Home » జనాలకు జగన్ ‘ధరా’ ఘాతం!

జనాలకు జగన్ ‘ధరా’ ఘాతం!

– సామాన్యులకు నిత్యం కూర‘గాయాలు’
– కరెంటు షాకులతో ఖజానా నింపేసుకున్న వైసీపీ సర్కారు
– 9 సార్లు జనాలకు జగన్ కరెంటుషాకులు
– టీడీపీ హయాంలోనే తక్కువ ధరలు
– బాబు హయాంతో పోలిస్తే జగన్ జమానా రేట్లే అత్యధికం
-వైసీపీ పాలనలో వందశాతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
– ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు, పెట్రోలు, డీజీల్ ధరలు పదింతలు
– అన్ని రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించినా పట్టించుకోని జగన్ సర్కార్
– గూబగుయ్యిమంటున్న ఇసుక, బియ్య, పప్పు, ఇంటిపన్నులు
– చెత్తపన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అని మహిళల మండిపాటు
– పేద, మధ్య తరగతికి కరెంటు షాకులు
– ఒక్కో ఇంటికి సగటున వెయ్యి నుంచి రెండువేల కరెంటు బిల్లు
– చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లు 350 రూపాయలే
– ఐదేళ్ల బాబు పాలనలో పెరగని బస్సు చార్జీలు
– జగన్ జమానాలో నాలుగుసార్లు పెంచిన వైనంపై సామాన్యుల ఆగ్రహం
– టీడీపీ హయాంలోనే ధరలు తక్కువని గుర్తు చేస్తున్న మహిళలు
– జగన్‌కు కనిపించని జనా‘ధర’ణ
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘జగనన్న నే రుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లకు డబ్బులేస్తున్నాడు. కాబట్టి వైసీపీకి మహిళల ఓట్లు గంగగుత్తగా పడటం ఖాయం’
‘ డబ్బులు తీసుకున్న కృతజ్ఞతతో మహిళలు జగనన్నకే ఓట్లు వేస్తారు’
‘ గతంలో ఏ ప్రభుత్వం ఇట్లా నేరుగా మహిళల అకౌంట్లకు డబ్బులు వేసింది చెప్పండి? అందుకే ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా, జగనన్నకు మహిళల ఓట్లు దండిగా పడతాయి’

– ఇవీ వైసీపీ వర్గాలతోపాటు, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆ పార్టీ ప్రాయోజిత యూట్యూబ్-సోషల్‌మీడియా ‘జనరలిస్టు’ల సూత్రీకరణకు ఇదొక ప్రాతిపదిక. వారికే కాదు బయట నుంచి చూసే వారికి సైతం.. ‘అవును నిజమే కదా’ అనిపించే ఒక కోణం. కానీ అది ఒక కోణమే. మరి రెండో కోణంలో ‘ఒక చేత్తో ఇచ్చి రెండో చేతితో గిచ్చే’ దోపిడీ విధానమేనన్న విషయం, మహిళా లోకానికి చాలా ఆలస్యంగా అర్ధమవుతోంది. అది కూడా.. కూటమి నేతలు ఆ దోపిడీ ఎలా అన్నది, అరటిపండు వలిచి పెటినట్లు వివరించడం వల్ల! ఆ ప్రకారంగా ఇప్పటి జగన్ జమానాతో పోలిస్తే, అప్పటి చంద్రబాబు సర్కారు వందరెట్లు మేలన్న భావన, మహిళలలో స్థిరపడిపోయింది. కారణం గత ఐదేళ్లు-అంతకుముందు బాబు పాలనను చూసిన అనుభవం! అదేమిటో-ఎలాగో ఓసారి చూద్దాం.

జగన్ సర్కారులో మహిళల అకౌంట్లకు నేరుగా డబ్బులు వేస్తున్నారన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఒక్కో కుటుంబానికి 75 వేల నుంచి లక్ష రూపాయలు, లబ్ధిచేకూరుతోందన్న ప్రచారం కూడా తారాస్థాయిలో లేకపోలేదు. కాబట్టి ఆ కృతజ్ఞతతో మహిళలు వైసీపీకి ఓట్లు వేస్తారన్న అంచనా కనిపిస్తోంది. అది సహజమే. అటు మహిళలు కూడా తమకు డబ్బులిచ్చి మేళ్లు చేస్తున్న జగనన్న పట్ల, కృతజ్ఞతగా ఉంటారన్న భావన కూడా ఉంది. అదీ నిజమే. అయితే.. ఇదంతా కొద్దినెలల క్రితం వరకూ మాత్రమే. అంటే తమకు అమ్మఒడి ఇచ్చి, అదే చేత్తో ‘నాన్నతడి’ పేరుతో జేబుగుల్ల చేస్తున్నారని తెలియనంతవరకే! గుప్పిట విప్పనంతవరకే రహస్యం కదా?

ఇప్పుడు మహిళలు జగనన్న సర్కారు తమకు ఎంత ఇచ్చి, ఆ పేరుతో ఎంత దోపిడీ చేస్తుంది? చంద్రబాబు హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉంటే, జగన్ జమానాలో అవి ఎన్ని రెట్లు పెరిగాయి? కరెంటు చార్జీలు ఎన్నిసార్లు పెంచారు? బస్సు చార్జీలు ఎంత పెంచారు? ఇవన్నీ లెక్కవేసుకుంటే.. చంద్రబాబు హయాంలో కంటే కొన్ని ధరలు పది నుంచి ఎనభైశాతానికి పెరిగినట్లు మహిళలకు అర్ధమయింది. ఇక చెత్తపన్ను వంటి బాదుడు సరేసరి. ఆ ప్రకారంగా జగన్ కంటే చంద్రబాబు పాలన.. వందరెట్లు మేలన్న నిర్ణయానికి మహిళాలోకం వచ్చేసిన ట్లు కనిపిస్తోంది. అంటే జగనన్న ఇచ్చేది గోరంత. కొట్టేసేది కొండంత అని తెలుసుకున్నారన్నమాట.

అంటే.. ఉదాహరణకు వాహనమిత్ర పేరుతో 10 వేలు ఇచ్చి.. అదే చేత్తో పెట్రోల్-డీజీల్ ధరలు పెంచారు. ఇక పోలీసు చలాన్లు, మద్యం ధరలు, గ్రీన్‌టాక్సు పెంచడం ద్వారా.. ఏడాదికి లక్ష రూపాయలు ఇంకో చేత్తో గుంజేస్తున్నారన్న మాట. నిజానికి ఇది జాగ్రత్తగా పరిశీలిస్తేగానీ అర్ధం కాదు. కానీ చూసేవారికి వాహనమిత్ర పేరుతో ఆటోడ్రైవర్లకు 10 వేలు ఇస్తున్నారన్న ప్రచారమే కనిపిస్తుంది. తమకు పదివేలు ఇచ్చి.. లక్ష రూపాయలు పిండుతున్నారన్న విషయం వారికి జ్ఞానోదయం అయ్యేసరికి, మళ్లీ ఎన్నికలు కూడా వచ్చేశాయి. ఇది జగన్ పరోక్ష బాదుడికి ఒక ఉదాహరణ మాత్రమే.

చంద్రబాబు-జగన్ హయాంలో కొన్ని నిత్యావసర వస్తువుల ధరల తేడా పరిశీలిస్తే.. మహిళల అభిప్రాయం నిజమేననిపించకమానదు. బాబు హయాంలో వంద రూపాయలున్న ఒక వస్తువు, జగన్ జమానాలో 300 రూపాయలకు పెరిగిందన్నమాట.
నిత్యావసరాల కోసం రూ.2000 ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.3500 – రూ.5000 వేలు ఖర్చవుతోంది.
వంట గ్యాస్ 2018లో రూ.750 ఉంటే ప్రస్తుతం రూ.1200 అయింది.
కూరగాయలు గతంలో నెలకు రూ.500 సరిపోతే ఇప్పుడు రూ.1000 సరిపోవడం లేదు.
పాలు అప్పట్లో లీటర్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.80 అయ్యాయి.
25 కిలోల బియ్యం అప్పట్లో రూ.1000 ఉంటే ఇప్పుడు రూ.1400కు పెరిగాయి.
పెట్రోల్ లీటర్ రూ.76 నుండి రూ.112కి, డీజిల్ రూ.68 నుండి రూ.100 పెంచారు.
రూ.500 ఉండే కరెంటు బిల్ రూ.2000 అయింది.
ఆర్టీసీలో మినిమం టికెట్ రూ.5 ఉంటే ప్రస్తుతం రూ.10 చేశారు.
ఈ లెక్కన గతంలో నెలకు సగటున అన్ని ఖర్చులూ రూ.5-6వేలు అయితే.. ఇప్పుడు రూ. 10వేలకు చేరింది.
ఇలా సామాన్య కుటుంబంపై సగటున నెలకు రూ.10 వేలు అదనపు భారం మోపారు.

