కమలంలో ‘మిధున’ం?

– రాజంపేట సీటు కోరాలని బీజేపీ కీలకనేతపై ఒత్తిడి?
– రాజంపేట టీడీపీకి దక్కకూడదన్న వ్యూహం
– హిందూపురంలో పార్టీ ఓడిపోతుందని బీజేపీ కీలక నేత నివేదిక?
– హిందూపురం బదులు రాజంపేట తీసుకోవాలని లాబీయింగ్
– వెంకటరెడ్డి నిధుల రాయబారం?
– రాజంపేటలో సులభంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహం?
– బెజవాడలో సుజనాకు చెక్ పెట్టేందుకు పీవీపీని తెచ్చే యత్నం
– బీజేపీ కీలకనేత ఎన్నికల ఖర్చు భరించే ఒప్పందం?
– నర్సాపురంలో రఘురామరాజుకు చెక్ పెట్టే ఎత్తుగడ?
– కృష్ణంరాజు మేనల్లుడిని తెరపైకి తెచ్చిన బీజేపీ కీలనేత
– ప్రభాస్ ప్రచారానికి వస్తారంటూ ఢిల్లీని నమ్మించే వ్యూహం
– అసలు ఇండియాలో అవుట్‌డోర్ షూటింగులకే వెళ్లని ప్రభాస్
– విదేశాల్లోనే ప్రభాస్ అవుట్‌డోర్ షూటింగులు
– ప్రభాస్ ప్రచారానికి రారని ఆయన సన్నిహితుల స్పష్టీకరణ
– సుజనా, సత్యకుమార్, రఘురామకృష్యంరాజును ఓడించేందుకు బీజేపీ కీలక నేత ముందస్తు వ్యూహం
– ఓడిపోయే సీట్లు కోరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో చర్చ
– కేంద్రమంత్రి పదవి కోసం ఇప్పటినుంచే అడ్డదారులు
– కూటమి సీట్లపై వైసీపీ కోవర్టు ఆపరేషన్?
– టీడీపీ-బీజేపీ-జనసేన వర్గాల్లో హాట్ టాపిక్
– అప్రమత్తంగా ఉండాలని శ్రేణుల హెచ్చరిక
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాట-ముచ్చట్లు మినహా ఇంకా టీడీపీ-బీజేపీ కూటమి అధికారికంగా ఖరారు కాలేదు. సీట్లు ఎన్నో తేలలేదు. సంఖ్య తేలితే నియోజకవర్గాలేమిటో ఇంకా తెలియదు. అయినా ఇప్పటినుంచే మరొకరి సీట్లకు ఎసరు తెచ్చే మాయోపాయానికి బీజేపీలో తెరలేచింది. కూటమిపై వైసీపీ కోవర్టు ఆపరేషన్, తెరచాటు అంకం పనిచేయడం ప్రారంభించడం బీజేపీ వర్గాలను కలవరపరుస్తోంది. మోదీ మళ్లీ గెలవడం ఖాయం కావడంతో.. ఏపీ నుంచి కేంద్రమంత్రి పదవిపై కన్నేసిన ఓ కీలక నేత.. తనకు పోటీలో ఉన్న ప్రముఖులను పరోక్షంగా ఓడించే మంత్రాంగం బట్టబయలయి, ఏపీ బీజేపీ వర్గాల్లో అది కాస్తా చర్చలాంటి రచ్చలా మారింది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ బీజేపీపై అధికార వైసీపీ కోవర్టు ఆపరేషన్ మొదలయింది. రాజంపేటను చేజిక్కించుకునే పట్టుదలతో, వైసీపీ తిరుగులేని వ్యూహం రచించింది. ఆ మేరకు బీజేపీలో ఒక కీలకనేత ద్వారా, పొత్తులో రాజంపేట సీటును బీజేపీ తీసుకోవడం ద్వారా, తిరిగి అక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలన్న కోవర్టు ఆపరేషన్‌ బట్టబయలయి, అది కాస్తా ఢిల్లీకి తెలిసిపోయిందట. ఇందులో రాష్ట్ర బీజేపీ ప్రముఖుడి సహకారం ఉందన్న ప్రచారం గుప్పుమంటోంది. ఆ మేరకు సదరు బీజేపీ కీలకనేతకు వెంకటరెడ్డి అనే ఓ వ్యక్తి ద్వారా నిధుల రాయబారం నడిపినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

డబ్బులకు ఆశపడే ఆ కీలక నేత కుటుంబసభ్యుల ద్వారా, ఈ వ్యవహారం నడిపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బెజవాడలో పోటీకి సిద్ధపడుతున్న సుజనాచౌదరికి సీటు రాకుండా ఉండేందుకు వైసీపీ నేత పీవీపీని, సదరు ప్రముఖుడు తెరపైకి తెచ్చినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కీలకనేతకు ఎన్నికల ఖర్చు భరిస్తారన్న ఒప్పందం జరిగినట్లు కూడా, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం విశేషం. అదే సమయంలో ఏలూరు నుంచి కావూరి తనయుడిని కూడా తెరపైకి తీసుకువచ్చారంటున్నారు.

ఇక హిందూపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు సైతం అక్కడి నుంచి సీటు దక్కకుండా.. పొత్తులో హిందూపురం బదులు రాజంపేట కోరాలని, ‘వైసీపీ మిధునాలు’ బీజేపీ కీలక నేత ద్వారా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో వెంకటరెడ్డి అనే వ్యక్తి నిధుల రాయబారం జరిపినట్లు, పార్టీ నాయకత్వానికి ఇప్పటికే కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో కొద్దినెలల క్రితం మొదలైన ‘లిక్కర్ అనుబంధం, ’ అక్కరకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాజంపేటలో రెండున్నరలక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాబట్టి అక్కడ బీజేపీకి సీటు ఇస్తే, ఆ పార్టీ ఓడిపోయి వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న ముందస్తు వ్యూహంతో.. వైసీపీ వ్యూహకర్తలు ఈ కోవర్టు ఆపరేషన్ చేస్తున్నట్లు బీజేపీ ప్రముఖుడు ఒకరు విశ్లేషించారు. అయితే టీడీపీ మాత్రం రాజంపేటలో అయితే బీజేపీ గెలవదని, హిందూపురం అయితే గెలుస్తుందని బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజంపేటలో బలిజలకు సీటు ఇస్తేనే గెలుస్తారని, ఆమేరకు తమ పార్టీ అభ్యర్ధి సిద్ధంగా ఉన్నారని టీడీపీ స్పష్టం చేసిందట. కానీ రాజంపేటపై కన్నేసిన వైసీపీ.. ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చేలా, కోవర్టు ఆపరేషన్ చేయడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

కాగా అటు నర్సాపురంలో సిట్టింగ్ ఎంపి రఘురామకృష్ణంరాజుకు సీటు రాకుండా ఉండేందుకు, ఇదే వైసీపీ కోవర్టు ఆపరేషన్ సీరియస్‌గా పనిచేస్తోందట. పొత్తు కుదిరితే రఘురామకృష్ణంరాజు బీజేపీ అభ్యర్ధి అవుతారన్న భావన, కూటమిలో మొదటినుంచీ ఉంది. నిజానికి బీజేపీతో టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేసిన ముగ్గురిలో, రాజు ఒకరన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆయనకు సైతం సీటు రాకుండా, వైసీపీ కోవర్టు ఆపరేషన్ ప్రార ంభించిందన్న చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది.

ఆమేరకు దివంగత మాజీ ఎంపి, సినీ నటుడు కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్రవర్మను హటాత్తుగా తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర వర్మకు సీటు ఇస్తే సినీ హీరో ప్రభాస్ ప్రచారానికి వస్తారని, బీజేపీ నాయకత్వాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారట. ఆరకంగా నరేంద్రవర్మకు సీటు ఇప్పించేలా చేస్తే.. రఘురామకృష్ణంరాజుకు సీటు రాకుండా పోవడం- ఆ సీటు మళ్లీ వైసీపీ దక్కించుకోవడమనే ద్విముఖ వ్యూహంతో, వైసీపీ కోవర్టు ఆపరేషన్‌ను తీవ్రతరం చేసిందట.

