రగిలింది విప్లవాగ్ని ఈ రోజు..!

ఆ పేరు మన్యానికి
విప్లవ నినాదం…
ఉప్పొంగే ఆవేశం..
ఉరకలెత్తించే ఉత్సాహం..
తెల్లదొరల పెత్తనానికి ఉత్పాతం..
అడుగు పిడుగై..
మాట తూటాగా పేలి..
తెల్లవాడి గుండెల్లో
నిదురించిన వాడు..
నిదురించిన
మన పౌరుషాగ్ని
రగిలించిన వాడు..
అల్లూరి సీతారామరాజు

విప్లవం మానవ ఆకృతి దాల్చితే..
వీరత్వం నిలువెత్తు మనిషై ఎదురు నిలిస్తే..
సాగరమే ఆవేశమై..
ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశమై..
దేశం కోసం ప్రాయోపవేశమై..
నీలో దేశభక్తిని
పాదుకొల్పితే
అల్లూరి సీతారామరాజు!

అక్షరం ముక్క రాని మన్యంలో
అడుగడుగునా మోసపోయే దైన్యంలో..
విప్లవ సైన్యమై..
ఒక జాతికి తాను ధైర్యమై..
బానిసత్వమంటే
హీనసత్వమని
ఉవ్వెత్తున ఎగసి
తిరుగుబాటు బావుటా ఎగరేసి
తెల్లదొరల నల్ల గుండెల్లో
భయం పుట్టించిన అగ్నిజ్వాల
అల్లూరి సీతారామరాజు..!

పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టి
ఆయుధాలు మూటగట్టి
వాటి లెక్కగట్టి..
నిర్భయంగా చేసి సంతకం
భారతీయుడి నిజాయితీకి
కట్టి పట్టం..
దేశభక్తికి పట్టాభిషేకం చేస్తే
అల్లూరి సీతారామరాజు!

మిర్చి సందేశం..
తెంచి బ్రిటిషోడి పాశం..
ముష్కర కుయుక్తికి
ఎదురెళ్లిన ధీయుక్తి..
చుట్టుముట్టిన తుపాకీలకు వెరపు లేక..వీపు చూపక..
అక్కడ కాదురా..
ఇక్కడ కాల్చమంటూ
గుండెలు చూపిన తెగువ..
తూటా గుండెలో దిగుతున్నా
లొంగక బావుటా ఎగరేసిన
విప్లవ జ్వాల..
పేరే ప్రజాశక్తి సంకేతం..
బ్రతుకూ..చావూ..
రెండూ దేశానికి సందేశం..
కరకు రక్కసి రూథర్ ఫర్డ్ కే
వెన్నులో చలి పుడితే..
రవి అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్యంలో
భయం చీకట్లు ముసిరితే
ఒక మనిషి
ఆరడుగుల ప్రతాపమైతే..
అంతులేని ప్రకోపమైతే..అది
అల్లూరి సీతారామరాజు!

జననం ఒక గొప్ప కారణం..
వీరత్వమే గుణం..
తెలిసింది రణం
జీవితం రక్తతర్పణం..
పోరాటంలో ప్రాణాలే ఫణం..
మరణం ఆత్మార్పణం..
తెల్లవాడి గుండెల్లో
ఆరని చిచ్చు..
తెలుగువాడి గుండెల్లో
ఆరని జ్యోతి..
అల్లూరి సీతారామరాజు..!

వందేమాతరమంటూ నినదించిన బంగాళం
స్వరాజ్యమ్ము జన్మహక్కని చాటించిన హిందోళం..
హింసకు ప్రతిహింసయన్న వీరభూమి పాంచాలం..
అన్నిటికీ నెలవాయెను
ఆంధ్రవీర హృదయం..
మన రామరాజు హృదయం..!
అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా జోహార్లు

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply