Suryaa.co.in

Andhra Pradesh

వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.?

మీ బాబాయి హత్యతో మాకు సంబంధంలేదని వెంకన్నపై ప్రమాణం చేస్తా..మీరూ చేస్తారా జగన్ రెడ్డి.?
• తోలు బొమ్మలాంటి వారిని వైసీపీని పార్లమెంట్ కు పంపితే రాష్ట్రానికి ప్రయోజనం లేదు.
• ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏమీ  చేయలేరు.
• 2024లో వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా తీరుస్తాం.  
• మద్యం ద్వారా రూ.10వేల కోట్లు జగన్ జేబులోకి.
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

‘‘14వ తేదీన జగన్ తిరుపతి వస్తున్నారంట.. మీ బాబాయిని మేముగానీ, మా కుటుంబ సభ్యులు చంపలేదని వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తా.. మీరు, మీ కుటుంబ సభ్యులు చంపలేదని ప్రమాణం చేస్తారా జగన్ రెడ్డి.?’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో భాగంగా బుధవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో  లోకేష్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఢిల్లీకి పంపిన 28 తోలు బొమ్మలను జగన్ రెడ్డి ఎలా తిప్పితే అలా తిరుగుతున్నాయ నిప్పులు చెరిగారు. మోడీ కనబడితే ఆ తోలు బొమ్మలు కాళ్ల మీద పడుతున్నాయని,  28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం ఉద్దరించారని ప్రశ్నించారు. దుగరాజు పట్నం, రామాయపట్నం, నెల్లూరు ఎయిర్ పోర్టులు ఏమయ్యాయని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఒక్క తోలు బొమ్మైనా రాష్ట్రం కోసం పోరాడిందా? పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ చెప్తుంటే ఏపీలోని ఒక తోలుబొమ్మ అక్కడ బీజేపీని గెలిపించాలని ప్రచారం చేస్తోంది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో మరో తోలుబొమ్మను గెలిపిస్తామా? టీడీపీకి ఉన్న నలుగురు ఎంపీలు సింహాల్లా పార్లమెంటులో గర్జిస్తున్నారు. మన ఇంటి మహాలక్ష్మీ పనబాక లక్ష్మీకి ప్రజల సమస్యలు బాగా తెలుసు. అందుకే నాలుగు సింహాలకు తోడుగా మరో సింహాన్ని పార్లమెంట్ కు పంపాలి. వైసీపీని చూస్తే జేసీబీ గుర్తొస్తోంది. జే.. అంటే జగన్ ట్యాక్స్, సీ.. అంటే కట్టింగ్, బీ అంటే బాదుడు. ఒకప్పుడు సిమెంట్ ధర రూ.250 ఉంటే రూ.370కు పెరిగింది. దానికి కారణం రూ.50లు జగన్ జేబులోకి వెళ్తున్నాయి. నాడు ట్రక్కు ఇసుక వెయ్యి రూపాయలుంటే ఇప్పుడు రూ.5 వేలకు పెంచారు. నాలుగు వేల రూపాయలు జగన్ జేబులోకి వెళ్తున్నాయి.
 రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెచ్చారనుకుంటే..మందు బ్రాండు తెచ్చారు. అక్కా, చెళ్లెళ్ల తాలిబొట్టు తెంచేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు జగన్ రెడ్డి దోచుకుంటున్నారు. వందల్లో వచ్చే విద్యుత్ ఛార్జీలు వేలల్లో వస్తోంది. ప్రతి యూనిట్ కు 50 పైసలు జగన్ జేబులోకి వెళ్తున్నాయి. కరెంట్ తీగ పట్టుకుంటే రావాల్సిన షాక్.. బిల్లు  పట్టుకుంటే వస్తోంది. పేదోడి కడుపునింపే అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు, రైతు భరోసా, కట్ చేశారు. ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని జగన్,ఆయన భార్య భారతి చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారు.
  రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ తీసి మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ఇమామ్, మౌజామ్ లకు ఇచ్చే గౌరవ వేతనం కట్ చేశారు. షాధీఖానాలకు ఇచ్చే నిధులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ను తీసేశారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాదుడు రెడ్డి ప్రభుత్వం అని పేరు పెట్టాలనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సన్ ఫ్లవర్ నూనె రూ.86 వుంటే  నేడు రూ.200, వేరు శనగ నూనె నాడు రూ.90 వుంటే ఇప్పుడు రూ.170 ఉంది. రేషన్ షాపులో ఉన్న కందికప్పు రూ.65లకు చేశాడు. పంచదార చంద్రబాబు రూ.20లకు చేస్తే జగన్ రెడ్డి రూ.35 చేశారు. రూ.114 ఉన్న చింత పండు రెండు వందలు దాటింది. ఐపీఎల్ స్కోర్ కంటే డీజీల్ మీటర్ ఎక్కువగా తిరుగుతోంది. గ్యాస్ ధరలు నచ్చినట్లు పెంచారు.
చేత్తో పది రూపాయలు ఇస్తే మరో చేతతో వంద లాక్కుంటున్నాడు. ఏటా డిఎస్సీ నిర్వహిస్తానని ఒక్క డిఎస్సీ అయినా వదిలారా? ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా.? ఫాక్సార్న్, సెల్ కాన్, హీరో మోటార్స్, డిక్సాన్, అపోలో టైర్లు, కియా కార్లు వంటి వివిధ పరిశ్రమలు చంద్రబాబు తెచ్చారు. కనీసం ఆ పరిశ్రమల్లో  యువతకు ఉద్యోగాలు ఇప్పించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. వాలంటీర్లకు రూ.5 వేల జీతంతో వాళ్ల కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వారికి వాలంటీర్ ఉద్యోగం వచ్చిందా? ఒక చెల్లి ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం తిరుగుతోంది. పాదయాత్ర చేసిన చెల్లిని హైదరాబాద్ లో వదిలేశారు. దిశ చట్టం లేదు.. స్టేషన్ మాత్రమే వుంది. ఆ చట్టమే లేదని పోలీసులు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు.
  దళితులంటే జగన్ రెడ్డికి గౌరవం లేదు. బల్లి దుర్గా ప్రసాద్ చనిపోతే కనీసం పరామర్శకు రాలేదు. ఆయన కులానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే ప్రత్యేక విమానంలో ఇంటికి వెళ్లి పరామర్శించారు. బద్వేలు ఎమ్మెల్యే చనిపోతే నవ్వుకుంటూ దండం పెడుతున్నారు. తిరుపతికి కర్నాటక సీఎం వస్తే జగన్, పెద్దిరెడ్డి కూర్చున్నారు.. కానీ దళిత మంత్రి నారాయణ స్వామిని వారి పక్కన కూర్చోనివ్వలేదు. విశాఖలో దళిత డాక్టర్ మాస్క్ అడిగితే పిచ్చోడిని చేశారు. వరప్రసాద్ అనే దళిత యువకుడు ఇసుక అక్రమంపై పోరాడితే గుండు కొట్టించారు. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే యువకున్ని కొట్టి చంపారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీ మహిళను దారుణంగా చంపితే న్యాయం చేయలేని వ్యక్తి ఈ సైకోరెడ్డి. సూళ్లూరుపేటలో రెండేళ్లుగా ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా? ఇసుక, శాండ్, మైన్ అక్రమాలు జరగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్ర ఇసుక కనబడుతోంది.
 నాడు మనం నీటి కోసం వేసిన పైపులు నేటికీ అలాగే ఉన్నాయి. కిరికిరి సంజీవయ్య తన కమీషన్ కోసం పనులు ముందుకు సాగనివ్వడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో రూ.190 కోట్లు కేటాయించి సీసీ రోడ్లు 90 శాతం పూర్తి చేశాం. 4 వేల పక్కా ఎన్టీఆర్ గృహాలు నిర్మించాం. అధికారులను ట్రాన్ఫర్ చేయడానికి కిరికిరి కిరికిరి సంజీవయ్య లంచాలు తీసుకుటున్నారు.కరోనాను అడ్డుపెట్టుకుని డబ్బులు దండుకున్నారు. పరిశ్రమదారుల దగ్గర డబ్బులు గుంజుకోవడం వల్లే వాళ్లు పక్క రాష్ట్రానికి వెళ్లారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బెదిరించి విత్ డ్రా చేయించారు. కానీ రాజేంద్ర అనే వ్యక్తి వీరోచితంగా పోరాడారు.
 పసుపు చొక్కా వేసుకున్న రాజేంద్రను కొట్టి చొక్కా విప్పించారు. 2024లో వచ్చేది మా ప్రభుత్వమే వడ్డీతో సహా తీరుస్తాం. పసుపు చొక్కా, పసుపు జెండా చూస్తే జగన్ రెడ్డికి ప్యాంట్ తడుస్తుంది. మీ తాత, మీ తండ్రి మా వెంట్రుక కూడా పీకలేకపోయారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏవరూ ఏమీ చేయలేరు. పెట్రోల్, డీజిల్, రేషన్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గాలంటే సైకిల్ కు ఓటేయాలి. దొంగ పత్రికి విలేకరి ఇక్కడ ఉన్నారా? 151 మంది ఎమ్మెల్యేలు, 70 శాతం పంచాయతీలు గెలిచామని, మున్సిపాలిటీలు గెలిచామని జగన్ రెడ్డి ఆకాశంలో ఉన్నారు. పెట్రోల్ పై జగన్ రెడ్డి రూ.28 పన్ను వేస్తున్నారు. ఈ ఉపఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రూ.28 ఉన్న పన్ను సగానికి తగ్గుతుంది. టీడీపీ చేస్తున్న ప్రచారానికి భయపడి తాడేపల్లి ప్యాలెస్ నుండి వస్తున్నాడు’’ అని విమర్శల వర్షం గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాయుడుపేటలో పసుపు చొక్కా వేసుకున్న అభ్యర్థి రాజేందర్  చొక్కా పోలీసులు విప్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజేందర్ వీరోచితంగా పోరాడారని అభినందించారు.

LEAVE A RESPONSE