-విద్యార్ధులెక్కువ..టీచర్లు తక్కువ
– టెట్ కోసం టెంట్లలో దీక్షలు
– తెలంగాణలో సర్కారు స్కూళ్ల దుస్థితి
( ఎమ్మెస్సెమ్)
సంక్షేమ పథకాల పేరుతో జనం సొమ్మును పప్పు బెల్లాల్లా ఖర్చు బెడుతున్న కేసీఆర్ సర్కారు.. పిల్లలకు చదువుచెప్పే టీచర్ల పోస్టులను భర్తీ చేయడంపై అసలు దృష్టి సారించడం లేదు. ఫలితంగా పనిచేస్తున్న టీచర్లపై అదనపు భారం పడుతోంది. ఎలాగూ సర్కారు స్కూళ్లలో సౌకర్యాలు లేవు. కనీసం విద్యార్ధుల నిష్పత్తికి తగిన టీచర్లు కూడా లేకపోతే.. ఇక అది వానాకాలం చదువుకాక మరేమవుతుందన్నది మేధావుల ప్రశ్న. వెనుకబడిన తెలంగాణ సమాజంలో కష్టపడి చదువుకున్న పైకి వచ్చిన వారంతా, ఇప్పటి విద్యారంగం దుస్థితి చూసి కన్నీరు కారుస్తున్నారు. ఇరిగేషన్‌పై చేస్తున్న ఖర్చులో, విద్యారంగానికి పదిశాతం కూడా కేటాయించడం లేదన్నది విద్యార్ధి సంఘ నేతల విమర్శ. లిక్కర్ ద్వారా ఆదాయం ఎలా పెంచాలన్న తపనలో, టీచర్ల పోస్టులు భర్తీ చేయాలన్న సోయి సర్కారుకు లేదని విద్యార్ధి సంఘాలు విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకూ 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నా, గత ఏడేళ్లలో వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కేసీఆర్ సర్కారుకు లేక పోవడంతో, సర్కారీ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు కిటకిటగా ఉండటానికి.. ప్రభుత్వ పాఠశాలలపై కేసీఆర్ సర్కారు, శీతకన్నేయడమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తారా? లేదా? అన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒక సారి టెట్, ప్రతి రెండేళ్లకు ఒక సారి డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చేవారు. అయితే, తెలంగాణ వచ్చాక టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 24 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా… వాటి భర్తీకి పూనుకోవడం లేదు. తాజాగా నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియతో పోస్టుల భర్తీ మరింత క్లిష్టంగా మారింది. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 50 వేల పోస్టులను ఇప్పటికే గుర్తించారు. అయితే… ఇందులో టీచర్ పోస్టులను పరిశీలనలోకి తీసుకోవడం లేదు. దీంతో టీచర్ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభ్యర్థుల ఆందోళనలు, సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఎట్టకేలకు 2017లో టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి వరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్టీగా మార్చి, 2017 అక్టోబరు 21న నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎ్‌సపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టారు. అప్పట్లోనే మొత్తం 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే.. 13,500 పోస్టులకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుత 8,792పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత విడతలా వారీగా మరికొన్ని పోస్టులు భర్తీ చే యగా.. ఇంకా సుమారు 1000 వరకు భర్తీ చేయలేదు.
కోర్టు కేసులు, ఇతర కారణాలతో వీటి భర్తీ ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో ఏటా 12,500 మంది డీఎడ్, మరో 15,000 మంది బీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం 1.75 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు, 3ల క్షల మందికి పైగా బీఎడ్ అభ్యర్థులు ఉన్నట్టు అంచనా. వీరిలో టెట్ ఉత్తీర్ణత సాధించిన వారు పేపర్-1లో 65వేల మంది, పేపర్-2లో 1.5లక్షల మంది ఉన్నారు.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 24 వేలకు పైగానే ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమాచారం అందజేసింది. ప్రాథమిక విద్యలో 10,657 పోస్టులు, ఉన్నత విద్యలో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. విద్యాశాఖ పరిధిలో మొత్తం 1,38,517 టీచర్ పోస్టులు శాంక్షన్ అయి ఉండగా.. 1,25,574 పోస్టులు భర్తీ అయి ఉన్నాయని, మిగతా 12,943 పోస్టులే ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అయితే, 12వేల మంది విద్యా వలంటీర్ల పోస్టులను ప్రభుత్వం ఖాళీగా చూపించలేదు. ప్రస్తుతం విద్యావలంటీర్లు లేనందున మొత్తం ఖాళీలు 24 వేలకుపైగానే ఉన్నట్టు లెక్క తేలుతోంది. టీచర్ల రేషనలైజేషన్ తర్వాత ఖాళీ పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తొలి టెట్… 2016 మే 22న జరిగింది. ఇందులో భాగంగా పేపర్-1కు 88,158 మంది హాజరు కాగా, 48,278 మంది పాసయ్యారు. పేపర్-2ను 2,51,924 మంది రాయగా, 63,079మంది పాసయ్యారు. రెండో టెట్… 2017 జూలై 23న జరిగింది. పేపర్-1ను 98,848 మంది రాయగా, 56,708 మంది పాసయ్యారు. పేపర్-2ను 2,30,932 మంది రాయగా 45,045 మంది పాసయ్యారు.
అప్పటి నుంచి నాలుగేళ్లుగా రాష్ట్రంలో టెట్‌ను నిర్వహించలేకపోవడం వల్ల డీఎడ్, బీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం టెట్‌కి జీవిత కాల పరిమితి ఇచ్చారు. కానీ, నూతన అభ్యర్థులతో పాటు, గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించని వారు లక్షల్లో ఉన్నారు. పైగా ప్రైవేట్ పాఠశాలల్లో బోధించాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలన్న విషయం తెలిసిందే.