ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన లోకేష్

– సత్యసాయి సంస్థల సేవలను వివరించిన ప్రతినిధులు
– సేవా కార్యక్రమాల విస్తరణకు సహకరిస్తామన్న యువనేత

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని యువనేత నారా లోకేష్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులోని భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ప్రతిష్టించిన సాయీశ్వర లింగం వద్ద శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో యువనేత పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ ప్రతినిధులు… నారా లోకేష్ కు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ ఆధ్వర్యాన కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు యువనేతకు వివరిస్తూ… ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200కు పైగా కేంద్రాల ద్వారా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఆయా దేశాలనుంచి ప్రతిఏటా లక్షలాది భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ బాబావారి అనుగ్రహం పొందుతున్నారు.

సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని 1500కు పైగా మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, బెంగళూరు వైట్‌ఫీల్డ్ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ ద్వారా లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ… సత్యసాయి బాబా వారి ద్వారా స్పూర్తి పొందిన తాము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ప్రజాప్రభుత్వంలో సత్యసాయి సంస్థలు అందించే సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply