Home » హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో…
1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న అనే క్లాసిఫికేషన్ కు తెర పడుతుంది.
2. ఫలానా హీరో గారి సినిమా కాబట్టి, తెల్లారు ఝాము షోలు, అర్ధరాత్రి షోలు అంటూ ప్రేక్షకులను నిలువుదోపిడీ కుదరదు.
3. 10 టికెట్లు కౌంటర్స్ లో అమ్మి, మిగిలిన టికెట్స్ ను సొంత మనుషులను పెట్టి బ్లాక్ లో అమ్మించడం ఇక ముందు థియేటర్ యజమానులకు కుదరదు.
4. ఏ సినిమాకు ఏ వర్గం ప్రేక్షకులు వస్తున్నారో ప్రభుత్వానికి తెలిసిపోతుంది.
5.సినిమా టికెట్ల జారీ అనేది ప్రభుత్వ కనుసన్నల్లోకి వెళ్లిపోతున్నందున- ఆంధ్ర మార్కెట్ పై సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆశలు వదిలేసుకోవచ్చు. ఆ మార్కెట్ చూసుకునే – హీరోలు, దర్శకులు 20 కోట్లు,30 కోట్లు అంటూ వీరంగం వేస్తున్నారు.
కీలు ఎరిగి వాత పెట్టాలి అనేది మన సామెత. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే పని చేసింది.
సినిమా హీరో పవన్ కళ్యాణ్…-తన సినిమాలు ఏవో తాను చేసుకోకుండా- ‘జనసేన’ అంటూ అప్పుడప్పుడూ జనంలోకి రావడం…. జగన్ ను విమర్శించడం, మళ్ళీ సినిమా దుప్పట్లోకి దూరి పోవడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా పరిశ్రమలోని ఆయన బంధువర్గంలో ఓ 10 మందికి తక్కువ లేకుండా ‘హీరో’ లు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క బిరుదు ఉంది.
వీరి సినిమాలు రిలీజ్ అనగానే – ఓ జాతర. ఓ వీరంగం. ‘ అభిమానులు’ అనుకునే వారి పూనకం. ఫ్లెక్సీలు కట్టేటప్పుడు, వాటికి పాలాభిషేకాలు చేసేటప్పుడు- పైనున్న కరెంట్ వైర్లు తగిలో…. ఫ్లెక్సీల పైనుంచి కాలు జారి కిందపడి కొందరు చనిపోవడం….ఆ హీరోలు ఊరేగింపుగా వెళ్లి, అన్యాయమైపోయిన కుటుంబానికి ఓ రెండు లక్షలు విదిల్చి రావడం అనే- హీరోల చుట్టూ అల్లుకుపోయి ఉన్న ఈ ‘ ఫాల్స్ ప్రెస్టీజ్’ కు- జగన్ తెర దించారు. వాళ్ళూ మన లాంటి మనుషులే. సినిమాల్లో నటించడం అనేది వాళ్ళ వృత్తి. ఓ వంద పారేసి సినిమా చూడడం అనేది మన సరదా. అంతే! అంతకు మించి సినిమా జనంతో బంధం ఉండాల్సిన పనిలేదనే విషయాన్ని – సినిమా ప్రేక్షకులకు -జగన్ గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్- ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. సినిమా ప్రపంచం కావాలి అనుకుంటే- ‘జనసేన’ పేరిట కార్యకలాపాలను పక్కన పెట్టాలి. లేదూ- ‘జనసేన’ తో సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకుంటే- సినిమా నటనను వదిలేసి, రాజకీయ నటనపై 100 శాతం దృష్టి పెట్టి, వైసీపీని ఎదుర్కొనాలి. ఆయన ఆ స్పష్టతకు రావడం కోసమే- ఈ టికెట్ నియంత్రణకు ఆంధ్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల- పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి తీసిన సినిమాకూ అదే టికెట్ ధర. పోసాని కృష్ణ మురళినో…చమక్ చంద్రనో పెట్టి తీసిన సినిమాకు అయినా అదే టికెట్ ధర. థియేటర్ ల ముందు ఇక జనం కనిపించరు. ఆసక్తి ఉన్నవారు టికెట్లు ఆన్ లైన్ లో కొనుక్కుంటారు.ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక్క ‘హీరో’ గానీ, నిర్మాత గానీ కనీసం ప్రశ్నించలేదు. పోనీ ‘హీరో’ ల అభిమానులైనా ప్రశ్నించారా అంటే అదీ లేదు. మరి ,ఏమైపోయారు ఈ అభిమానులు, అభిమాన సంఘాల వారు.?
గుర్రం పని గుర్రం ….గాడిద పని గాడిద చెయ్యాలని అందుకే పెద్దలంటారు. సినిమా జనం సినిమా పని చేసుకోవాలి. వారు ప్రజలకు వినోదం అందించాలి. అంతకు మించిన ఓవర్ యాక్షన్ చేయకూడదు అని జగన్ ప్రభుత్వం వారికి ‘ జ్ఞాన బోధ’ చేస్తున్నది, ఆంధ్రాలో సినిమా వ్యాపారాన్ని తన అధీనం లోకి తీసుకోవడం ద్వారా. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలేయాలి. అప్పుడు రెండింటి మధ్య ఘర్షణ ఉండదు. ఈ సత్యాన్ని సినిమా జనానికి బోధ పరిచిన జగన్ కు అభినందనలు.

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail.com

Leave a Reply