-ఈ దిక్కుమాలిన వైసీపీకి రాజీనామా చేస్తున్నా
-ఎంపీ పదవికీ రాజీనామా చేస్తా
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ప్రతినెల జిల్లాల వారీగా, ఇసుక రీచ్ ల వారీగా వందల కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లు చేసుకున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అనుమతులు లేకుండా ఇసుకను తెగ తవ్వేశారన్నది అక్షరాలా నిజం. తవ్విన క్వాంటిటీ సగటున వెయ్యి నుంచి రెండు వేల టన్నులకు పైగానే ఉంటుంది. తొవ్విన ఇసుకలో ప్రభుత్వ రాబడి ఎంత?, మిగిలినది ఆదాయం ఎవరు తినేశారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కరం .
తాడేపల్లి ప్యాలెస్ లోని వ్యక్తులు తినేశారా?, ముఖ్యమంత్రి సమీప బంధువులు తినేశారా? అని ప్రశ్నించారు. అక్రమంగా తవ్విన ఇసుక అంచనా 40 వేల కోట్ల రూపాయలు ఉంటుందని, ఇంత దారుణమైన వంచనకు రాష్ట్ర ప్రజలకు ఇసుకాసురుని నాయకత్వంలో జరిగిందనేది నగ్నసత్యం. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీని ఆశ్రయించి, న్యాయం కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తపై, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టి వేధించింది .
మిర్యాలగూడ నుంచి నాలుగు బ్రాందీ సీసాలను తెచ్చుకొని అమ్ముకుంటున్నట్లుగా అతనిపై అభియోగాన్ని మోపారు. సత్యాన్వేషణ కోసం పోరాడుతున్న అతనికి లక్షల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. అటువంటి వ్యక్తి, నాలుగు బ్రాందీ సీసాలను తెచ్చి అమ్ముకున్నారని తప్పుడు అభియోగం మోపడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో నేను కూడా న్యాయం కోసం పోరాడితే, ఈ ప్రభుత్వ పెద్దలు నన్ను చంపాలని చూశారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఎన్ జి టిలోని జి పి
కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా ఎన్జీటీలోని ప్రభుత్వ న్యాయవాది దొంతి రెడ్డి మాధవి, మాధురి వ్యవహరించారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించడం పెడ్ జ్యురీ అవుతుందని, పెడ్ జ్యురీ కి పాల్పడినందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో నాలుగు రకాల వాదనలను వినిపించారని, ఒకసారి ఇసుక తవ్వకాలకు అసలు యంత్రాలనే ఉపయోగించలేదని చెప్పారు. మరొకసారి అసలు ఇసుక తవ్వకాలని చేపట్టలేదని పేర్కొన్నారు. పర్యావరణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుక తవ్వకాలను చేపట్టారని ఎన్జీటీ స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
చెన్నై ఎన్జీటీ విభాగాన్ని మేనేజ్ చేయాలని ఏపీఎండీసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకట్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేశారన్నారు. పర్యావరణ శాఖలో నాకున్న సోర్సెస్ ప్రకారము ఆరా తీయగా, రాష్ట్రంలో దారుణమైన ఇసుక దోపిడీ జరిగిందని చెప్పారన్నారు. ఇసుక దోపిడి వల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు కుదేలైపోయారు. ఇల్లు కట్టుకున్న వారు ఎక్కువ ధరలు చెల్లించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవైపు ఇసుక దోపిడీకి పాల్పడుతూనే, మరొకవైపు పారదర్శకంగా ఇసుక అంటూ పత్రికకు వ్యాపార ప్రకటనలను ఇచ్చారని, పత్రికలకు ఇచ్చిన వ్యాపార ప్రకటనల్లోనూ దోపిడి జరిగిందన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సాక్షి దినపత్రిక తప్పుపడుతుందేమోనని అన్నారు. గత ఆరు నెలలుగా అసలు ఇసుక తవ్వకాలు చేపట్టడం లేదని, అయినా అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టామని ఎన్జిటి తప్పుడు తీర్పును ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందేమోనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, న్యాయస్థానం పర్యావరణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా కండ్లు మూసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో కేసు వేసి పోరాడిన వ్యక్తిని రఘురామ కృష్ణంరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఎటువంటి భయాలు లేకుండా పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు.