అయితే నిజానికి ప్రభాస్ ఇన్‌డోర్ తప్ప, ఇండియాలో ఎక్కడా అవుట్‌డోర్ షూటింగులకు వెళ్లరు. విదేశాల్లో మాత్రమే ఆయన అవుట్‌డోర్ షూటింగులు పెట్టుకుంటారు. ఈ లాజిక్ తెలియని వైసీపీ కోవర్టులు.. ప్రభాస్ ప్రచారానికి వస్తారంటూ బీజేపీ కీలక నేత ద్వారా, నాయకత్వాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుండటం బీజేపీ వర్గాలను విస్మయపరుస్తోంది. కాగా ప్రభాస్ అసలు రాజకీయాల్లో తలదూర్చరని, ఎలాంటి ప్రచారానికి రారని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారం రావడం ఖాయం. ఆ క్రమంలో ఏపీ నుంచి కేంద్రమంత్రి పదవి కోసం పోటీ బాగా ఉంటుంది. పురందేశ్వరి, సుజనా చౌదరి, సత్యకుమార్, రఘరామకృష్ణంరాజు వంటి వారంతా హేమాహేమీలే. వీరంతా గెలిచేవారే. అయితే వీరికి అసలు వీరికి సీట్లు రాకుండా.. వారు కోరుతున్న స్థానాలు కాకుండా, ఓడిపోయే సీట్లు అడగటం ద్వారా, పోటీ తప్పించాలన్న బ్రహ్మాండమైన మాయోపాయం కనిపిస్తోందని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ఇక టీడీపీ-జనసేన కూటమిపైనా, వైసీపీ కోవర్టు ఆపరేషన్ ప్రారంభించిందన్న ప్రచారం కిందిస్థాయిలో వినిపిస్తోంది. టికెట్లు రాలేదన్న కారణంతో కొందరు, టీడీపీ అభివృద్ధి నినాదానికి ఆకర్షితులయ్యామన్న ముసుగులో ఇంకొందరిని టీడీపీ-జనసేన-బీజేపీకి పంపిస్తున్నారన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆరకంగా కూటమిలో ఎమ్మెల్యే-ఎంపీ సీట్లు తీసుకుని, ఎన్నికల తర్వాత వైసీపీలో చేరే మంత్రాంగంపై, టీడీపీ-జనసేన నాయకత్వాలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

కాగా ఇటీవల గుంటూరులో ప్రభుత్వ సలహాదారు, మరో సీనియర్ పోలీసు అధికారికి అత్యంత సన్నిహితుడైన ఒక ప్రముఖుడు.. హటాత్తుగా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జిల్లాలో చర్చనీయాంశమయింది. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సలహాదారుడికి సదరు నేత అత్యంత ఇష్టుడట. ఇటీవల సతె్తనపల్లిలో కన్నాపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న ఒక యువనేతను.. ఆ సలహాదారు వద్దకు ఈ నాయకుడే తీసుకువెళ్లారన్న ప్రచారం, జిల్లాపార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపించిన విషయం తెలిసిందే.

నేతల వ్యక్తిగత అవసరాలు తీర్చడంలో నిష్ణాతుడిగా పేరున్న సదరు నాయకుడిని, వైసీపీ నాయకత్వమే వ్యూహాత్మకంగా టీడీపీలో ప్రవేశపెట్టిందన్న ప్రచారం గుంటూరుపార్టీ నేతల్లో జరుగుతోంది. దానితో సదరు నేత గుంటూరు పార్టీ నేతలతో సంబంధం లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా పార్టీ ఆఫీసు ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పమయింది.

ఇక జనసేనలో కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులు కూడా చేరుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిపై వైసీపీ కోవర్టు ఆపరేషన్ ప్రారంభించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి, సరైన వారినే తీసుకోవాలన్న హెచ్చరిక పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

అగ్రనేతల బలహీనతలు-వ్యక్తిగత అవసరాలపై ఆరా తీసిన వైసీపీ వ్యూహబృందం, ఆమేరకు కూటమిలో తమ నేతలను పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన అగ్రనేతల వ్యక్తిగత బలహీనతను వాడుకుని, దానిని ఎన్నికల సమయంలో రచ్చ చేయాలన్నదే వైసీపీ అసలు వ్యూహమంటున్నారు. నిజం ‘జగన్నా’ధుడికెరుక?

2 thoughts on “కమలంలో ‘మిధున’ం?

Leave a Reply