ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్న జ‌గ‌దీప్‌ను బీజేపీ త‌న ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా శ‌నివారం రాత్రి ఢిల్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా న‌డ్డా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్నర్‌గా కొన‌సాగుతున్న ధ‌న్‌క‌ర్ రాజ‌స్థాన్‌కు చెందిన వారు. వృత్తిరీత్యా న్యాయ‌వాది అయిన ధ‌న్‌క‌ర్‌… సుప్రీంకోర్టులో ప‌లు కేసుల‌ను వాదించారు. రాజ‌స్థాన్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగానూ ఆయ‌న ప‌నిచేశారు. 1989లో జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన ధ‌న్‌క‌ర్‌.. 1989-91 మ‌ధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2003లో ఆయ‌న బీజేపీలో చేరారు. శ‌నివారం బీజేపీ పార్ల‌మెంట‌రీ భేటీకి ముందుకు ప్ర‌ధాని మోదీతో ధ‌న్‌క‌ర్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న పేరును ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ఎంపిక చేసింది.

Leave a Reply