సూపర్ మెన్ తరహాలో శ్యాండ్ మెన్
హాలీవుడ్ లో సూపర్ మెన్, స్పైడర్ మెన్ తరహాలో రాష్ట్రంలో శ్యాండ్ మెన్ ఉన్నారని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. గత ఐదేళ్ల తన పాలనలో ఇసుక తవ్వకాలలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణం లో 50% వాటాలు శ్యాండ్ మెన్ కు వెళ్లకపోతే ఆయన ఊరుకోరనేది నా భావన అని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో నాగేందర్ అనే సామాజికవేత్త పిటిషన్ దాఖలు చేశారు. మ్యానువల్ గా ఒక్క మీటర్ తవ్వకాలు చేపట్టాల్సిన చోట భారీ యంత్రాల సహకారంతో, పెద్ద ఎత్తున తవ్వకాలను చేపడుతున్నారని ఆయన ఎన్జీటీ దృష్టికి తీసుకువచ్చారు. హిటాచి యంత్రం ద్వారా ఒకే సమయంలో 2.1 టన్నుల సింగల్ బ్లేడ్ తో తవ్వకాలను చేపడుతున్నట్లుగా వివరించారు.
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ 18 వేల కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చింది. ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎన్నో చోట్ల ఇదే తరహాలో అక్రమ తవ్వకాలను చేపడుతున్నట్లు పర్యావరణ శాఖ అధికారుల నివేదిక ద్వారా భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఇసుక అక్రమ తవ్వకాలపై వార్తలు రాస్తున్నప్పటికీ, సాక్షి దినపత్రిక ద్వారా తమ అక్రమాలను కవర్ చేసుకునే ప్రయత్నాన్ని చేశారు.
అయితే, పర్యావరణ శాఖ అధికారుల నివేదిక ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీని మేనేజ్ చేయాలని ఏపీఎండిసి చైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకట్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేశారు. అసలు మైనింగ్ తో సంబంధం లేని వెంకట్ రెడ్డికి ఏపీఎండిసి చైర్మన్ తో పాటు, మైనింగ్ శాఖ డైరెక్టర్ గా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను కట్టబెట్టారు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన అధికారి అన్న ఏకైక కారణంతో ఎటువంటి లుచ్చా పనులైన చేయించవచ్చునని ధీమాతోనే ఆయనకు కీలకమైన రెండు శాఖల బాధ్యతలను అప్పగించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎన్ని ఇసుక రీచ్ లలో ఎంత లోతుగా తవ్వకాలను చేపట్టారన్నదానిపై గూగుల్ డేటాతో సహా పర్యావరణ శాఖ అధికారులు నివేదిక అందజేశారు. ఒక్క మీటర్ వరకు తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు అడుగుల వరకు ఇసుక తవ్వకాలను చేపట్టినట్లుగా తమ నివేదికలో పేర్కొన్నారు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై పెనాల్టీ వేసినప్పటికీ యధావిధిగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని పర్యావరణ శాఖ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించారు. ఇదే విషయమై కలెక్టర్లను రిపోర్టు అడిగితే, 26 జిల్లాలలో 21 జిల్లాల కలెక్టర్లు ఒకే తరహాలో నివేదిక ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గతంలో ఆరవ తరగతి చదివిన ఒక మంత్రికి నాపై కేసులు పెట్టమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పుడు, ఒకే తరహాలో ఫిర్యాదులను అన్ని పోలీస్ స్టేషన్లలో ఇచ్చినట్లుగానే, అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా నివేదిక అందజేయడం అనుమానాలకు తావునిస్తోంది. ఈనెల 21వ తేదీన ఎన్జీటీ ఇచ్చిన తీర్పు ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. ఎన్జీటీ వెబ్సైట్లో కలెక్టర్ల లేఖలను పొందుపరచలేదు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ఎలాగో పెట్టరు. పిటిషన్ దారుడు కి ఖచ్చితంగా లేఖలను అందజేయవలసి ఉంటుంది. అతన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. కలెక్టర్లు ఒకే తరహా నివేదికను ఇవ్వడానికి
తాడేపల్లి ప్యాలెస్ నుంచి డిక్టేషన్ వస్తే యధావిధిగా సమర్పించారా?, లేకపోతే జిల్లా కలెక్టర్ల నుంచి లెటర్ హెడ్ తీసుకుని అన్నీ ఒకే రకంగా ఉండేలా తాడేపల్లి ప్యాలెస్ నుంచే పంపించారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
జిల్లా కలెక్టర్లు అందజేసిన నివేదికలన్నీ ఒకే రకంగా ఉంటే, కలెక్టర్లందరినీ బర్తరఫ్ చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఒక కలెక్టర్ నేను ఇచ్చిన రిపోర్టులో యంత్రాలను ఉపయోగించారని రాశాను. అయితే తవ్వకాలు జరగడమే లేదన్నట్లుగా రాసినట్లుగా నివేదిక ఉండడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇదొక పెద్ద స్కాం, మా సంతకాలను ఫోర్జరీ చేశారా?, ప్రభుత్వమే మా లేఖలను మార్చిందా?? అన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారట. ఎన్జీటీలో కలెక్టర్లు ఫైల్ చేసింది చూస్తే మనకు అర్థం అవుతుంది. అందరూ కలెక్టర్లు ఒకే రకంగా ఒకే లైన్లో ఇచ్చారంటే ఇదొక బీభత్సమైన స్కాం అని అర్థమవుతోంది.
తక్షణమే వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేసి జైల్లో నిర్బంధించాలి. అర్హత అన్నది లేకుండానే పేరు చివరన ఉన్న రెండు అక్షరాలతో కీలకమైన పోస్టింగులను వెంకట్ రెడ్డి దక్కించుకున్నారు. వెంకట్ రెడ్డి శిక్ష అర్హుడు అయినా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఆ పదవుల్లో నుంచి తప్పించరు . అందుకే ఆయన్ని తక్షణమే పదవిలో నుంచి తప్పించి, విచారణ జరిపి శిక్షించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ధవలేశ్వరం ప్రాంతంలోనూ యంత్రాల సహాయంతో ఇసుక తవ్వకాలను చేపట్టినట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటకు రావలసిన అవసరం ఉంది. ఇసుక తవ్వకాలు చేపట్టే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పర్యావరణ శాఖ అధికారులు ఆదేశించారు. డిజిటల్ వే బిల్ ఇవ్వాలని సూచించగా, కేవలం మ్యానువల్ బిల్లులను మాత్రమే ఇస్తున్నారు. ఇసుక రీచ్ లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
ఇసుక అక్రమ తవ్వకాలలో ముఖ్యమంత్రి సమీప బంధువులకు చెందిన జి సి, కేసి అనే శ్యాండ్ కంపెనీ తోపాటు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరొక కంపెనీని ప్రవేశపెట్టినట్లు తెలిసింది. కోర్టు అడిగితే ఇసుక తవ్వకాలను చేపట్టడం లేదని చెబుతూనే, డమ్మీగా జేపీ కంపెనీని పెట్టారు. కొన్ని జిల్లాలలో ఇసుక తవ్వకాలను చేపట్టిన వారితో నేరుగా నేను మాట్లాడాను. గత రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ జిల్లాల వారీగా, ఇసుక రీచ్ లవారిగా వేలం వేసి, అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తోంది . ఒక్కొక్క జిల్లాకు 23 నుంచి 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో దండుకున్నారు. ఇసుక తవ్వకాలలో అడ్వాన్సులు ఇచ్చిన వారికి ఒకవేళ నష్టం వచ్చిన తమకు సంబంధం లేదని పేర్కొంటున్నారు.
లాభం వస్తే మాత్రం అందులో వాటాలను తీసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలకు ముందు డిపాజిట్ డబ్బులు ముట్ట చెప్పిన తర్వాత పది రోజుల వ్యవధిలో మళ్లీ డబ్బులను జమ చేసే విధంగా వ్యవస్థను నడుపుతున్నారు. రాజమండ్రి ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలకు కోసం డబ్బులు డిపాజిట్ చేసిన ఒక వ్యక్తికి నష్టం వచ్చినప్పటికీ, ఇంకా డబ్బులు కట్టాలంటూ వేధించడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉందట… అందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవాలట
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నదని ఒక పోలీసు అధికారి పేర్కొంటూ, ఆయన రక్షణ నిమిత్తం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ముఖ్యమంత్రికి ఉన్న ప్రాణహానికి, రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడానికి అసలు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రాణహాని ఉందని ఇకపై ముఖ్యమంత్రి నేలపై నడవరా?, కేవలం గాలిలోనే తిరుగుతారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఇప్పటివరకు ఆయన గాలిలోనే తిరుగుతున్నారు… కదా అంటూ అపహాస్యం చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ సొమ్ము ఖర్చు చేసి రెండు కాకపోతే మూడు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవచ్చునని సూచించారు. ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఒక హెలికాప్టర్ విశాఖపట్నంలో, మరొక హెలికాప్టర్ విజయవాడలో అందుబాటులో ఉంచాలని సదరు పోలీసు అధికారి సూచించారు. రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెప్పినా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయలేదు కానీ మూడు హెలికాప్టర్లను తెచ్చుకోవచ్చు నంటూ ఎద్దేవా చేశారు. ఒక్కొక్క హెలికాప్టర్ కు కోటి 91 లక్షల రూపాయల నెలసరి అద్దెకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసం అద్దెకు తీసుకోవాలని సూచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక పైలట్ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు 30 నుంచి 40 వరకు అదనంగా ఉంటాయంటున్నారు .ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉందన్న సాకుతో ఈ రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారం కోసం , హెలికాప్టర్ల అద్దె తీసుకొని ఆ అద్దె భారాన్ని రాష్ట్ర ప్రజల పైకి నెట్టివేయాలన్నా భావనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో డబ్బులు కూడా తరలించవచ్చు అనేది వారి ఉద్దేశమై ఉండి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అనుచరులు కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా అనుమతులను పొందారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి జీతాన్ని తీసుకుంటూ, ప్రజాధనాన్ని స్వీకరించనని చెప్పే జగన్మోహన్ రెడ్డి, తన ఇంటి రిపేర్ల కోసం 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చూశాం. జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని భావిస్తే, ఇంట్లో కూర్చోవాలని, అంతేకానీ ప్రజల సొమ్ము ఖర్చు చేసి, హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని దాని ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకోవడం సరికాదు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ సొమ్మును ఖర్చు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. వైకాపాకు ఐదు నుంచి 600 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో సమకూరాయని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉన్నదని హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడం సరికాదంటూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కు లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. హెలికాప్టర్లలో డబ్బుని తరలించే అవకాశం ఉందని అందుకే హెలికాప్టర్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయాలలో పోలీసులతో తనిఖీలను చేయించాలని కోరానన్నారు . ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖ పై అధికారులు తక్షణమే స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చర్చి ఫాదర్ లకు కుక్కర్లను పంపిణీ చేసి, మత ప్రచారాన్ని నిర్వహించిన పెనమలూరు వైకాపా కోఆర్డినేటర్, మంత్రి జోగి రమేష్ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగానే తక్షణమే స్పందించారని గుర్తు చేశారు. ఈ విషయంపై కూడా అదేవిధంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు అయితే జీతం ఎందుకు ఇస్తున్నారు?
వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు అయితే వారికి జీతం ఎందుకు ఇస్తున్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండవని, వాలంటీర్లు కేవలం స్వచ్ఛంద సేవకులను మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాలంటీర్లకు ఒకవైపు వేతనం ఇస్తూ, మరొకవైపు సేవారత్న, ఆ రత్న, ఈ రత్న అవార్డుల పేరిట 375 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు వారిని ఎన్నికల సమయంలో ఏజెంట్లు గా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఒకవైపు ఎన్నికల కమిషన్ వాలంటీర్లను, ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసినప్పటికీ, మరొకవైపు అధికార పార్టీ నాయకులు ఎన్నికల ఏజెంట్లుగా వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్ల ఫోటోలను, పోలీస్ స్టేషన్లో జేబు దొంగల ఫోటోలను పెట్టినట్లుగానే పెట్టి, వాలంటీర్ అనే వ్యక్తి ఏజెంట్ గా కూర్చుంటే ఎత్తి బయట పడేయడం జరుగుతుందని హెచ్చరించారు. వాలంటీర్లను ఏజెంట్లు గా ఉపయోగించుకోవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చునని భావిస్తున్నారన్నారు. ఒక సీనియర్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఈ విధంగా అధర్మ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
28న కూటమి బహిరంగ సభను విజయవంతం చేయాలి
నరసాపురం నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు తెదేపా, బిజెపి కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 28వ తేదీ నాటికి కూటమిలో బిజెపి కూడా చేరే అవకాశం పై స్పష్టత వస్తుందని ఆయన, బిజెపి కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతిపక్ష కూటమి నిర్వహిస్తున్న సభలో పాలక పక్షంలో ప్రతిపక్షంగా ఉన్న నేను కూడా పాల్గొంటాను . ఇవాళో, రేపో ఈ దిక్కుమాలిన పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తాను.
ఆ తర్వాత ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తాను. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా ఏ పార్టీ కోరుకుంటే, ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తాను. రెండేళ్ల క్రితమే నాకున్న ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మేషన్ గా మార్చుకొని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు