వైఎస్ ‘వార్’సత్వమెవరికి?

– ఫ్యామిలీ ఫైట్‌లో విజేతలెవరు?
– వైఎస్ వారసుడు కొడుకు జగనా? కూతురు షర్మిలనా?
– గత ఎన్నికల్లో అన్న పార్టీ కోసం ప్రచారం చేసిన చెల్లి షర్మిల
– షర్మిలను అడ్డుకున్న బెజవాడ పోలీసులు
– అన్నది నియంత పాలనంటూ షర్మిల ఆగ్రహావేశం
– తాను రాజన్నబిడ్డనంటూ పదే పదే షర్మిల ప్రస్తావన
– షర్మిల వైపే తల్లి విజయమ్మ
– షర్మిలాశాస్త్రి అంటూ వైసీపీ సోషల్‌మీడియా ప్రచారం
– ఏమిటీ పైత్యమని రఘురామరాజు ఫైర్
– అప్పట్లో రాహుల్ ప్రధాని కావాలన్న వైఎస్
– ఇప్పుడు ఆ మాట గుర్తుచేస్తున్న షర్మిల
– జగన్‌పై షర్మిల క్రైస్తవ అస్త్రం
– మణిపూర్ ఘటన మౌనంతో జగన్‌కు ఇరకాటం
– వైఎస్ వారసురాలు షర్మిలనంటూ బెజవాడ ర్యాలీలో నినాదాలు
– ఆస్తుల పంచాయితీ నుంచి పార్టీ పంచాయితీగా మారిన ఫ్యామిలీ ఫైట్
( మార్తి సుబ్రహ్మణ్యం)

మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసత్వం కోసం.. ‘ఎదుగింటి సందింటి కుటుంబం’లో యుద్ధం మొదలయింది. అన్న ఒక వైపు. చెల్లి మరోవైపు. అమ్మ సహజంగానే కూతురి దిక్కు! చెల్లి కొద్దికాలం క్రితం ప్రత్యర్ధులపై అన్న విడిచిన బాణం. ఇప్పుడు ఆ బాణం దిశ మార్చుకుని, రివర్సయి తాడేపల్లి దిశగా శరవేగంగా పయనిస్తున్న వైనం.

ఆ సందర్భంలో పేలుతున్న మాటలు, తాడేపల్లికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. మనశ్శాంతిని దూరం చేస్తున్నారు. చివరాఖరకు ఆ ముద్దుల చెల్లి, అన్నయ్యను పట్టుకుని.. ‘నువ్వు నియంత’ అనేంతగా, ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది. అంటే ఆస్తి పంచాయితీగా ఆరంభమైన కొట్లాట, పార్టీల పంచాయితీగా మారిందన్నమాట. ఇప్పుడు వారిద్దరి లక్ష్యం ఒక్కటే. వైఎస్ వారసత్వం! అందుకే చెల్లి తాడేపల్లి పెద్దమనిషితో తాడోపేడో అంటోంది. ఇదీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్- ఆయన ముద్దుల చెల్లి షర్మిల మధ్య జరుగుతున్న ‘వారసత్వ వార్’.

‘‘ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది.. ప్రాంతీయ పార్టీలొస్తే నియంతలే గద్దెనెక్కుతారు.. హోదా పోరాటం మరిచి వైసీపీ ప్రభుత్వం బీజేపీకి లొంగిపోయింది.. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడి జరిగితే జగన్ స్పందించలేదు. ఏంటి సార్ భయపడుతున్నారా?.. ఈ రాజన్నబిడ్డ ఎవరికీ భయపడదు.. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియానే..కిలో మీటరు రోడ్డేయలేదు.. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది.. అప్పుల రాష్ట్రంగా మార్చారు…తెలంగాణలో ఒక నియంతను గద్దె దించా.. ఇప్పుడిక నాపుట్టినిల్లు ఏపీలో నియంత రాజ్యం సంగతి చూస్తా’’.

ఇవన్నీ ‘సమరసింహారెడ్డీ.. చూసుకుందామా నా పెతాపమూ.. నీ పెతాపమూ’.. టైమ్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే… అంటూ, తొడగొట్టి విసిరిన సినిమా డైలాగులు. అచ్చంగా అలాంటి డైలాగులనే ఇప్పుడు, అన్న జగన్‌పై.. చెల్లి షర్మిల సంధిస్తోంది. అదీ విశేషం.

రాజకీయాల్లో చాలా కుటుంబాలు చీలిపోయాయి. ఒకరు ఒక పార్టీ. మరొకరు మరో పార్టీ. సోనియా తోడికోడలు బీజేపీలో చేరితే, సోనియా కాంగ్రెస్‌లో ఉన్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ పెడితే ఆయన అన్న కూతురు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. చివరికి ఎన్టీఆర్ కుటుంబం కూడా రెండు పార్టీల్లో కొనసాగుతోంది. కానీ వైఎస్ రాజవేఖర్‌రెడ్డి కుటుంబం నిట్టనిలువునా చీలిపోతుందని, ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. అన్న జగన్-చెల్లి షర్మిల ఉప్పు-నిప్పులా మారారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే నా క ల అని చెప్పిన, తండ్రి వైఎస్ మాటను నిజం చేసేందుకు కూతురు షర్మిల రంగంలోకి దిగారు.

అందుకు భిన్నంగా.. రాహుల్ ఉన్న కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న బీజేపీతో, అన్న జగన్ కలసి పయనిస్తున్నారు. ఈ చీలిక పర్వంలో తల్లి విజయమ్మ తన కూతురు షర్మిల వైపే నిలబడ్డారు. జగన్ చిన్నాన్న,కొడుకులంతా జగన్ వైపే ఉంటే… అసలు బాబాయ్ వివేకానందరెడ్డి కుటుంబమంతా, షర్మిల వైపు నిలబడింది. ఇది పులివెందులలో వైఎస్ కుటుంబవిధేయులకు సంకటమే.

ఏపీసీసీ దళపతిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల, వెంటనే యాక్షన్‌లోకి దిగిపోయారు. ఆమె ర్యాలీని అడ్డుకోవడం ద్వారా, జగన్ కూడా రియాక్షన్‌కు దిగారు. ఆయన అధికార పుత్రిక సాక్షి మీడియా-సోషల్‌మీడియా కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే అడుగులేస్తోంది. దానితో అసలు యుద్ధం ఆరంభమైంది. ఆ సందర్భంలో తన అన్న జగన్ పాలనపై ..షర్మిల సంధించిన విమర్శనాస్త్రాలు, వైఎస్ వారసత్వం కోసం జరుగుతున్న పెనుగులాటను స్పష్టం చేశాయి.

షర్మిల బెజవాడ పర్యటనలో పోటెత్తిన కార్యకర్తలు..‘ వైఎస్ నిజమైన వారసులరాల’ంటూ చేసిన నినాదాలు, దానికి అద్దం పట్టాయి. విశాఖలో రాహుల్ కోసం దీక్షకు దిగిన షర్మిల, రాష్ట్ర పర్యటన ఖరారు చేశారు. ఈలోగా వైసీపీలో టికెట్ దక్కని సిట్టింగులు, ఆమెతో ముచ్చట్లు మొదలుపెట్టేశారు. కాగా రాష్ట్రంలోని 36 దళిత-గిరిజన నియోజకవర్గాలు, సొంత కడప జిల్లా లక్ష్యంగా షర్మిల వ్యూహరచన ప్రారంభించారు.

కాగా మణిపూర్‌లో క్రైస్తవులపై దాడుల అంశాన్ని.. షర్మిల ఇప్పుడు తెరపైకి తీసుకురావడం, వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. నాటి ఘటనలను జగన్ కనీసం ఖండించలేదని, క్రైస్తవులపై దాడి జరుగుతున్నా జగన్ స్పందించకుండా మౌనంగా ఉన్నారంటూ విరుచుకుపడ్డారు.

మణిపూర్ పాతగాయాలను తవ్వడం ద్వారా.. అన్నను క్రైస్తవుల ముందు ముద్దాయిగా నిలబెట్టే వ్యూహమే కనిపిస్తోంది. ఆ రకంగా ‘తాను మాత్రమే నిజమైన క్రైస్తవ ప్రతినిధి’ని అని.. రాష్ట్రంలోని 60 శాతం క్రైస్తవ-దళితులకు సందేశం-సంకేతం ఇవ్వడంగానే స్పష్టమవుతోంది. వైసీపీ వైపు ఉన్న ఆ వర్గాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి.. దానిని కాంగ్రెస్ ఖాతాలో కలపడమే, షర్మిల లక్ష్యమన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

చెల్లి షర్మిల దూకుడు మనస్తత్వం అనుభవంలో బాగా తెలిసిన అన్న జగన్.. వాయువేగంతో ఆమెకు చెక్ పెట్టేందుకు, తన భృత్యులను ఉసికొల్పడం మరో ఆసక్తికర ఘట్టం. విజయలక్ష్మి-షర్మిలతో సన్నిహిత సంబంధాలున్న వైవి సుబ్బారెడ్డి, తన సలహాదారు సజ్జలను షర్మిలపై విమర్శలకు ఉసిగొల్పారు. దానితో రంగం లోకి దిగిన వారిద్దరూ, షర్మిలను నిర్మొహమాటంగా ఏకేశారు.

‘తెలంగాణ షర్మిలకు ఏపీలో ఏం పని?ఆమె అక్కడెందుకు పోటీ చేయలేదు? ఎవరొచ్చినా వైసీపీని ఏం పీకలేరు. వైఎస్‌కు నిజమైన వారసుడు జగన్. ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదని షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు? షర్మిల చంద్రబాబు సంధించిన చివరి అస్త్రం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. జగన్ ఆదేశాలు లేకపోతే.. షర్మిలను విమర్శించే ధైర్యం వారిద్దరికీ ఉండదన్నది, బుద్ధి బుర్ర ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

అంతేనా? భారతి నేతృత్వంలో నడుస్తున్న సాక్షి పత్రికలో అయితే.. షర్మిల పేరు పక్కనున్న రెడ్డిని తొలగించి, కేవలం షర్మిలకే పరిమితం చేయడం మరో ఆశ్చర్యం. ఆమెపై సుబ్బారెడ్డి-సజ్జల చేసిన విమర్శలకు మొదటిపేజీని కేటాయిస్తున్నారు. అంటే భారతి కూడా, ఆడబిడ్డపై తన వంతు యుద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది.

నిజానికి యజమాని భారతి ఆదేశాలు-అనుమతి లేకుండా, జీతాలపై బతికే జర్నలిస్టులు షర్మిల వ్యతిరేక వార్తలు, మొదటి పేజీలో పెట్టలేరన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. తనకు సాక్షిలో వాటాలున్నాయని, గతంలో షర్మిల మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి.. ఆమెకు సాక్షిలో వాటా లేదని అర్ధమవుతోంది. నిజంగా వాటాలుంటే, ఆమెకు వ్యతిరేకంగా రాయలేరు కదా అన్నది షర్మిల అభిమానుల ప్రశ్న.

ఇక అన్నా చెల్లి మధ్య అలా యుద్ధం ఆరంభమైందో లేదో… వైసీపీ సోషల్‌మీడియా, ఇలా యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగేసింది. షర్మిలను వైఎస్ షర్మిలారెడ్డి అని కాకుండా.. ‘మొరసుపల్లి షర్మిలా శాస్త్రి’ అంటూ ట్రోల్ చేయడం, మరో ఆసక్తికర పరిణామం. అంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ బ్రాహ్మణుడు కాబట్టి.. షర్మిల కూడా బ్రాహ్మణురాలు అని చెప్పకనే చెప్పడం ఆ ప్రచార లక్ష్యమన్నది సుస్పష్టం. ఇది కూడా జగన్ అనుమతి లేకుండా జరగదన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

దీనిపై వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు సైతం, ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ‘‘రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డిది ఏ కులం? వాళ్లు ముగ్గురూ రెడ్లయితే షర్మిల రెడ్డి కాదా? మొన్నటి వరకూ షర్మిలా రెడ్డి అని రాసిన సాక్షి కూడా, ఇప్పుడు షర్మిల అని రాస్తోంది. వైసీపీ సోషల్‌మీడియా అయితే ఆమెను మొరసుపల్లి షర్మిలాశాస్త్రి’ అని ప్రచారం మొదలు పెట్టింది. ఎందుకీ పైత్యం?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశమయింది.ఇది కూడా చదవండి: షర్మిళా రెడ్డిని షర్మిళా శాస్త్రిగా సంబోధిస్తారా?… ఇదెక్కడి పైత్యం?

ఇలా గత ఎన్నికల ప్రచారంలో తాను జగనన్న విడిచిన బాణమంటూ.. జగన్ పార్టీ కోసం కాళ్లరిగేలా తిరిగి శ్రమదానం చేసిన చెల్లి షర్మిల, ఇప్పుడు అదే అన్న జగన్‌పై ఎదురుతిరిగిన బాణంలా మారడటం ఆసక్తికర పరిణామమే.

Leave a Reply