Suryaa.co.in

Political News

నవ్వుతూ మీరు.. ఏడుస్తూ మేము..!

మోడీజీ..ఎంత సంబరంగా మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు..
మీకేముంది.. వచ్చామా..వెళ్ళామా..
పని ముగిసిందా లేదా…
మనకి ఎంత ప్రచారం వచ్చింది..
ఇవే పాయింట్లు..!

కాని..మాకు బుద్ధి ఉండక్కర్లేదా..
ఏం ఒరగబెట్టాడని నరేంద్ర మోడీ అనే వ్యక్తికి రేపటి రోజున తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టాలి..?

ఒకటా..రెండా..ఎనిమిదేళ్లకు పైగా ఢిల్లీ పీఠంపై కూర్చుని అప్రతిహతంగా రాజ్యం చేస్తున్న మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం మంచి చేశారు.మొదటి విడతలో ఇక్కడి అధికారపార్టీ మూడు సంవత్సరాలకు పైగా ఆయన పార్టీతోనే జత కట్టి ఉంది.అప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రయోజనాల కోసం కమలంతో అంటకాగారు తప్ప మనం కలిసి ఉన్నాం గనక మా రాష్ట్రానికి ఇవి చెయ్యండి అని అడిగిన పాపాన పోలేదు. కొత్తగా ఏమీ చెయ్యాల్సిన పని లేదు. విభజన హామీలు పక్కాగా నెరవెరిస్తే అదే పదివేలు.

సరే..చంద్రబాబు రాజకీయం వేరనే అనుకుందాం.జగన్ సం’గతేం’టి?మూడేళ్లకు పైగా మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూనే ఉన్నారు.తన కేసులు..తిర’కాసులు’ తప్ప ఒక్కటంటే ఒక్క ప్రయోజనం రాష్ట్రానికి ఒనగూర్చగలిగారా.

రాజధానిగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ స్వయంగా రావడమే గాక ఎక్కడెక్కడి నుంచో సేకరించిన మట్టిని అక్కడి మట్టిలో కలిపారు. ఇంకేం..అతి తక్కువ కాలంలో రాజధాని సర్వాంగ సుందరంగా ముస్తాబై పోతుందని తెలుగు ప్రజలు కలలు కన్నారు. ఇప్పుడేమైంది.. మోడీ తెచ్చిన మట్టి,మన మట్టి జగన్ రేపిన మూడు రాజధానుల దుమారంలో ఎగిరిపోయాయి. ఇప్పుడక్కడ శిథిలాలు మిగిలాయి. అసలు..రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా పోయింది.

అరె..నేను ఓకే చేసి మట్టి తెచ్చి మరీ శంకుస్థాపన చేశాను కదా..మీరు కూడా ప్రతిపక్షంలో ఉండి ఎస్ అన్నారు..మరి ఏంటీ కత.. అని మోడీ కడిగేరా..పోనీ ఒక్కనాడైనా అడిగారా..మట్టి ఇచ్చాం..తన్నుకు చావండి..అని వదిలేసారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు భారీ స్వాగతం..ఇదేనా ఆంధ్రుడి స్వగతం.. ఎన్నో పోరాటాలు చేసిన గతం..చేవ చచ్చిన మనోగతం.. ఉడిగిపోయిన ఇంగితం..!

మోడీజీ..ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఈ గడ్డపై అడుగు పెడితే బాగుండేది. పోలవరం..
మీ దర్మమాని కలవరమే..!
మీ నిర్లక్ష్యమో..
మా చేతగానితనమో!?

పరిశ్రమలు.. కొత్తవి ఎటూ రావు..ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తూ సగర్వంగా వస్తున్నారు.మీ దుశ్చర్యకు నిరసనగా అయిదు వందల రోజులకు పైగా ఉద్యమం నడుపుతున్న సోదరుల కేకలు మీ హెలికాప్టర్ల హోరులో..
సిగ్గు…పౌరుషం లేని మా నాయకుల జైజై ధ్వానాల హుషారులో మీ షికారు విజయవంతంగా ముగిసిపోయింది.
మై బహుత్ ఖుష్ హూ..
అల్లూరి జైసే మహావీర్ కా ఏ భూమి ధన్య హో..
అని నాలుగు మాటలు
చెప్పి వెళ్లారు.
ఈ భూమి దైన్యం
మీకేమి తెలుస్తుంది.?

ప్రాజెక్టులు లేక..
పరిశ్రమలు రాక..
ఉద్యోగావకాశాలు చాలక..
రాజధాని ఏదో..ఎక్కడో..
ఎన్నో తేలక..
హోదా..విభజన హామీలు
ప్రత్యేక ప్యాకేజీ..
వీటి అతీగతీ తెలీక
తెగి తోక
దిక్కు తోచక..
అలమటిస్తున్న
మా రాష్ట్రంలో మీ పర్యటన..
సూపర్ సక్సెస్..
అది పక్కా..
హెలికాప్టర్ ఎక్కేసారు ఎంచక్కా..!

ఆరంభ శూరులం
మీ ప్రారంభ వేడుకను
కళ్ళారా చూసి తరించాం..

అయినా..
మాకు బుద్ధి లేదు గాని మొదటి నుంచి
మోడీ చూపుతున్నది
మొండి చేయ్యేగా..
మీరు నవ్వుకోండి హాయిగా..
మేం ఏడుస్తూనే ఉంటాం
గోదావరి పాయగా..!

సురేష్ కుమార్ e
జర్నలిస్ట్
9948546286

LEAVE A RESPONSE