Suryaa.co.in

Political News

‘హక్కుల’ కమిషన్‌కు జడ్జిగారే స్టెనోగ్రాఫర్!

– చైర్మన్‌కు స్టెనోగ్రాఫర్‌ను నియమించని సర్కారు
– ఆయన తీర్పులు ఆయనే టైప్ చేసుకున్న జస్టిస్ మాంధాత
– మీడియా కథనాలతోనే కారు, డ్రైవర్ సౌకర్యం
– సిబ్బందికి భోజనాలు కట్ చేసిన నాటి కర్నూలు కలెక్టర్
– సీఎంఓకు చెప్పినా దిక్కులేదు
– నేటితో ముగిసిన చైర్మన్, సభ్యుల పదవీకాలం
– ఏపీలో హక్కుల కమిషన్ ఇప్పట్లో లేనట్లేనా?
– కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ కమిషన్ లేనట్లే
– పదేళ్లయినా సిబ్బంది విభజనకు దిక్కులేదు
– ముగిసిన హక్కుల కమిషన్ మూడేళ్ల ముచ్చట
( అన్వేష్)

ఏపీలో మానవహక్కుల కమిషన్ ఇప్పట్లో పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. జస్టిస్ మాంధాత సీతారామమూర్తి చైర్మన్, ఇద్దరు సభ్యులతో ఉన్న మానవ హక్కుల కమిషన్ పదవీకాలం నేటితో ముగియనుంది. అసెంబ్లీ ప్రోరొగ్ కావడంతో సీఎం, ప్రతిపక్ష నేతలతో కమిటీ భేటీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. కోడ్‌కు ముందే కమిషన్ సభ్యుల కోసం ఈనెల 15న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈలోగా కోడ్ రావడంతో ఇక రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ పనిచేసే అవకాశాలు లేకుండా పోయింది.ఇది కూడా చదవండి: హక్కుల కమిషన్‌కు దిక్కెవరు ?

నిజానికి రాష్ట్రంలో హక్కుల కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం విముఖత చూపింది. అయితే దానిపై పలువురు కోర్టుకు వెళ్లి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని హైకోర్టులో కేసు వేశారు. పిటిషన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుచేయలేదు. దానిపై మళ్లీ కోర్టులో ప్రభుత్వంపై ధిక్కార పిటిషన్ వేశారు. ఫలితంగా ప్రభుత్వం గత్యంతరం లేక 2021లో కమిషన్‌ను ఏర్పాటుచేసింది.

జస్టిస్ మాంధాత సీతారామమూర్తి చైర్మన్‌గా, దండె సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావు జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా హైదరాబాద్ కేంద్రంగా కమిషన్ ఏర్పడింది. కానీ హైదరాబాద్‌లో ఉమ్మడి హక్కుల కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హక్కుల కమిషన్ స్వాధీనం చేసుకోవడంతో, పాపం ఏపీ హక్కుల కమిషన్‌కు నిలువనీడ లేకుండా పోయింది. అయితే మూడేళ్ల పదవీకాలం ఉన్న హక్కుల కమిషన్ చైర్మన్ మాంధాత.. పాపం కారు, డ్రైవర్, స్టెనోగ్రాఫర్, ఫోను లేకుండా చాలాకాలం పనిచేశారు.

ఎక్కువ కాలం కమిషన్ సభ్యుల ఇళ్ల నుంచే పనిచేయడం మరో విచిత్రం. చైర్మన్ దుస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం, ఎట్టకేలకు ఆయనకు కారు, డ్రైవర్‌ను ఏర్పాటుచేసింది.

ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కమిషన్‌ను విభజించకపోవడంతో, ఉద్యోగులు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. సరైన సంఖ్యలో ఉద్యోగులు లేకపోవడం, ఫిర్యాదుల సంఖ్య పెరగడంతో ఉద్యోగులపై భారం పెరిగింది. దీనిపై చైర్మన్ మాంధాత ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం శూన్యం. అసలు తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ జీతాలిస్తుండం మరో విచిత్రం.ఇది కూడా చదవండి: హక్కుల కమిషన్‌కు భోజనం బంద్‌

హక్కుల కమిషన్ దుస్థితిపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కోర్టు ఆదేశాలతో కమిషన్ కార్యాలయం, ఎట్టకేలకు విజయవాడకు తరలింది. పరిమిత సిబ్బందితో స్టేట్ గెస్ట్ హౌస్‌లో కొద్దికాలం కోర్టు నడిచింది. చివరకు కర్నూలుకు కార్యాలయం తరలినా.. ఉద్యోగులపై పని భారం తగ్గకపోగా మరింత పెరిగింది.

పైగా స్టేట్ హెడ్‌క్వార్టర్ అలవెన్సు తీసుకున్న సిబ్బంది, ఇప్పుడు కార్యాలయం కర్నూలుకు తరలిపోవడంతో జిల్లా స్థాయి అలవెన్సు తీసుకోవలసిన దుస్థితి. కర్నూలుకు తరలిన కార్యాలయ సిబ్బందికి ప్రభుత్వం కొద్దినెలలు భోజన సౌకర్యం కల్పించింది. అయితే బడ్జెట్ లేదంటూ భోజనం బంద్ చేశారు. సీఎంఓకు చెప్పినా ఫలితం శూన్యం.

ఆ దుస్థితి అక్కడితో ఆగిపోలేదు. చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి, పదవీ విరమణ చేసేంత వరకూ తీర్పులు రాయడానికి స్టెనోగ్రాఫర్‌ను నియమించకపోవడమే విషాదం.

దానితో విధి లేక ఆయన తన తీర్పులను తానే టైప్ చేసుకున్నారు. రిజర్వు చేసిన తీర్పు ఆలస్యమయ్యేందుకు.. స్టెనోగ్రాఫర్ లేకపోవడమే కారణమని చైర్మన్ జస్టిస్ మాంధాత, స్వయంగా ప్రొసీడింగ్స్‌లో రాయడం విశేషం. మొత్తానికి స్టెనోగ్రాఫర్, అటెండర్ లేకుండానే హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి పదవీకాలం ముగియడం ప్రస్తావనార్హం.

అయితే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా.. చివరకు కారు-డ్రైవర్ లేకపోయినా జస్టిస్ మాంధాత హక్కుల కమిషన్‌లోనే ఎక్కువ సమయం గడిపి, ఫిర్యాదులపై శరవేగంగా స్పందించేవారు. గతంలో ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేసిన కాకుమాను పెదపేరిరెడ్డి తర్వాత, అంత క్రియాశీలకంగా పనిచేసిన చైర్మన్‌గా మాంధాత పేరు సంపాదించారు. కాగా మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పడే అవకాశాలు లేవు.

LEAVE A RESPONSE