Suryaa.co.in

Entertainment

ఆయన అభినయం.. నట గ్రంధాలయం!

ఆయన..
సామర్ల వెంకట రంగారావు..
ఎస్ వి రంగారావు..
ఎస్వీఆర్..

నటసార్వభౌముడు..
నటయశస్వి..
చదువేమో..బీఎస్సీ..
ఉద్యోగం.. ఫైర్ ఆఫీసర్..

అబ్బే..ఆయన కోసం
ఘటోత్కచుడు..
సుయోధనుడు..
రావణాసురుడు..
కీచకుడు..
మైరావణుడు..
భీష్ముడు..
దక్షుడు..

ఇన్ని పాత్రలు కాచుకుని
అగ్గి రేపే పనుంటే
మంటలార్పే ఉద్యోగం
ఎలా చేస్తాడు..

మదరాసు చేరాడు..
మొహానికి రంగేసాడు…
సినిమా గతినే మార్చేశాడు..

రావణుడి విరాగం..
కీచకుడి విలాసం..
సుయోధనుడి ఆభిజాత్యం..
హిరణ్యకశిపుని కాఠిన్యం..
దక్షుడి అహంకారం..
భీష్ముడి పెద్దరికం..
ఏం చేసినా ఒక అందం..
విలనీలో హీరోయిజం..

ఆహార్యం భీకరం..
కంఠం గంభీరం..
డైలాగ్ పలికే తీరు అమోఘం..
ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా
ఒక్కసారి చదివితే కంఠోపాఠం..
ఎక్కడ విరవాలి..
ఇంకెక్కడ నొక్కాలి..
ఎక్కడ పెంచాలి..
మరెక్కడ తగ్గాలి..
ఆయనకు వచ్చినంతగా
ప్రపంచంలో ఇంకే నటుడికి
రాదంటే అతిశయోక్తి కాదు..

గొంతుకు తగిన హావభావం..
శోకమైనా..రౌద్రమైనా..
హాస్యమైనా..లాస్యమైనా..
ఆయనకే చెల్లు..

ఇక ప్రపంచ సినిమాలో
నభూతో నభవిష్యత్..
ఘటోత్కచుడు..
అష్టదిక్కుంబి కుంభాగ్రాలపై
మన కుంభద్వజముల
చూడవలదే..
గగన పాతాళ లోకముల..
ఈ పద్యం అందుకున్నప్పటి
నుంచి సినిమా షేపే మారిపోయింది..
ఊపందుకుంది..
ఊపిరి తిప్పనలవి కాని
సన్నివేశాలు..
ఆయనకు పోటీగా సావిత్రి..
ఆమే అతడు..
అతడే ఆమె..
హై హై నాయకా..
తాళిగట్ట వచ్చెనంట..
తగని సిగ్గు నాకంట..
తదొం…తోం..
ఆమెగా అతడు..
అంతటి భీకరాకారుడు
సిగ్గుతో అభినయం..
వివాహ భోజనంబు
వింతైన వంటకంబు కోసం
భోజనశాలలోకి
సావిత్రి దూరితే
ఎస్వీఆర్ చేరితే..
ఘటోత్కచునికేమో
విందు..పసందు..
ప్రేక్షకులకు కనువిందు..!

రాముడితో సంగ్రామంలో
బంధువులు పోయాక
రావణుడి విలాపం..
ఇదేనా ఒకనాడు నయనానందకరమై
శోభిల్లిన నా కొలువు కూటమి..
ఆ భావవ్యక్తీకరణ
అనితరసాధ్యం!

కొడుక్కి విషమిచ్చి చంపమన్న తండ్రిగా తట్టుకోలేని ఆవేదన..
అదే కొడుకు శ్రీహరి నామం జపిస్తున్నప్పుడు
ఆపుకోలేని ఆవేశం..
స్తంభంలో నరసింహున్ని
చూసినప్పుడు
పట్టరాని ఉద్వేగం..
హిరణ్యకశిపుడు..!

దరికి రాబోకు రాబోకు రాజా
సైరంధ్రి పాడుతుంటే
అంతులేని మోహపారవశ్యం
నిగ్రహం ఆపుకోలేని
ఆ విగ్రహాన్ని చూస్తుంటే
చెప్పలేని భయం..
పరాకాష్ట అభినయం..
ప్రెసిడెంటే పరవశుడైపోయిన
నర్తనశాలలో కీచకుడి నటవిన్యాసం..!

ధారుణి రాజ్యసంపద
మదంబున కోమలి
కృష్ణజూచి..
కురువృద్ధుల్ గురువృద్ద
బాంధవుల్ అనేకుల్
చూచుచుండ..
థియేటర్లలో మార్మోగిన
ఈ పద్యాలు..
ఘంటసాల గొంతు..
ధిక్..
ఒక్క మాటతో
అదిరిపోయిన హాళ్లు..
ఉత్సాహాల పరవళ్ళు..
దుశ్శాసనా..ఈడ్చుకురా
ఆ బంధకిని..
ఘోషయాత్రతో గర్వభంగం..
అనంతరం రారాజు ఆక్రోశం..
వెండితెరపై ఓ చరిత్ర..!

బాబూ..వినరా..
అన్నాదమ్ములా కథ ఒకటి..
మొదట ఆనందం..
తదుపరి విషాదం..
ఇంటి పెద్దగా
అభినయ పరాకాష్ట..!

మరచిపోయిన మానవత్వాన్ని
మనిషి మనిషిలోనూ
మేల్కొల్పగలిగే మహత్తర శక్తి
గల వాడివి..
నువ్వు దొంగతనం చేస్తావా..
దేవుడు చేసిన మనుషులులో
కొడుకు రామారావుతో
జమీందారు తండ్రి
ఉద్వేగం..విరాగం..
రంగుల్లో ఎస్వీఆర్ పంచరంగుల ప్రదర్శన!

తాతా..మనవడు..
కొడుకు నిర్లక్ష్యానికి గురైన
తండ్రి ఆవేదన..!

మిస్సమ్మ..గోపాలం..
అప్పు చేసి పప్పు కూడు..
బహదూర్..
పెళ్లి చేసి చూడు..జమీందారు..
మంచిమనసులు లాయర్..

ప్రతి అభినయం ఒక పాఠం
అన్నీ కలిపితే గ్రంధం..
మొత్తం కలగలిపితే థీసిస్..
అతడే ఒక యూనివర్సిటీ..
ఇది క్లారిటీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE