మధురగీతమే పాడదా..!

ఘంటసాల గళంలో
ఇబ్బంది మొదలైన వేళ..
తెలుగు సినిమా పాటకి
తగ్గిపోతే కళ..అదెలా..
బాలు ఉన్నాడు చాలు..
అనుకుంటే ఎలా..
మరో గొంతు ఏది..
అదే ఆది…అదే ఉగాది..
వయసే ఒక పూల తోట..
వలపే ఒక పూలబాట..
ఆ తోటలో ఆ బాటలో
పాడాలి తీయని పాట..
పాడాలి తీయని పాట..
అక్కినేనికి ఘంటసాల
స్వరమే సర్వస్వం..
నా హృదయపు కోవెలలో
నా బంగరు లోగిలిలో..
బాలు ఎంత కమ్మగా పాడినా
తొలిరోజుల్లో నప్పని గళం..
ఒప్పని జనం..
అక్కినేని అభినయానికి రామకృష్ణ గొంతు
చిత్రంగా ‘విచిత్రబంధం’
అయింది..!

చిక్కావు చేతిలో చిలకమ్మా
అంటూ చిలిపిగా
శ్రీకారం చుట్టినా..
రామకృష్ణ గళం..
భక్తతుకారామునీ చేరింది..
చక్రధారినీ ఆకట్టుకుంది..
బ్రహ్మం గారి పాటలనూ
మూటలు కట్టి అందించింది..
ఏల సంతాపమ్ము..
మరి నీకేల
సందేహమ్ము పార్ధా అని
గీతాసారాన్నీ మధించింది..
కొంతలో కొంత మాస్టారిని
మరిపించుంది..
కొన్నాళ్లపాటు జనాల్ని మురిపించింది..
అమరదీపమై వెలసింది..!

అందాలు కనువిందు చేస్తుంటే..
నీ అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన గిలిగింత కాదా..
చూసే కనులకు నోరుంటే
అది మధురగీతమే పాడదా..
ఎన్నో అద్భుతగీతాల
హిందీ ఆరాధన..
తెలుగులో కన్నవారికలలు..
తెలిసాయి రామకృష్ణ కళలు
పాటలు రసగుళికలు..
మధువొలకబోసే మధురగీతాలు..
ఒక తరం ప్రేమికులకు
మరపురాని సుభాషితాలు!

ఎదగడానికెందుకురా తొందరా..
ఎదర బతుకంతా
చిందరవందర…
అందాలరాముడి సూత్రాలు..

ఇంతే ఈ జీవితము
చివరికి అంతా శూన్యము..
అమరదీపం ఆవేదన..

ఓర్నాయాల్ది..
నాయుడోరింటికాడ
నల్లదుమ్మ సెట్టు నీడ
నాయుడేమన్నాడే బుల్లి..
అబ్బ..గుండె ఝల్లుమన్నాదే బుల్లే..
అందరూ దొంగలే అల్లరి..

ఏమండీ పండితులారా
ఏమంటారు..మీరేమంటారు..
బ్రహ్మం గారి ఆవేశం..
ఇవన్నీ సమపాళ్ళలో
పలికించిన రామకృష్ణ
స్వరం..అప్పుడప్పుడూ
మండే భాస్వరం..
అలుగుటయే ఎరుంగని
మహామహితాత్ముడజాత
శత్రువే అలిగిన నాడు..
సాగరములన్నియు ఏకము
కాకపోవు..ఈ కర్ణులు
పది వేవురైనను..
నందమూరిని ఒప్పిస్తూ
జనాలను మెప్పిస్తూ..
పాడిన పద్యాలు..
కళామతల్లికి నైవేద్యాలు..
మాస్టారి తర్వాత ఈ దాసుకే
అనుభవేకవేద్యాలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply