Suryaa.co.in

Features

నా స్కూల్ డేస్…..స్వీట్ మెమోరిస్…!!

పసి తనంలోని తల్లితండ్రుల లాలింపులు… విద్యా బుద్దులు నేర్పిన తొలినాటి పాఠశాల జ్ఞాపకాలను ఎన్నటికి వాటిని మరువలేము….!! నేటి కార్పేరేట్ విద్యా విధానాల నడుమ… ఓమారు నాటి రోజుల్లోకి తొంగిచూస్తే… నేడు మనం పోగోట్టుకున్నది ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది..! నాటి బోధకుల్లో ఉన్న అంకిత భావం, విద్యార్ధులతో వారికి పెనవేసుకుని ఉండే ఆప్యాయత అనురాగాలు, విద్యార్ధుల మధ్య ఉండే సహాయసహకారాలు నేడు మచ్చుకకైనా కనిపించవు….! ర్యాంకుల కోసం విద్యార్ధుల పాట్లు…సకాలంలో ఫీజులు కట్టని విద్యార్ధులకు అరదండాలు..వారి తల్లితండ్రులకు పాఠశాల యాజమాన్యాల వేదింపులు…దరిమిలా వ్యాపారమయంగా మారిన విద్యాకేంద్రాలు…ఇవి నేడు సర్వత్రా కనిపించే దృశ్యాలు…!!

వీటి అన్నింటికి భిన్నమైన వాతవారణంతో కూడినవి నాటి మా పాఠశాలయొక్క మధుర జ్ఞాపకాలు. వాటిని మీ ముందు  ఉంచాలన్నదే నా తపన.  సదరు ఈ జ్ఞాపకాలు నేను చదివిన యమ్.టి.హెచ్.స్కూల్-రాజమండ్రి..కి చెందినవి అయ్యిండోచ్చు!!….కాని…” ఇవన్నీనాటి మా అందరి స్వీయ అనుభూతులే”…అని చదువరులు అనుకునే విధంగా వ్రాయడానికి చేసిన చిరు ప్రయత్నమే “నా స్కూల్ డేస్.. స్వీట్ మోమోరిస్”

హెడ్ మాష్టార్ చలపతిరావు గారు స్కూల్ లోకి ప్రవేశించడమే తరువాయి… దెబ్బతో పాఠశాల అంతటిని నిశ్శబ్ధం రాజ్యమేలుతూ ఉండేది… ఒక్క మాటలో చెప్పాలంటే కర్ఫూ వాతవారణమే కనపడేది ఆ సమయంలో..!!… అంటే క్రమ శిక్షణకు అంత ప్రాధాన్యతను ఇచ్చేవారన్నమాట ఆయన…..!

దినపత్రికల్లోని ప్రధాన అంశాలను స్కూల్ నోటిస్ బోర్డ్ పై వ్రాయమని రోజుకోక స్టూడెంట్ ను పురమాయించేవారు చలపతిరావు మాష్టారు.!.. ఆ విధంగా పురమాయింపబడ్డ వ్యక్తి ఆ రోజుకు స్కూల్ లో హిరోగా చలామణి అయ్యేవారు తోటి విద్యార్ధుల నడుమ….!. ఎందుకంటే చలపతిరావు మాష్టారు దృష్టిలో పడటం అంటే అంత అషామాఫీ వ్యవహారం కాదు….ఏదో విధంగా ఆయన దృష్టిలో పడితేచాలు మా జన్మ ధన్యం అయింది అని అనుకునే స్టూడెంట్స్ ఎంతోమంది ఆరోజుల్లో….!

నేటికి మా స్కూల్ నోటిస్ బోర్డ్ ను తాకినప్పుడల్లా మేము వార్తలు వ్రాసిన నాటి రోజులు బోర్డుపై లీలగా కనిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతేకాదు అంజనేయస్వామి మాష్టారుగారి హటత్మరణం, నాటి మన ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ హత్య గావింపబడటం వంటి సంఘటనలు మా స్కూల్ జీవితంలో జరిగిన చేదు సంఘటనలు. వాటిని తలచుకుంటే బాధతో ఇప్పటికీ మా గుండె చెరువు అయిపోతూ ఉంటుంది.

మమ్మల్ని దండించాల్సిన సందర్భాలలో కూడా కారుణ్యం కనపడేది నాటి మా ఉపాధ్యాయుల కళ్ళల్లో…!.. మమ్మల్నీ దండించిన తరువాత వారు పక్కకు వెళ్ళి చెమ్మగిల్లిన తమ కళ్ళను తుడుచుకోవడం మేమందరం చూసినవాళ్ళమే…!

భోజన విరామ సమయంలో దండనకు గురైన మావద్ధకు వచ్చి ఊరడిస్తు ఉండేవారు మా ఉపాధ్యాయులు. అంతేకాదు తాము తెచ్చుకున్న భోజన క్యారేజ్ లను మా ముందు ఉంచి మాకు తినిపిస్తూండేవారు ప్రేమభిమానాలతో…….!…

ఇటువంటి అప్యాయతలను నాడు మా ఉపాధ్యాయులైన మాలిక్ మాష్టారు, వైడ్యూర్యం మేడమ్, కృష్ణ మీనాన్… ధర్మవతి మేడమ్… మహాలక్షీరావు, డ్రిల్ మాష్టార్ సుబ్బారావు వంటి వారినుండి తరచుగా పొందుతూ ఉండేవాళ్ళం.

నేటికి కూడ మా స్కూల్ గ్రౌండ్స్ ని చూసినప్పుడు నాటి ఆ  సంఘటనలే మా కండ్ల ముందు కదలాడుతున్నట్లుగా భ్రాంతి కలుగుతు ఉంటుంది.దరిమిలా తీయని బాధతో మా కండ్లు చెమ్మగిల్లుతుంటాయి.!!

1982 సం.కి పూర్వం రాజమండ్రిలోని వీరబద్రపురంలో ఉన్నది ఒకేఒక మున్సిపల్ స్కూల్. దాన్నే వీరబద్రపురం మున్సిపల్ స్కూల్ అని పలవబడేది. ఈ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరుగుతుండటంతో 1982-83 సం.ల మధ్య జయకృష్ణపురంలో కంటిపూడి రామరావు ప్రాధమిక మున్సిపల్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఆసమయంలో వీరబద్రపురంలోని మున్సిపల్ స్కూల్ ను  “మున్సిపల్ టౌన్ హైస్కూల్ గా” నామకరణం చేయడం జరిగింది.

అప్పుడు రెండు పాఠశాలల మధ్య కొందరి విద్యార్ధుల బదలాయింపు జరిగింది. తమ మధ్య అట్టి ఎడబాటును జీర్ణీంచుకోలేక, మా బాల్య స్నేహితులను విడిచి వెళ్ళలేక బోరున ఏడ్చేసాం మేమందరం.  ఆ మమల్నీ ఉపాధ్యాయులు సముదాయించిన తీరును ఏనాటికి మర్చిపోలేం..!

కంటిపూడి వారి పాఠశాలలో 7 వ తరగతి  చదివిన పిదప తిరిగి మున్పిపల్ టౌన్ హైస్కూల్ లో మేమందరం చేరినప్పుడు ఉపాధ్యాయులు, మా బాల్య స్నేహితులు ఆప్యాయతతో  మమ్మల్ని అక్కున చేర్చుకున్న సంఘటన తాలుకు జ్ఞాపకాలు మా అందరి హృదయాలలో ఇప్పటికి నిక్షిప్తమే…!

ఎ మరియు బి సెక్షన్ లుగా విభజింపబడి ఉండేవి నాడు మున్సిపల్ టౌన్ హైస్కూల్ లోని మా తరగతి గదులు.   విద్యార్ధుల అవగాహాన స్ధాయి ప్రతిపాదికగా ఆ సెక్షన్లలో విద్యార్ధులను కేటాయించేవారు.

చాక్ పీస్ మరియు డస్టర్ లను తీసుకుని ఎ-సెక్షన్ తరగతులకు వెళ్ళేవారు ఉపాధ్యాయులు.. . కాని బి-సెక్షన్ కు వెళ్ళాల్సి వచ్చేటప్పటికి  మాత్రం వాటితో పాటు ఓ పొడవాటి బెత్తాన్ని కూడ అదనంగా తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది.

