిగ్రీ మధ్యలోనే నిలిపివేశానని స్పష్టం చేసిన తమ్మినేని.. అసలు డిగ్రీ పూర్తి చేయకుండానే, మూడేళ్ల లా కోర్సు అడ్మిషన్‌ ఎలా సంపాదించారు? అసలు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు, ఏ నిబంధనల ప్రకారం తమ్మినేనికి మినహాయింపు ఇచ్చారు? ఇది రాజమార్గమా? దొడ్డిదోవనా? డిగ్రీ సర్టిఫికెట్లు తనిఖీ చేసే యంత్రాంగం కూడా ఉస్మానియా వర్శిటీలో లేదా? అన్న ప్రశ్నలు తమ్మినేని కేంద్రంగా.. ఆయనతోపాటు, ఉస్మానియా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ‘న్యాయ’పరమైన చిక్కుల్లో ఇరుక్కోవడం సంచలనం సృష్టిస్తోంది. స్పీకర్‌గా ఎన్నికయిన తర్వాత… లా డిగ్రీ చేయాలన్న కోరికతో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీ పరిథిలోని, మహాత్మాగాంధీ లా కాలేజీలో ఆయన అడ్మిషన్‌ తీసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. సహజంగా లా డిగ్రీని ఇంటర్‌ పూర్తయితే ఐదేళ్లు, డిగ్రీ పూర్తయితే మూడేళ్ల కోర్సుతో పూర్తి చేయవచ్చు. లేదా డిగ్రీతో సమానమైన అర్హత ఉంటే మూడేళ్లు లా డిగ్రీ చేయవచ్చు.

కానీ తమ్మినేని సీతారాం తాను డిగ్రీని మధ్యలోనే ఆపివేశానని, తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆయన అనేక టీ వీ చానెల్‌ ఇంటర్వ్యూలలో కూడా స్పష్టం చేశారు. స్పీకర్‌గా ఎన్నికయిన తర్వాత, 2019లో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో.. 2019-20అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి ఆయన, హాల్‌టికెట్‌ నెంబర్‌ 172419831298 పొందారన్న విషయాన్ని.. ఒకప్పటి విద్యార్ధి సంఘ రాష్ట్ర నేత, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్శిరెడ్డి బయటపెట్టడం సంచలనం సృష్టించింది.

డిగ్రీ డిస్‌ కంటిన్యూ చేసిన వారికి, మూడేళ్ల కోర్సుకు సంబంధించి హాల్‌టికెట్‌ ఎలా వచ్చిందని నర్శిరెడ్డి నిలదీశారు. తాను చెప్పిన హాల్‌టికెట్‌ నెంబరు తప్పని తమ్మినేని నిరూపించాలని, లేదా తన వద్ద ఉన్న హాల్‌టికెట్‌ నెంబరు వెల్లడించాలని నర్శిరెడ్డి సవాల్‌ చేశారు. దీనిపై తాను ఉస్మానియా రిజిస్ట్రార్‌, వీసీని కలిసి తమ్మినేని వ్యవహారం తేలుస్తానని స్పష్టం చేశారు. తమ్మినేని వ్యవహారం తేల్చేవరకూ విశ్రమించేది లేదన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉండి ఆయన చెప్పే నీతిచంద్రికకు, చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని నర్శిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. తమ్మినేని లా అడ్మిషన్‌ వివాదంపై ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన పీఆర్వో మాత్రం స్పందించి.. అది ఇంటర్‌ అర్హతతో ఐదేళ్లకు తీసుకున్న అడ్మిషన్‌ మాత్రమేనని వెల్లడించారు. అయితే తమ్మినేని సీతారాం అసలు పరీక్ష కూడా రాయలేదని చెప్పారు. ‘సార్‌కు అంత సమయం ఎందుకుంటుంది చెప్పండి. పాపం ఏదో లా చదువుకుందామని భావించినా, ఆయనకున్న బిజీ షెడ్యూల్‌ వల్ల ఎక్కడ సాధ్యమవుతుంది చెప్పండి? అయినా అది ఇంటర్‌ ప్రాతిపదికన తీసుకున్న అడ్మిషన్‌ మాత్రమే’నని ఆయన సిబ్బంది ఫోన్‌లో వివరించారు.

ఆ వాదన ప్రకారమే తమ్మినేని సీతారాం, ఒకవేళ ఇంటర్‌ అర్హతతో ఐదేళ్ల కోర్సు అడ్మిషన్‌ తీసుకుని ఉంటే.. అదే విషయాన్ని ఆధారాలతో ఇప్పటిదాకా, ఎందుకు మీడియాకు వెల్లడించలేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తన లా ఆడ్మిషన్‌ వ్యవహారంపై మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే, దానిని ఖండించకుండా మౌనంగా ఉండటం సహజంగా మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.

అయితే ఈ వివాదంపై వైసీపీ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. తమ్మినేని ఎలాంటి తప్పు చేయకపోతే, అందుకు తగిన ఆధారాలు మీడియాకు ఇచ్చి.. సాధ్యమైన త్వరగా ఈ వివాదం ముగించాలని స్పష్టం చేస్తున్నారు. తమ్మినేని పెదవి విప్పనంత కాలం… ఆయనపై వచ్చిన ఆరోపణ నిజమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, తన వద్ద ఉన్న ఆధారాలు మీడియాకు ఇస్తే, పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రావంటున్నారు.
ఇక ఈ వివాదంపై ఇటు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు సైతం తలపట్టుకుంటున్నారు. తమ్మినేని సీతారాంకు డిగ్రీ ఆధారిత మూడేళ్ల అడ్మిషన్‌ ఇచ్చారా? లేక ఇంటర్‌ ఆధారిత ఐదేళ్ల అడ్మిషన్‌ ఇచ్చారా? అన్న విషయంపై, ఉస్మానియా అధికారులు వివరణ ఇవ్వనంత వరకూ.. ఈ వివాదం యూనివర్శిటీకి మచ్చగా మిగిలిపోతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

నిజంగా ఇంటర్‌ ఆధారిత సర్టిఫికెట్‌తో ఐదేళ్ల కోర్సు చేరితే ఆ హాల్‌టికెట్‌ నెంబరు, అడిషన్‌ నెంబర్‌ను మీడియా ముందు ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ఐదేళ్ల కోర్సులోనే ఆయన చేరితే, మూడేళ్ల లా అడ్మిషన్‌ ఎలా ఇచ్చారన్నది నర్శిరెడ్డి సంధిస్తున్న ప్రశ్న. మరిన్ని వివరాలతో తాను త్వరలో మళ్లీ మీడియా ముందుకు వస్తానని నర్శిరెడ్డి మరో బాంబు పేల్చారు.

Leave a Reply