అమెరికాలో ధరలు మండుతున్నా… డాలరుదే హవా

– మన కంటే అధికంగా అమెరికాలో ద్రవ్యోల్బణం అయినా బలపడుతున్న ఆ దేశ కరెన్సీ
– బలహీనంగా రూపాయి

అమెరికాలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. జూన్లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా నమోదైంది. అదే మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతమే. యూరోను కరెన్సీగా వినియోగిస్తున్న 19 ఐరోపా దేశాల్లో కూడా జూన్ ద్రవ్యోల్బణం 8.6 శాతమే. అంటే మనదేశం, ఐరోపా కంటే అమెరికాలోనే ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉంది. ఏ దేశంలో అయినా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటే, ఆ దేశ కరెన్సీ మారకపు విలువ పతనమవుతుంది. అయితే అమెరికా డాలరు విలువ అందుకు భిన్నంగా చలిస్తోంది. డాలర్ విలువ ఇప్పుడు రూ.79.82కు చేరితే, ఐరోపా కరెన్సీ అయిన యూరో విలువ కూడా డాలర్ విలువకు దిగి రావడం గమనార్హం.

డాలర్ ఇంత బలంగా ఉండటం ఎలా సాధ్యమవుతోంది..?
అమెరికా, ఐరోపా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఎగుమతుల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యా నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలును కొన్ని దేశాలు నిలిపేశాయి. దీంతో ముడిచమురుకు కొరత ఏర్పడి, బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 140 డాలర్ల వరకూ వెళ్లినా, ఇప్పుడు 100 డాలర్ల వద్ద కదలాడుతోంది. రష్యా నుంచి వచ్చే లోహాల ధరలకూ కొరత ఏర్పడి, వాటి ధరలూ పెరిగాయి. ఉక్రెయిన్ నుంచి గోధుమలు, సన్ఫ్లవర్ నూనె సరఫరాలు స్తంభించి, ఆహార పదార్థాల ధరలూ పెరిగాయి. అమెరికాలోన ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2% కంటే పైనే ద్రవ్యోల్బణం నమోదు కావడం ప్రారంభమయ్యాక, గిరాకీని-నగదు చెలామణిని అదుపు చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. వడ్డీరేట్లు పెంచుతోందీ.

డాలరుకు బలం ఇలా..
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది. ఇందువల్ల వాటిని కొనేందుకు ఆసక్తి పెరిగింది. దీంతోపాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఉంది. అంతర్జాతీయ వర్తకం అంతా డాలర్లలోనే జరుగుతుందనేది తెలిసిన విషయమే. . ఫలితంగా డాలర్లే ప్రపంచంలో అత్యంత భద్రమైన ఆస్తిగా భావించడం పెరిగింది. అమెరికాలో వడ్డీరేట్లు సున్నాగా ఉన్నప్పుడు, అక్కడి నుంచి పెట్టుబడులు భారత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి తరలి వచ్చేవి. ఈ దేశాల్లో మార్కెట్లు రాణించడంతో, వారికి అధిక ప్రతిఫలం లభించేది. అయితే బాండ్లపై ప్రతిఫలం పెరిగాక, వర్ధమాన దేశాల్లో ఈక్విటీలు విక్రయించి, పెట్టుబడులను వెనక్కి పట్టికెళ్లడం పెరిగింది. ఫలితంగా డాలర్కు గిరాకీ పెరిగి, రూపాయి పతనమైంది.

1999లో యూరోను ఐరోపా దేశాల సమాఖ్య ఆవిష్కరించింది. ఇప్పుడు 19 దేశాల్లో ఆ కరెన్సీ అమల్లో ఉంది. 2002 డిసెంబరులో డాలరు కంటే తక్కువగా ఉన్న యూరో విలువ, ఆ తరవాత పెరిగి ఇటీవలి వరకు ఎక్కువగానే ఉండేది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో, మాంద్యం భయాలు ఐరోపాలో పెరిగాయి. తమపై విధించిన ఆంక్షలకు నిరసనగా జర్మనీకి శాశ్వతంగా గ్యాస్ సరఫరాను రష్యా నిలిపేస్తే, పరిస్థితి మరింత దుర్భరమవుతుందని ఐరోపా వాసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే డాలర్ సురక్షితమని భావించి, దానిపై పెట్టుబడులు పెరగడం వల్ల, విలువ హెచ్చుతోంది.

అమెరికాలో మందగమనం ఏర్పడితే అమెరికాలో రేట్లు మరింత పెంచుతారనే నమ్ముతున్నారు. పైగా ద్రవ్యలభ్యత తగ్గితే కొనుగోళ్లు నెమ్మదిస్తాయి. ఫలితంగా ఉత్పత్తి, సేవలకు గిరాకీ తగ్గి, ఉద్యోగ కోతలు సంభవిస్తాయి. ఇందువల్ల అమెరికా మాంద్యంలోకి జారొచ్చన్న అంచనాలున్నాయి. ఇందువల్ల భారత్ వంటి దేశాల నుంచి వస్తు, ఐటీ సేవల ఎగుమతులు, వాటిపై ఆదాయం క్షీణిస్తుంది. మన ఆర్థిక వృద్ధిలో ఎగుమతుల వాటా నాలుగో వంతు కావడం గమనార్హం. ముడిచమురు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి లోహాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం కనుక, డాలర్లలో చెల్లించాల్సిన దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది.

ఇందువల్ల వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు పెరుగుతున్నాయి. ఈనెల 8తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 800 కోట్ల డాలర్లు తగ్గి 58,025 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడేందుకు ‘దిగుమతులకు రూపాయల్లో చెల్లింపు, డాలర్లలో నిధుల సమీకరణకు కంపెనీలతో పాటు బ్యాంకులకూ మరిన్ని సౌలభ్యాల’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. ముడిచమురు బిల్లు తగ్గించుకునేందుకు రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. ఇవన్నీ రూపాయి విలువ మరింత వేగంగా పతనం కాకుండా చూస్తాయని భావించొచ్చు.

– పులగం సురేష్, జర్నలిస్టు

Leave a Reply