ఎందుకంటే బి-సెక్షన్ పిల్లల అల్లరి అటువంటిది ఆరోజుల్లో….!.. కాని ఈ దోరణిని వ్యతిరేకిస్తుండేవారు ఆ రోజుల్లో సైన్సు టీచర్ మణెమ్మగారు. బెత్తంతో బెదిరిస్తే అలవడేది కాదు విద్య..అంటూండేవారు ఆమె. బి-సెక్షన్ విద్యార్ధులకు కూడ ప్రత్యేకంగా ప్రయివేట్ క్లాసులు పెడుతూ మంచి మెళుకువలతో పాఠ్యాంశాలను బోధిస్తుండేవారు ఆమె.

కాని అప్పట్లో మా అందరికి కోపంగా ఉండేది ఆమె అంటే… ఎందుకంటే శెలవురోజుల్లో కూడ ప్రయివేట్ క్లాసులను పెడుతూ ఉండేవారు…!!  ఆ ప్రయివేటు క్లాసుల వెనుక ఉన్న పరమార్ధం ఏమిటో మా అందరికి తెలిసొచ్చింది తరువాత .. ఆవిడ కృషి ఫలితంగా మా అందరికి మంచి మార్కులు వస్తూండేవి.

ఆవిడ అందించిన ఆ స్పూర్తితో మిగిలిన సబ్జెక్ట్ లలో కూడ మంచి మార్కులనే పట్టేస్తుండే వాళ్ళం.  దరిమిలా ఎ-సెక్షన్ విద్యార్ధులతో చదువులో పోటిపడగలుగుతూ ఉండే వాళ్ళం ఆ రోజుల్లో…!

“విద్యార్ధులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకూడదు… ప్రాధమిక స్ధాయినుండే బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, అభివృద్ధి అంశాల పట్ల అవగాహన పెరిగేలా చేయాలి….అప్పుడే విద్యార్ధులు మంచి పౌరులుగా తీర్చి దిద్దబడతారు”…. అని త్యాగరాజు మాష్ట్రారు మరియు మహాలక్ష్మీరావు, డ్రిల్ మాష్టారు సుబ్బారావుగార్లు తలంపులు చేసేవారు. వీరి తలంపులకు బలం చేకూర్చే విధంగానే ఉండేది హెడ్ మాష్టారు గారి ఆలోచన సరళి కూడ….!!

ఈ కారణంగానే దవిళేశ్వరం ఇరిగేషన్ బ్యారేజ్,,, తణుకు ఘగర్ ఫ్యాక్టరీ, విశాఖపట్టణం.. సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వంటి పారిశ్రామిక వాడలను నాడు మేమందరం చూసే భాగ్యం కలిగింది.. అక్కడ అంశాలన్నీటిని మా అందరికీ ఆశక్తి కలిగించేలా వివరిస్తూండేవారు హనుమంతరావు మాష్ట్రారు మరియు మార్కేండయ శర్మ మాష్టారు..!

అదే విధంగా ఆ మరుసటి సంవత్సరాలలో హైదరాబాదు, బొంబాయి…నాశిక్…షీర్డి, అజంతా గృహాలు… వరంగల్, భద్రాచలం వంటి పట్టణాలకు మమ్మల్నీ విహారయాత్రలకు తీసుకెళ్ళారు.  తల్లి తండ్రులను వదిలివచ్చామని బెంగ ఏ మాత్రం ఉండేది కాదు ఆ విహార యాత్రల సమయాలలో..!… ఎందుకంటే తమ ప్రేమ అభిమానాలతో తల్లి తండ్రులను మరిపిస్తుండేవారు మా ఉపాధ్యాయులు.

డిస్కవరీ  మరియు యానిమల్ ప్లానెట్ టి.వి.ఛానెళ్లు అందుబాటులో ఉండేవికావు ఆ రోజుల్లో..! అలాంటి సమయంలోనే  “జంతు ప్రపంచం” అనే ఇంగ్లీఘ డబ్బింగ్ సినిమా రిలీజ్ కాబడింది…!!..  జంతు, పశుపక్ష్యాదుల జీవని శైలి ఏ విధంగా ఉంటుందో మా విద్యార్ధులందరికి చూపించాలనే తాపత్రయం మా ఉపాధ్యాయులకి కలిగింది. ధీయటర్ యాజమాన్యాన్ని ఒప్పించి మా అందరికి దగ్గరుండి ఆ సినిమాను చూపించారు మా ఉపాధ్యాయులు.

నేడు డిస్కవరీ చానళ్లు…యానిమల్ ప్లానెట్ టి.వి.ఛానెళ్లు చూస్తున్న సందర్భాల్లో టైం మిషన్ ద్వారా ఓ మారు నాటి రోజుల్లోకి వెళ్లివచ్చిన భావన నేటికి మాకు కలుగుతూ ఉంటుంది…!!

“ప్రసవ వేదన కన్నతల్లికి కొద్ది క్షణాలే… కాని ఆస్ధాయి బాధ మాకు ప్రతి సంవత్సరం అనివార్యమే…  విడ్కోలు పలుకుతున్న చివరి బ్యాచ్ విద్యార్ధులను చూసినప్పుడు ఈ తరహా బాధ మా గుండెల్ని పిండేస్తూ ఉంటుంది……

ఎందుకంటే అంతదాకా వీరందరూ మాపిల్లలే కదా… మమ్మల్ని విడిచి వెళుతున్నమీరు బయట ప్రపంచంలో ఎట్లా ఇముడుతారో అని బెంగ ఆ క్షణంలో ఆవహిస్తూ ఉంటుంది…

కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మేము దండించి ఉండొచ్చు… మంచి నడత..విద్యా బుద్దులు అలవడాలని తద్వారా మీరు భవిష్యత్ లో మంచి స్ధాయికి చేరుకోవాలని మీ అందరిపట్ల మాకున్న అకాంక్ష..! ….. ఎందుకంటే సమాజంలో మీయొక్క ఉన్నతిని మా అందరి అంతస్ధులుగా, మీరు మాకు ఇచ్చే తరగని సిరులుగా భావించేవాళ్లం”…. అంటూ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో మా గురుదేవులు అందరూ పలికిన పలుకులు ఇప్పటికీ మా హృదయాలను తాకుతూనే ఉంటాయి..!

మాపై ఈ తరహా ప్రేమను చూపిన వారిలో చేబ్రోలు చిన్నయ్య బ్రహ్మ కవి.. షాహేబ్ దాస్, మార్కండేయ శర్మ, సత్యం మాష్టారు..సుభద్రా దేవి, విమలమ్మ..రుక్మాభాయ్..తదితర ఉపాధ్యాయులకే ఆగ్ర తాంబులం దక్కుతుందని చెప్పక తప్పదు.

“ శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే గురువులు సదా పూజ్యనీయులు… ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా… వారందరరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయులే… సమాజంలో వీరిపాత్ర చాల ఉన్నతమైనది, మరియు కీలకమైనది. అటువంటి ఉపాధ్యాయులు ఈ భూమిపై ప్రత్యక్ష దైవాలు… వారు ఉండే పాఠశాలలే నిజమైన దేవాలయాలు..అటువంటి ఉపాధ్యాయులు ఉన్న ఈ దేవాలయంలో చదువుకున్న మీరందరూ ధన్యులు…! నాకంటూ మరో జన్మ ఉంటే ఉపాధ్యాయుడ్ని కావాలని కోరుకుంటున్నాను… నేటి మీ ఉపాధ్యాయుల వంటి వారి సరసనే పనిచేయాలని కోరుకుంటున్నాను”…..  అని నాటి మా స్కూల్ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరయిన మున్సిపల్ చెర్మెన్ గారు అంటుంటే మా గురువుల గొప్పతనం ఏమిటో మా అందరికి బాగా తెలిసొచ్చింది ఆక్షణంలో…!… అంత గొప్ప వారిని విడిచి వెళుతున్నమన్న బాధ మమ్మల్ని ఆవహించింది ఆక్షణంలో…!!

నాటి మా మున్సిపల్ చెర్మెన గారు మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటీకీ ఓ విషయంలో బాధ పడుతూ ఉంటాం…….మేము  ఉపాధ్యాయులం కాలేకపోయినందుకు….. తద్వారా నాటి మా ఉపాధ్యాయుల మాదిరిగానే విద్యార్ధుల గుండె గూడుల్లో ప్రత్యక్ష దైవాలుగా సుస్ధిర స్ధానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయి నందుకు…!!

-శ్రీపాద శ్రీనివాస్

LEAVE A RESPONSE