ఈ ప్రశ్నకు బదులేదీ?

• అప్పట్లో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ 32 శాతం ఉంటే ప్రస్తుతం 35 శాతానికి పెంచింది జగన్ రెడ్డి కాదా?
• గ్యాస్‌పై 14 శాతం ఉన్న వ్యాట్ 24 శాతానికి పెంచిన ఘనత జగన్ రెడ్డిది కాదా?
– కిలో కందిపప్పుపై రూ. 27 పెంపు, కిలో పంచదార పై ఏకంగా రూ.14 పెంచింది జగన్ రెడ్డి కాదా?
– జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు 9 సార్లు ఛార్జీలు పెంచారు.
• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయలేదు.
• కానీ, రూ.64 వేల కోట్ల విద్యుత్ భారాలు సామాన్యులపై మోపా రు. .
• పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచి పేదల జేబులు గుల్ల చేస్తున్నా రు.
• ఎక్సైజ్ డ్యూటీ (రూ.7) తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా, దేశంలోని 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి.
• పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గాయి. ఏపీలో మాత్రం రూపాయి కూడా తగ్గించలేదు.
• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్ పై ఉండే వ్యాట్ ను 14.5 శాతం నుండి 24.5 శాతానికి పెంచి గ్యాస్ పై వంట అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కల్పించారు.
• మద్యం………..రూ.60 క్వార్టర్ రూ.180కి అమ్మకం.
• విద్యుత్………..9 సార్లు ఛార్జీల పెంపు
• ఆర్టీసీ ఛార్జీలు…అడ్డగోలుగా పెంపు రూ.2000 కోట్ల భారం
• ఇసుక…………ట్రాక్టర్ రూ.5వేలు, లారీ రూ.50వేలు చేశారు.
• సిమెంటు……..రూ.320 నుండి రూ.420కి పెంచారు.
• ఫైబర్ నెట్…….రూ.150 నుండి రూ.350 చేశారు
• వృత్తి పన్ను(రూ.1,250 నుండి రూ.2000కు), జర్నలిస్టులకు రూ.2400తో (రూ.161 కోట్లు)
• వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ చేయడం ద్వారా రూ.400 కోట్లు
• వాహన జరిమానాలు (రూ.750 నుండి రూ.40వేల మధ్య)

జుట్టు పన్ను ఒక్కటే మిగిలింది: ఎమ్మెల్సీ అనురాధ
‘‘అప్పట్లో ఔరంగజేబు జుట్టుపై పన్ను వేశారని చరిత్రలో చదివాం. కానీ జగన్ పాలనలో అది ఒక్కటి తప్ప అన్ని బాదుళ్లూ బాదారు. ఆ ఒక్క పుణ్యం కూడా క ట్టుకుంటే జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. మహిళలు మళ్లీ జగన్‌కు ఓటు వేస్తే ఈసారి జుట్టుపైనా పన్ను వేస్తారు. జగన్‌రెడ్డి హయాంలో వందశాతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా కూడా, మహిళలు వైసీపీకి ఓట్లు వేస్తారని వాదించే మూర్ఖులకు బాబు-జగన్ పాలనలోని రేట్లే ఉదాహరణ’’ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.

Leave a Reply