Home » సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి

సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి

– సినిమాల్లో హింస, అశ్లీలత లకు చోటు ఉండకూడదు
-దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన
– మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్ద
– భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం
– 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి
– రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: సామాజిక సమరసతను, నైతికతను, ప్రజల్లో బాధ్యతను పెంపొందించే విధంగా సినిమాలుండాల్సిన అవసరం ఉందని… హింస, అశ్లీలతల వంటివి చూపించడాన్ని తగ్గించాలని సినిమా దర్శక నిర్మాతలకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.
సోమవారం, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి… ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ కు అత్యుత్తమ సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు కూడా ఆయన అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ… సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే ఈ ప్రభావాన్ని సానుకూలమైనదిగా మార్చేందుకు ప్రయత్నించాలన్న ఆయన, సినిమాల ద్వారా సానుకూల, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చన్నారు.
సినిమాలు సమాజంలో బలమైన అభిప్రాయాన్ని ఏర్పాటుచేయడంలో కీలకంగా ఉంటాయనే విషయాన్ని గత అనుభవాలు తెలియజేస్తాయన్న ఉపరాష్ట్రపతి, ఈ నేపథ్యంలో హింస, అశ్లీలత, సామాజిక రుగ్మతలను ప్రోత్సహించే దృశ్యాలను చూపించకపోవడమే ఉత్తమమని సూచించారు. వైభవోపేతమైన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకూడదన్న ఆయన, భారతీయతను ప్రతిబింబించేలా మన సినిమాలుండాలన్నారు. భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో మన సినిమాలు కీలకమైన పాత్రను పోషించాయని తెలిపారు. విదేశాల్లో భారతీయ ‘సంస్కృతికి వారథులు’గా సినిమాలు పనిచేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
జపాన్, ఈజిప్ట్, చైనా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియాతోపాటు వివిధ దేశాల్లో భారతీయ సినిమాలకు ఎంతో ఆదరణ ఉందన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లో ఉంటున్న భారతీయులతోపాటు మిగిలిన వారికి కూడా మన సినిమాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన విలువలు, మన సంప్రదాయాలను సినిమా వేదిక ద్వారా విశ్వవ్యాప్తం చేసేందుకు మరింత కృషి జరగాలని సినిమారంగానికి ఆయన సూచించారు. వేర్వేరు భారతీయ భాషల్లో సినిమాలు రావడం చాలా సంతోషకరమని, అయితే సినిమాకంటూ ప్రత్యేకమైన భాష ఉంటుందన్న ఉపరాష్ట్రపతి.. అది సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని తెలిపారు.
వివిధ భాషల్లో అత్యుత్తమ సినిమాలు తీసుకొస్తున్న వారందరికీ అవార్డులు అందజేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమేనని, మరింతమంది ఔత్సాహిక యువదర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని ప్రోత్సహించాలని పరిశ్రమ పెద్దలకు సూచించారు.
ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ నటుడు రజినీకాంత్ కు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి, భారతీయ సినిమా అభిమానుల్లో… ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల హృదయాల్లో రజినీకాంత్ కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రజినికాంత్ నటించిన పలు చిత్రాల పేర్లను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుందన్నారు.
ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్ పాయ్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్ తో పాటు వివిధ భారతీయ చిత్రాల్లోని చక్కని చిత్రాల నిర్మాణంలో పనిచేసిన వారందరికీ ఉపరాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. మంచి చిత్రాలను ఎంపికచేసిన న్యాయనిర్ణేతలను కూడా ఆయన అభినందించారు. సినీ నిర్మాణానికి అత్యంత అనుకూల రాష్ట్రంగా సిక్కింకు ఉపరాష్ట్రపతి అవార్డును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి ఎస్ మురుగన్, ఈ శాఖ కార్యదర్శి అపూర్వ్ చంద్రతోపాటు న్యాయనిర్ణేతలు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

Leave a Reply