పాపం పోలీస్..

-విశాఖ మిలాన్ బందోబస్తులో తిండి కోసం కుస్తీలు
-ఉత్తి అన్నంతోనే క డుపు నింపేసుకున్న ఖాకీలు
-దానికోసం కూడా ఖాకీల తోపులాట
-విశాఖలో పోలీసుల ‘ఆకలిరాజ్యం’
-వైరల్ అవుతున్న వీడియోలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏ పార్టీ కార్యక్రమానికయినా వాళ్లే కాపలా కాయాలి. సీఎం వచ్చినా.. పీఎం వచ్చినా వాళ్లే గతి. ఇక వీఐపీలు జిల్లాలో ఏ మూల కార్యక్రమాలు పెట్టుకున్నా, వాళ్లు వచ్చి వెళ్లేంతవరకూ ఖాకీలే కాపలా కాయాల్సిందే. జనసంచారం కనిపించని ప్రాంతాల్లో ఉండే కల్వర్ట దగ్గర, కాపాలా కాసే పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. వారికి భోజనం ఎప్పుడు వస్తుందో తెలియదు. మంచినీళ్లకూ దిక్కుండదు. అవి వచ్చేవరకూ కాపలా కాయాల్సిందే. పెద్దె పెద్ద నగరాల్లో జరిగే ఈవెంట్లకయితే పోలీసుల పాట్లు చెప్పాల్సిన పనిలేదు.

అలాంటి ఈవెంట్ ఒకటి విశాఖ మిలాన్ 2024 పేరుతో ఒకటి జరిగింది. దానికి పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తుకు వచ్చారు. మరి వారి తిండీ తిప్పలు చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద సార్లదే కదా? ఆ పెద్ద

సార్లు తమ కింద ఉండే చిన్నసార్లకు, దాని గురించి పురమాయిస్తారు. ఆ చిన్న సారు తమ కింద ఉండే బుడ్డసార్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. మరి వీటికి బిల్లులు గట్రా వంటి లెక్కా డొక్కలుంటాయి కదా అని అడక్కండి. అదంతా మామూలే.

ఇక కథలోకి వెళితే.. విశాఖ మిలాన్ 2024 బందోబస్తుకు వచ్చిన పోలీసులకు భోజన ఏర్పాట్లు చేశారు. హలో.. భోజన ఏర్పాట్లంటే చికెన్, మటన్, విశాఖ కాబట్టి ఫిష్ లాంటి నాన్ వెజ్, జలపుష్పాల

వంటి రుచికరమైన ఐటెమ్స్ ఉంటాయనుకుంటే తప్పులో.. సారీ పప్పులో కాలేసినట్లే! ఏదో మామూలు వంటకాలతో లాగించేశారట. ఎక్కువ తింటే పోలీసులు పనిచేయలేరని, ‘ఉన్నంతలో’ సర్దేశారట.

దానితో పాపం చివరివరసలో చకోరపక్షుల్లా వేచి ఉన్న పోలీసులు.. అడుగున ఉన్న అన్నం కోసం కొట్లాడుకున్నంత పనిచేశారు. ఇంకొందరికి కేవలం అన్నం తప్ప, మిగిలినవేవీ దొరకలేదట. దానితో ఉత్తి అన్నమే పంచభక్షపరమాన్నంగా ఫీలయి, ఆరోజుకు కడుపునింపేసుకున్నారట. తమ దుస్థితిపై ఒక పోలీసు చేసిన కామెంట్ వారి దుస్థితికి అద్దం పట్టింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. పాపం పోలీస్!

Leave a Reply