Suryaa.co.in

Entertainment

గుండమ్మకి షష్టిపూర్తి!

07.06.1962
గుండమ్మకధ..షష్టిపూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పుడు సమీక్ష చేస్తున్నా కూడా తాజాగా చూసి రాస్తున్న అనుభూతి.మనలో చాలా మంది పుట్టక ముందే విడుదలైన ఈ సినిమా విజయనగరంలోని మా వెంకటేశ్వర థియేటర్ తో పాటు ఊళ్లో నాటికి ఉన్న టాకీసులన్నిటిలోను ఎన్నెన్ని సార్లు చూసానో లెక్కే లేదు.

టీవీల్లో సరేసరి..ఇప్పుడు వచ్చినా తెరకు అతుక్కుని చూసెయ్యడమే..నా దృష్టిలో గుండమ్మకథ కమర్షియల్ కళాఖండం..అఖండం..!నటీనటులంతా ఎవరి పాత్రకి వారు నూటికి నూరు శాతం న్యాయం చేసిన వెండితెర అద్బుతం. హాస్యం, డ్రామా.. సెంటిమెంట్స్..అన్నీ సమపాళ్లలో పండిన ఫక్తు కుటుంబకథా చిత్రం..విజయా బ్యానర్ వైభవాన్ని పెంచిన సినిమా..

నిక్కరులో నందమూరి..
లిక్కరులో అక్కినేని..
నక్కజిత్తుల గంటయ్య..
చొక్కా ఇట్టా చించుకొచ్చా
భర్తను నిలదీసే హేమలత..
తొడలు చరిచి
చావు దెబ్బలు తిన్న
పహిల్వాన్ రాజనాల..
అధాటున వస్తే మీకేమి
గిధాటున వస్తే మీకేమి
ఇలా ధాటిగా తిరగబడే
పెళ్లిళ్ల పేరయ్య బొడ్డపాటి..
బక్క పల్చటి
హోటల్ యజమాని అల్లు..
ఇదంతా ఒక టైపు సెటప్పు..
ఒక్కొక్కరికి
ఒక్కో రకం మేకప్పు..!

గుండుబోగుల గుండమ్మ..
ఆమె చుట్టూ నడిచే కథ..
సవితి కూతురు సావిత్రి..
కోడి కూసే పాటికి
ఇంటి పనిలో మునిగిపోయే
మహా అభినేత్రి..
ఇంటికి పెళ్లి చూపులకి వచ్చే కాబోయే మాంగారు
ఆజానుబాహువు
రంగారావుకే
నిద్ర కళ్ళతో అమ్మా కాఫీ
అంటూ కనిపించే సరోజ..
ఆ పేరు చెప్పడంలోనూ
వెటకారపు జజజ్జరోజ..
నాటి పెద్దోళ్ల ఇళ్లలో
ధిలాసాగా తిరిగే
ఏకైక పుత్రుడు
బ్యాచి హరనాథ్..
జోడీ విజయలక్ష్మి…
ఆమె అప్పా..అమ్మ..
మిక్కిలినేని,రుష్యేంద్రమణి..
మేనత్త దుర్గి..
గుండమ్మ సాటి..
ఆమెకే పోటీ..
గాంధీ గారి క్లాసులో
కాకిబుద్ధి ఛాయాదేవి..
గుండమ్మ ఇంట్లో పని
చెయ్యలేనని అంజి పేచీ..
అదంతా గంటయ్య లాలూచీ..
తోటమాలి వెంకన్న గారు..
తారాగణం మొత్తం
బంధుగణం..
అందరిదీ బాగా
నటించే గుణం..!

ఇద్దరు పెద్ద
హీరోలున్న సినిమాకి
గుండమ్మకథ టైటిల్..
పాత్రకి..టైటిల్ కు
పూర్తి న్యాయం చేస్తూ
సూర్యకాంతం అభినయం..
పక్కన గంటన్న..
అబ్బో..
అతగాడు పెద్ద పెంటన్నా..
ఆరడుగుల రమణారెడ్డి
కంటద్దాలేమో సోడాబుడ్డి..
పాలలో మోసం..
మెలేస్తూ మీసం..
మెక్కేస్తూ అల్లు హోటల్లో
ఉల్లి,అల్లం దట్టించిన దోశ..
ఎంత పేరాశ…
పైగా నీళ్ళు కలపకుండా
పాలు తాగే మగాడెవడోయ్
అంటూ బుకాయింపు..
చాయమ్మ రాగానే
గుండమ్మకే దబాయింపు!!

సినిమాకి హైలైట్ అంజి..
గుండమ్మ కూతురిని పెళ్ళాడి
రిక్షాలో షికారు కోసం
రెండ్రూపాయలు
గంటయ్యను గుంజి గుంజి..
ఎన్టీఆర్ హాస్యం…
అందులో ఎంత లాస్యం..
అతడే ఆంజనేయ ప్రసాద్
అన్నది మనకి మాత్రమే
తెలిసిన రహస్యం..
నెట్టు భాయ్
అంటూ తమ్ముడితోనే
కారు తోయించిన రుబాబు..
ఈ సినిమాకి
నందమూరే నవాబు..!

లేచింది నిద్రలేచింది మహిళాలోకం..
దద్దరిల్లింది పురుష ప్రపంచం
అయ్య పెద్ద ఏదాంతి
అంటూ తిప్పిన రుబ్బు..
తొలి చూపులోనే
గుండమ్మ బొట్టికి
ఏసేస్తూ సబ్బు..
కోలోకోలోయన్న కోలో
నా సామి..
కొమ్మలిద్దరు
మంచి జోడు..
సొంత తమ్ముడికే
తోడల్లుడి వరస కలిపి
అందుకున్న సాంగు..
ఎన్టీవోడు లూజు నిక్కరుతో
చెంగు చెంగు..!
అయినా మనిషి మారలేదు
ఆతడి కాంక్ష తీరలేదు..
మానవుని నైజంపై
ఎప్పటికీ మారని పచ్చి నిజం
అలిగిన వేళనే చూడాలి..
గోకుల కృష్ణుని అందాలూ..
నిజంగానే అంత
అందంగా అన్న…
పార్కునే ప్రేమయాత్రకి
బృందావనంగా
చేసుకున్న జమున..
గుండక్క ముద్దుల కూన…
అదే సరోజనని
ఎస్వీఆర్ కే తేల్చి చెప్పిన
అందాల భరిణ..!

జొన్నలు దంచిన చేతులకు
పిడకలు చేసిన
చేతులపై గెలుపు..
తీరిన చాయమ్మ బలుపు..
ఇల్లరికానికి ఎదురు
అల్లుడరికంతో శుభం కార్డు
ఈ సినిమా పెద్ద రికార్డు..!

ఘంటసాల సంగీతం..
పింగళి సాహిత్యం..
‘సరస’రాజు సంభాషణలు
మార్కస్ కెమెరా..
తొలిసారి సాంఘిక సినిమా
దర్శకత్వంలో కమలాకర
విజృంభణ..
కళాఖండమో..కలకండమో
గుండమ్మ పేరు మహిమో
అందరి కంటిచూపులో
ఆ సినిమాయేనాయె..!

సూర్యకాంతం
నభూతో నభవిష్యతి..
ఆమె అద్భుత పరిణితి..
ఆ పాత్ర ఆమెకే పరిమితి..
మళ్లీ తీద్దామంటే
గుండమ్మ ఎక్కడన్న
విజయావారి నీతి..నిరతి..
వెరసి..ఎందరు
మహామహులున్నా
కాంతమ్మకే దక్కిన
‘విజయ’హారతి..!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE