Home » వైసీపీలో తొలి హిందువు తిరుగుబాటు!

వైసీపీలో తొలి హిందువు తిరుగుబాటు!

– జగన్ నిర్ణయానికి సొంత పార్టీలోనే ఝలక్
– వినాయక చవితి ఆంక్షలకు నిరసనగా వైసీపీ నేత రాజీనామా
– కాసు నుంచి శశిధర్ వరకూ తిరుగుబాటుదారులంతా ‘గుంటూరోళ్లే’
( మార్తి సుబ్రహ్మణ్యం)
రెండున్నరేళ్ల అధికారంలో ఇప్పటివరకూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీలో ఎక్కడా బహిరంగ వ్యతిరేకత కనిపించలేదు. క్యాబినెట్ సమావేశాల్లో జగన్ చెప్పిందే మంత్రులకు వేదం. దానిపై కనీసం సొంత అభిప్రాయానికీ తావులేదు. ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పనక్కర్లేదు. నేతలయితే జగన్ నిర్ణయాన్ని బలపరుస్తూ మైకులు పగలకొట్టేస్తుంటారు. కానీ… ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఎవరూ ఊహించని ఆ ఒక్కడు మాత్రం బలంగా గొంతు విప్పాడు. తమ సర్కారు తీసుకుంటున్న హిందూ వ్యతిరేక విధానాలపై గళమెత్తి గర్జించాడు. ఆ ఒక్కడు మంత్రి కాదు. ఎమ్మెల్యే అసలే కాదు. ఒక జిల్లా స్థాయి నాయకుడు! వినాయక విగ్రహాల ఏర్పాటుపై, తమ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దూదేకి నట్లు ఏకిపారేశాడు. హిందుత్వాన్ని నాశనం చేసేందుకు, తన పార్టీ అధినేత జగన్ కంక ణం కట్టుకున్నాడని శివమెత్తాడు. అంతటితో ఊరుకున్నాడా? ఏకంగా తన పదవికి రాజీనామా చేశాడు. ఆ సాహసకుడి పేరు బందా శశిధర్. హోదా గుంటూరు జిల్లా వైసీపీ కార్యదర్శి. ఇప్పుడిది వైసీపీలో ఓ సంచలనం. పదవులున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం భయతో వణికిపోతున్న సమయంలో, ఓ జిల్లా స్థాయి నేత చేసిన ఈ అసాధారణ సాహసచర్య వైసీపీ నాయకత్వాన్ని ఖంగుతినిపించింది. ఆ పార్టీలోని హిందువుల్లో సరికొత్త ఆలోచనలను తట్టిలేపేందుకు స్ఫూర్తిగా నిలిచింది.
జగన్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేసిన శశిధర్ ఓ జిల్లా స్థాయి నేత కావచ్చు. ఆయన ఎలాంటి పదవులూ లేని ‘రాజకీయ అనాధ’ కావచ్చు. కానీ, ఇది ఆ పార్టీలోని హిందువుల మనోభావాలకు, మనసులో గూడుకట్టుకున్న అసమ్మతికి అద్దం పట్టేదన్నది నిర్వివాదం. తన రాజీనామా సందర్భంగా, శశిధర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. జగన్ ప్రభుత్వంపై వైసీపీ హిందూ నేతల మనోగతం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ‘‘జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చి, మసీదులలో వారి మతానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకున్నారా? కేవలం హిందువుల పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు? హిందుత్వాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్ హిందూ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా’’న న్న శశిధర్ ప్రకటన, ఒక్క హిందూ సమాజంలోనే కాదు. వైసీపీని సమర్ధించే హిందువులందరిలోనూ కచ్చితంగా ప్రకంపనలు రేపేవే. కాకపోతే అది ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకన్నదే ప్రశ్న.
నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి. జరుగుతున్నాయి. రధాలు, విగ్రహాలు దహనమయ్యాయి. కానీ అవన్నీ పిచ్చివాళ్ల చేష్టలుగా పోలీసులు తేల్చేశారు. కొన్ని జిల్లాల్లో మతమార్పిళ్లు విశృంఖలత్వంగా సాగుతోందని, కొందరు ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల సౌజన్యంతో, మతప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బహిరంగవేదికలపైనే కొందరు ఐపిఎస్-ఐఏఎస్‌లు క్రిస్మస్ పండుగరోజున మనవాళ్లకు ఉద్యోగాలొచ్చాయంటూ, హిందు సంప్రదాయాలను వెక్కిరించిన వీడియోలు, సోషల్ మీడియా ద్వారా జనబాహుళ్యంలోకి దూసుకుపోయాయి. సర్కారు సొమ్ముతో మసీదు, చర్చి పెద్దలకు డబ్బులిస్తున్నారని, తిరుమలలో స్వామి దర్శనానికి రుసుము పెంచి.. ఆ డబ్బుతో అన్యమతాలను పోషిస్తున్నారంటూ సాధుసంతులు రోడ్డెక్కుతున్నారు.
ఇన్ని జరుగుతున్నా వైసీపీలోని హిందూ మతానికి చెందిన ఏ ఒక్క నేత కూడా స్పందించలేదు. పైగా వారే జగన్ సర్కారుకు దన్నుగా నిలుస్తూ మీడియా ముందుకొస్తున్నారు. ఇక జగన్ హిందువంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసిన.. ఆయన రాజగురువయిన స్వరూపానంద కూడా, గత రెండేళ్లలో జగన్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన దాఖలాలు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ రెండున్నరేళ్లలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తప్ప.. తర్వాత ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్నదంతా బంతిపూల యుద్ధమేనన్నది మనం మనుషులం అన్నంత నిజం. తిరుమలలో టీటీడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలనుకున్న సొంత పార్టీ నేతలకు లక్ష్మణరేఖ గీసిన పరిస్థితులన్నీ, వైసీపీ సర్కారుకు గొప్ప మేలు చేసేవేనన్నది నిష్ఠుర నిజం. చివరాఖరకు లౌకికపార్టీగా చెప్పుకునే తెలుగుదేశం, ఆశ్చర్యకరరీతిలో హిందూమతం తీసుకుని, ఈ వ్యవహారాలపై ఆందోళన చేస్తున్న వైచిత్రి.
ఇలాంటి విచిత్ర పరిస్థితిలో.. జగన్ ఏకస్వామ్య పాలన ను.. చివరకు సొంత పార్టీ నేత ఒకరు బాహాటంగా వ్యతిరేకించి, బయటకు రావడం ఆసక్తికర పరిణామమే. దీనికి పెద్దగా ప్రాధాన్యం లేదని వైసీపేయులు కొట్టిపారేసినా.. ఆ ఒక్కడికి అంత సీన్ లేదని పెదవి విదిల్చినా.. శశిధర్ అనే నేత ప్రారంభించింది మాత్రం, ఆ పార్టీలోని హిందువుల్లో కొత్త ఆలోచన పర్వమేనన్నది నిఖార్సయన నిజం. చరిత్ర ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఒకటితోనే ఆరంభమవుతుంది. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ను కూడా నాదెండ్ల భాస్కరరావు అనే ఒక్కడు వ్యతిరేకించిన తర్వాతనే, తెలుగుదేశంలో అంతర్యుద్ధం మొదలయింది. తర్వాత నిలదొక్కుకున్నా, చంద్రబాబు వ్యతిరేకించిన తర్వాతనే ఎన్టీఆర్ పూర్తి స్థాయి రాజకీయ పతనం మొదలయింది. ఇందిరాగాంధీని కాసు బ్రహ్మానందరెడ్డి అనే ఒక్కడు సాహసిస్తేనే ఇందిర అవమానం పాలయింది. చంద్రబాబును కేసీఆర్ అనే తెలంగాణ స్వాప్నికుడు వ్యతిరేకించి బయటకొచ్చిన తర్వాతనే, ఇప్పుడు బాబుకు రాజకీయ భవితవ్యం గాడాంధకారంగా మారిందన్న చారిత్రక సత్యం విస్మరించకూడదు. కాసు బ్రహ్మనందరెడ్డి, నాదెండ్ల వంటి నేతల, తిరుగుబాటు స్వభావానికి పురిటిగడ్డయిన అదే గుంటూరు జిల్లా నుంచే ఇప్పుడు.. చాలా ఏళ్ల తర్వాత వైసీపీలో శశిధర్ అనే మరో నేత, సొంత పార్టీ అధినేతపై తిరుగుబాటు చేయడం విశేషం.
అందాకా ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కాంగ్రెస్‌కు రాజకీయ వైధవ్యం పట్టించిన జగన్‌ది కూడా, పదేళ్ల క్రితం ఒంటరి పోరాటమే. నియంతలకు మారుపేరయిన ఇటాలియన్ సోనియాను వ్యతిరేకించినందుకే ఆయన రాజకీయ ఎన్నికల చరిత్ర, ఇప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నది విస్మరించకూడదు. అలాగే… శశిధర్ అనే ఓ సాధారణ నేత ప్రారంభించిన ఈ ఆలోచనా పర్వం కూడా, భవిష్యత్తులో ఎటయినా.. ఎవరికయినా స్ఫూర్తి కావచ్చు. ప్రపంచంలో ఏ మహానగరం కూడా ఒక్కరోజులో నిర్మాణం కాలేదు కదా? ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. జగన్ సర్కారుపై బీజేపీ చేస్తున్న ‘ఉత్తుత్తి బంతిపూల మత యుద్ధం’ కంటే.. లోకేషును భావి నేతగా ప్రమోట్ చేసేందుకు, టీడీపీ చేస్తున్న పబ్లిసిటీ యుద్ధం కంటే.. ఆంధ్రా రాజకీయాల్లో ‘గెస్ట్ రోల్’ పోషిస్తూ, అలా వచ్చి ఇలా వెళ్లే జనసేనాధిపతి పవన్ చేస్తున్న ‘గెస్ట్‌వార్’ కంటే.. శశిధర్ అనే ‘గుంటూరోడు’ ప్రారంభించిన ఈ ‘నిశ్శబ్ద విప్లవమే’ గొప్ప అన్నది సగటు హిందువు అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి బీజేపీ సంఘపరివారం ఆయా రాష్ట్రాల్లో ‘అవసరాల కోసం’ ఆడే రాజకీయ క్రీడకంటే, వాళ్లు వేసుకున్న హిందూ ముసుగు కంటే.. అధికార పార్టీలో ఉంటూ, హిందూజాతికి జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా గళమెత్తిన ‘శశిధరే నిఖార్సయిన హిందుత్వవాది’ అన్నది హిందూ సమాజం కితాబు. ఇది నిజమో కాదో తేల్చాల్సింది కాలమే! అప్పటిదాకా సర్వేజనా సుఖినోభవంతు!!

Leave a Reply