ఈ శకుని..నటనే వేరని..!

శకుని ఉన్న చాలు
శని ఏల అని కదా…
ఔను..నిజమే..
నేను అంత ఘనుడ
కాని పనులనైన
కాజేసుకొని కాని మానిపోవలేని మాయలాడి..!

క్రౌర్యమే కనబడని
కామెడీ శకుని..
మాయాబజార్లో
నవ్వుల సరుకు…
దుష్టచతుష్టయంలో
భలే చురుకు..
ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా..
అంతటి బలరామునే
బోల్తా కొట్టించిన ఘనుడు..
సత్యపీఠం ఎక్కి నిజం కక్కేసిన గాంధారి తమ్ముడు
లక్ష శనిగ్రహాల పెట్టు..
దెబ్బ తీసింది శశిరేఖ కనికట్టు
ఎస్వీఆర్..సావిత్రి..
ఎన్టీఆర్..ఏయెన్నార్..
ఈ నలుగురితో పాటు
ఈ సీఎస్సార్ కలిస్తేనే
మాయాబజార్ అంత హిట్టు!

హే..రాజన్..శృంగారవీరన్
అంటూ కొత్త పిలుపుతో
రాజనాలను మత్తెక్కించిన
బాదరాయ ప్రెగ్గడ..
అదేగా మన తెలివి అంటూ
త్రిశోక రాజును
మాయలో పెట్టి..
మరలో అర..అరలో మర
కావున..పైలోకానికే ప్రయాణం కట్టించిన
కొత్త మంత్రి..
జగదేకవీరుని కథ
హిట్టు మంత్రాన్ని
మీటిన తంత్రి…
మీసం..మొలిచినట్టుంది..
అన్న కుతంత్రి..!

అప్పు చేసి పప్పుకూడు
తింటూ ఆ అప్పుకే
కొత్త సూత్రం
చెప్పిన జమిందార్…
ఆ సినిమా హిట్టుకు
తానూ జమేదార్..!

పాతాళభైరవిలోనూ
తానున్నాడు…
కన్యాశుల్కంలో
ఉల్కలా మెరిశాడు..
జయం మనదేలేలో మతిమరపు రాజు..
కన్యాదానం పెళ్లిళ్ల పేరయ్య..
ఆహా..ఆంజనేయులుకు
ఎంత పేరయ్యా..
జడలో పామును
చూసిన ఆడవేషంలో
ఏమి ఫేసయ్యా..
విభిన్న పాత్రల పోషణలో
ఎంత ఫేమసయ్యా..!

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply